Share News

అబిద్‌ అలీ కన్నుమూత

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:39 AM

భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ అబిద్‌ అలీ (83) మరణించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు సంతానం...

అబిద్‌ అలీ కన్నుమూత

భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌

అరంగేట్ర టెస్ట్‌లో

ఉత్తమ బౌలింగ్‌

బంతి, బ్యాటుతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఘనత

ఆ తరంలో అత్యుత్తమ ఫీల్డర్‌

హైదరాబాద్‌: భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ అబిద్‌ అలీ (83) మరణించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు సంతానం. ఓ కుమారుడు, కుమార్తె. అలీ కుమారుడు..భారత జట్టు మాజీ కీపర్‌ సయ్యద్‌ కిర్మాణీ అల్లుడు. కాగా, కుమారుడు కాలిఫోర్నియాలో క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో మర ణించాడు. ఇక, 1941లో హైదరాబాద్‌లో జన్మించిన అబిద్‌ అలీ..1967లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ అరంగేట్రం చేశారు. కుడిచేతి వాటం పేస్‌ బౌలర్‌ అయిన అబిద్‌ తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశారు. ఆ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు 6 వికెట్లు పడగొట్టారు. అప్పట్లో అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్‌ చేసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పారు. అలీ 29 టెస్ట్‌ల్లో 47 వికెట్లు పడగొట్టారు. ఈ టెస్ట్‌ల్లో ఏడు మ్యాచ్‌ల్లో అబిద్‌ అలీ బౌలింగ్‌తోపాటు, బ్యాటర్‌గా భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం అరుదైన విషయం. 1974లో వన్డేల్లోకి అడుగుపెట్టిన ఆయన 1975 ప్రపంచకప్‌ ఆడారు. మొత్తం 5 వన్డేల్లో 7 వికెట్లు తీశారు.


ధైర్యవంతుడైన క్రికెటర్‌..’

అబిద్‌ అలీ ధైర్యవంతుడైన క్రికెటర్‌. ఆల్‌రౌండర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయినా..జట్టుకు అవసరమైన సందర్భాలలో ఓపెనర్‌గా దిగారు. లెగ్‌సైడ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి బంతికే రెండుసార్లు వికెట్లు సాధించిన అరుదైన ఘనత ఆయన సొంతం.

- సునీల్‌ గవాస్కర్‌

అబిద్‌ కెరీర్‌ ఇలా..

బౌలర్‌గా:

టెస్ట్‌లు-29, వికెట్లు-47, బెస్ట్‌-6/55.

వన్డేలు- 5, వికెట్లు-7, ఉత్తమ బౌలింగ్‌-2/22.

బ్యాటర్‌గా:

టెస్ట్‌లు-29, పరుగులు-1018.

వన్డేలు-5, పరుగులు-93, అత్యధికం-70.


హైదరాబాద్‌ దిగ్గజం

1956లో హైదరాబాద్‌ స్కూల్స్‌కు ఆడడం ద్వారా అబిద్‌ క్రికెట్‌కు శ్రీకారం చుట్టారు. కేరళ జట్టుపై 82 పరుగులు చేసిన అలీ ఉత్తమ ఫీల్డర్‌ అవార్డును అందుకున్నారు. కొన్నేళ్ల తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో చేరారు. తొలుత వికెట్‌ కీపర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన తర్వాత బౌలర్‌గా మారారు. 1958-59లో హైదరాబాద్‌ జూనియర్‌ జట్టుకు ఆడిన అలీ మరుసటి ఏడాది రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో రంజీ ట్రోఫీలో సెంచరీ సాధించిన అలీకి ఆ ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్లలో చోటు దక్కింది. ఆసీస్‌ టూర్‌ తొలి టెస్ట్‌లో కెప్టెన్‌ ఎంఏకే పటౌడీ గాయంతో వైదొలగడంతో అలీకి తుది జట్టులో చోటు లభించింది. ఆ మ్యాచ్‌లో 6 వికెట్లతో ఉత్తమప్రదర్శన చేశాడు. మూడో టెస్ట్‌లో ఓపెనర్‌గా దిగిన అబిద్‌ 47 రన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆపై నాలుగో, చివరి టెస్ట్‌లో వరుసగా 81, 78 రన్స్‌ చేశారు.

చారిత్రక విజయాలలో..:

1971లో వెస్టిండీ్‌సలో పర్యటన భారత జట్టు టెస్ట్‌ చరిత్రలో మైలురాయి. 5 మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను భారత్‌ 1-0తో గెలిచింది. అప్పట్లో అత్యంత బలమైన విండీస్‌పై భారత్‌ నెగ్గిన తొలి టెస్ట్‌తోపాటు మొదటి టెస్ట్‌ సిరీస్‌ విజయం కావడం విశేషం. 1971లో ఇంగ్లండ్‌లో పర్యటన కూడా భారత్‌కు చరిత్రాత్మకం. 3 మ్యాచ్‌ల సిరీ్‌సను భారత్‌ 1-0తో నెగ్గింది. ఇంగ్లండ్‌పై మనకది తొలి టెస్ట్‌ సిరీస్‌ విజయం. భారత్‌ గెలిచిన ఓవల్‌ టెస్ట్‌లో విజయానికి అవసరమైన పరుగులను అబిద్‌ చేయడం విశేషం. ఈ రెండు సిరీస్‌ విజయాలు అందుకున్న భారత జట్టులో అబిద్‌ భాగమయ్యారు.


అద్భుత ఫీల్డర్‌:

అబిద్‌ అలీ తన తరంలో గొప్ప ఫీల్డర్‌గా పేరు గాంచారు. ఫతే మైదాన్‌ క్లబ్‌లో గంటల కొద్దీ ప్రాక్టీ్‌సలో ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించేవారు. క్యాచ్‌లు పట్టడాన్నీ సుదీర్ఘంగా సాధన చేసేవారు. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తేవారు.

కోచ్‌గా..:

రిటైరైన తర్వాత అలీ కోచ్‌గా పని చేశారు. ఈ సమయంలో హైదరాబాద్‌ జూనియర్‌ జట్టు సేవలు అందించారు. మాల్దీవులు, యూఏఈ జట్లకూ కోచ్‌గా వ్యవహరించారు. 2001-02లో రంజీ ట్రోఫీ సౌత్‌జోన్‌ లీగ్‌ చాంపియన్‌షి్‌ప గెలిచిన ఆంధ్ర జట్టుకు అబిద్‌ శిక్షణ ఇచ్చారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ క్రికెట్‌ అకాడమీ కోచ్‌గా పలువురు ఆటగాళ్లను తీర్చిదిద్దారు.

ఇవీ చదవండి:

ర్యాంకింగ్స్.. టాప్‌-5లో ముగ్గురు భారత స్టార్లు

ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..

లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2025 | 04:39 AM