Share News

Asia Cup Cricket 2025: ఆల్‌రౌండర్లే బలంగా

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:36 AM

టీ20 వరల్డ్‌కప్‌ చాంపియన్‌ టీమిండియా.. ఇప్పుడు ఆసియా కప్‌పై కన్నేసింది. బుధవారం యూఏఈ జట్టుతో జరిగే తమ తొలి మ్యాచ్‌ ద్వారా టైటిల్‌ వేటను ఆరంభించబోతోంది. ఇప్పటికే 8సార్లు విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి...

Asia Cup Cricket 2025: ఆల్‌రౌండర్లే బలంగా

బరిలోకి టీమిండియా

నేడు యూఏఈతో పోరు

రాత్రి 8 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

దుబాయ్‌: టీ20 వరల్డ్‌కప్‌ చాంపియన్‌ టీమిండియా.. ఇప్పుడు ఆసియా కప్‌పై కన్నేసింది. బుధవారం యూఏఈ జట్టుతో జరిగే తమ తొలి మ్యాచ్‌ ద్వారా టైటిల్‌ వేటను ఆరంభించబోతోంది. ఇప్పటికే 8సార్లు విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గానే పోటీపడుతోంది. అలాగే ఆదివారం పాకిస్థాన్‌తో జరుగబోయే సమరానికి యూఏఈతో మ్యాచ్‌ను రిహార్సల్‌గా భావిస్తోంది. అయితే, భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ప్రధాన కోచ్‌గా గంభీర్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది. పేస్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్లను బరిలోకి దించేందుకు అతను ఇష్టపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీ్‌సలోనూ ఇదే సూత్రాన్ని అనుసరించి సుందర్‌కు అవకాశమిచ్చాడు. ఎనిమిదో నెంబర్‌ వరకు బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని గంభీర్‌ భావిస్తుంటాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్‌ విభాగంలో హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌లకు జతగా శివమ్‌ దూబేను కూడా ఆడించే ఆలోచనలో ఉన్నాడు. దూబే స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొని వేగంగా పరుగులు సాధించగలడు. అప్పుడు కుల్దీప్‌ యాదవ్‌ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. స్పిన్‌లో వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌కు తోడు అభిషేక్‌తో ఓవర్లు వేయించే అవకాశం ఉంది. ఇక కీపర్‌గా సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి జితేశ్‌ శర్మను ఆడించడం ఖాయమే. నెట్‌ సెషన్స్‌లోనూ జితేశ్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడం దీనికి ఊతమిస్తోంది. గిల్‌ జట్టులో చేరడంతో ఓపెనర్‌గా శాంసన్‌ స్థానం గల్లంతైంది. అతడిని మూడో నెంబర్‌లో ఆడించాలని చూసినా అక్కడ తిలక్‌ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. జితేశ్‌ను ఏడు, అక్షర్‌ను ఎనిమిదో స్థానంలో బరిలోకి దించవచ్చు. మిడిలార్డర్‌లో తిలక్‌, కెప్టెన్‌ సూర్య, హార్దిక్‌ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్‌ ప్రధాన పేసర్లుగా ఉంటారు.


యూఏఈ పోటీ ఇచ్చేనా..? యూఏఈ జట్టుకిది భారీ మ్యాచ్‌గానే చెప్పవచ్చు. స్టార్‌ బౌలర్‌ బుమ్రాను ఎదుర్కోవడమే కాకుండా.. గిల్‌, సూర్యలాంటి బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడం అసోసియేట్‌ సభ్యదేశానికి అరుదుగా లభించే అవకాశం. కెప్టెన్‌ మహ్మద్‌ వసీమ్‌, రాహుల్‌ చోప్రా, సిమ్రన్‌జీత్‌ సింగ్‌లపై జట్టు ఎక్కువగా ఆధారపడింది. ఏదేమైనా భారత్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తామని కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ అన్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌, అభిషేక్‌, తిలక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), జితేశ్‌, హార్దిక్‌, శివమ్‌ దూబే, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, వరుణ్‌.

యూఏఈ: వసీమ్‌ (కెప్టెన్‌), షరాఫు, రాహుల్‌, ఆసిఫ్‌, ఫరూఖ్‌, హర్షిత్‌, సిమ్రన్‌జీత్‌, జవదుల్లా, హైదర్‌, సిద్దిఖీ, రోహిద్‌.

పిచ్‌

గత మార్చిలో భారత్‌ ఇక్కడ చాంపియన్స్‌ ట్రోఫీ ఆడిన సమయంలో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కానీ ప్రస్తుతం దుబాయ్‌ ట్రాక్‌ పచ్చికతో కనిపిస్తోంది. దీంతో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 05:36 AM