Sri Lanka Cricket Team: ఇక్కడ ఆడలేం టూర్ రద్దు చేయండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:06 AM
ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టు క్రికెటర్లు తమ భద్రతపై ఆందోళనగా ఉన్నారు. ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో...
పాక్‌లో భద్రతపై ఆందోళనలో లంక క్రికెటర్లు
సందిగ్ధంలో వన్డే సిరీస్
రావల్పిండి: ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టు క్రికెటర్లు తమ భద్రతపై ఆందోళనగా ఉన్నారు. ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండడం అంత క్షేమకరం కాదని తమ దేశ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) వర్గాలు తెలిపాయి. లంక జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు గురువారం స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా సమాచారం. ఆతిథ్య పాక్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా లంక ఇప్పటికే తొలి మ్యాచ్ ఆడేసింది. రెండోది గురువారం, ఆఖరిదైన మూడోది శనివారం జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు వేదిక రావల్పిండి. అయితే, దాడి జరిగిన ఇస్లామాబాద్ నగరం, రావల్పిండికి అత్యంత సమీపంలోనే ఉండడం గమనార్హం. తమ భద్రత విషయమై కలవరపడుతూ లంక జట్టులోని కొందరు ఆటగాళ్లు.. ఈ పర్యటనను వెంటనే రద్దు చేయాల్సిందిగా తమ దేశ క్రికెట్ బోర్డును కోరారట. దీంతో ఈ సిరీస్ జరగడం సందిగ్ధంగా మారింది. మరోవైపు దాడి నేపథ్యంలో లంక జట్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న ఆ దేశ మంత్రి మొహిసిన్ నఖ్వీ బుధవారం లంక జట్టు అధికారులను కలిశారు. దాడి ఘటన గురించి ఆందోళనపడొద్దని, లంక ఆటగాళ్లకు అన్నివిధాలా భద్రత ఉంటుందని ఆ జట్టు అధికారులకు నఖ్వీ హామీ ఇచ్చారు. 2009 మార్చిలో పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన లంక క్రికెట్ జట్టు బస్సుపై లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో అంతర్జాతీయ జట్లు పాక్‌లో ఆడేందుకు నిరాకరించడంతో పదేళ్లపాటు ఇక్కడ ఎలాంటి క్రికెట్ సిరీ్‌సలు జరగని సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి