Share News

South Africa Win: నిప్పులు చెరిగిన సైమన్‌ హార్మర్‌.. భారత్ ఘోర పరాజయం

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:42 PM

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజుకు చేరుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్షిణాఫ్రికాకు అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

South Africa Win: నిప్పులు చెరిగిన సైమన్‌ హార్మర్‌..  భారత్ ఘోర పరాజయం
India vs South Africa

గువాహటి టెస్టు(Guwahati Test result)లో టీమిండియా ఘోరంగా ఓడింది. సౌతాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ ఆరు వికెట్లు తీసి.. భారత్ ఓటమిని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో సైమన్ దెబ్బకు భారత్ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో 408 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ గెలుపుతో 2-0తో ప్రొటీస్ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. 27/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ చకచకా వికెట్లను కోల్పోయింది. ఆల్ రౌండర్ జడేజా(54*) ఒక్కడు కాసేపు భారత్ ఓటమిని ఆపగలిగాడు.


భారత్ రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja)54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడి తర్వాత ఆశించిన స్థాయిలో ఎవ్వరూ రాణించలేదు. వాషింగ్టన్ సుందర్16, సాయి సుదర్శన్ 14, జైస్వాల్ 13 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్(6), కెప్టెన్ రిషబ్ పంత్(7) మరోసారి విఫలమయ్యారు. ఇక ప్రొటిస్ బౌలర్లలో సైమన్ హార్మర్(Simon Harmer) ఆరు వికెట్లతో చెలరేగాడు. కేశవ్‌ మహరాజ్‌ రెండు, యాన్సెన్‌, ముత్తుస్వామి చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక సమష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడమే కాదు..వైట్‌వాష్‌(whitewash India) కూడా చేసింది.


రెండో టెస్టు సాగిందిలా..

భారత్‌- సౌతాఫ్రికా(India VS South Africa Test) మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సౌతాఫ్రికా జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో పేసర్‌ మార్కో యాన్సెన్‌ ఆరు వికెట్లతో సత్తా చాటి.. ప్రొటీస్ జట్టుకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.


ఆ తర్వాత భారత్ ను ఫాలో ఆన్‌ ఆడించకుండా దక్షిణాఫ్రికా(South Africa) మళ్లీ బ్యాటింగ్‌ చేసింది. నాలుగో రోజు 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్‌ జట్టు తమ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి.. టీమిండియాకు 549 పరుగుల ( తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288+ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 260) భారీ లక్ష్యాన్ని విధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (13)ను యాన్సెన్‌ వెనక్కి పంపగా.. కేఎల్‌ రాహుల్‌(KL Rahul) (6)ను సైమన్‌ హార్మర్‌(Simon Harmer) అవుట్‌ చేశాడు. ఇలా నాలుగో రోజే ప్రారంభమైన భారత్ ఓటమి.. ఐదో రోజు తొలి సెషన్ లోనే పరిపూర్ణమైంది.


ఇవి కూడా చదవండి:

Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర

Basketball Player Death: బాస్కెట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ 16 ఏళ్ల నేషనల్ ప్లేయర్ దుర్మరణం

Updated Date - Nov 26 , 2025 | 01:57 PM