India T20 Squad: గిల్ వచ్చేశాడు
ABN , Publish Date - Aug 20 , 2025 | 03:14 AM
అనేక ఊహాగానాల మధ్య ఎట్టకేలకు ఆసియాకప్ టీ20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవలి టెస్టు సిరీ్‌సలో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయనున్నాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో...
వైస్ కెప్టెన్‌గా ఎంపిక
సూర్యకే పగ్గాలు
అనేక ఊహాగానాల మధ్య ఎట్టకేలకు ఆసియాకప్ టీ20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవలి టెస్టు సిరీ్‌సలో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయనున్నాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ.. శ్రేయాస్ అయ్యర్‌ను పట్టించుకోకపోవడం ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచింది. అలాగే ఫామ్‌లో ఉన్న జైస్వాల్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేయగా.. ఐపీఎల్‌లో ఆకట్టుకోలేకపోయిన రింకూ సింగ్, హర్షిత్‌లను మాత్రం జట్టులోకి తీసుకోవడం గమనార్హం.
ఆసియా కప్‌నకు టీమిండియా
ముంబై: ఏడాది తర్వాత శుభ్‌మన్ గిల్ భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెల 9 నుంచి యూఏఈలో జరిగే ఆసియాకప్ టోర్నీ కోసం మంగళవారం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుండగా.. అతడికి డిప్యూటీగానూ గిల్ వ్యవహరించనున్నాడు. గతంలో అక్షర్ ఈ బాధ్యతలు నిర్వర్తించాడు. స్టార్ పేసర్ బుమ్రా సైతం జట్టులోకి రావడంతో పేస్ బలం రెట్టింపు కానుంది. అయితే ఐపీఎల్‌తో పాటు ఏడాది కాలంగా ఈ ఫార్మాట్‌లో విశేషంగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. ఇక 25 ఏళ్ల గిల్ చివరి టీ20 మ్యాచ్‌ను గతేడాది జులై 30న శ్రీలంకపై ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లకు అతన్ని ఎంపిక చేయలేదు. ఇక ఇంగ్లండ్‌తో ఇటీవలి టెస్టు సిరీ్‌సలో గిల్ అంచనాలకు మించి రాణించడం చూశాం. జైస్వాల్ సైతం పోటీలో ఉన్నా గిల్ వైపే మొగ్గు చూపారు. అయితే గిల్ రాకతో జట్టు ఓపెనర్ల సంఖ్య అభిషేక్, శాంసన్‌లతో కలిపి మూడుకు చేరింది. దీంతో అభిషేక్‌కు జతగా గిల్‌ను ఆడించి శాంసన్‌ను మిడిలార్డర్‌కు మార్చే అవకాశం ఉంది. అటు జట్టు దుబాయ్ చేరాక ప్రత్యర్థి జట్టు బలాలు, పరిస్థితులను గమనించి గిల్‌ను ఎక్కడ ఆడించాలనేది నిర్ణయం తీసుకుంటారని అగార్కర్ తెలిపాడు. బ్యాటింగ్ విభాగంలో హార్దిక్, తిలక్ వర్మ, శివమ్ దూబేలతో పాటు ఐపీఎల్‌లో ఇబ్బందిపడిన హిట్టర్ రింకూ సింగ్ చోటు దక్కించుకున్నాడు. బ్యాకప్ కీపర్‌గా జితేశ్ శర్మపై సెలెక్టర్లు నమ్మకముంచారు. ధ్రువ్ జురెల్ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నా అతడిని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ఆర్‌సీబీ తరఫున జితేశ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

శ్రేయా్‌సకు నిరాశ
శ్రేయాస్ ఎదురుచూడాల్సిందే..
ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు సారథిగా తన జట్ల (కోల్‌కతా, పంజాబ్)ను ఫైనల్‌కు చేర్చడంతో పాటు బ్యాటింగ్‌లోనూ శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో 175 స్ట్రయిక్ రేట్‌తో 604 పరుగులు సాధించాడు. అటు చాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఫార్మాట్ ఏదైనా చెలరేగి గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ, రంజీ, ఇరానీ ట్రోఫీల్లోనూ ముంబై జట్టును విజేతగా నిలిపాడు. అయినా టీ20 జట్టులో శ్రేయా్‌సకు చోటు దక్కకపోవడంతో సెలెక్టర్లపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. కనీసం స్టాండ్‌బై ఆటగాడిగానూ పనికిరాడా? అని విమర్శిస్తున్నారు. అయితే వీటికి సమాధానంగా అన్నట్టు అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘ఆసియాక్‌పనకు శ్రేయాస్ ఎంపిక కాకపోవడం దురదృష్టకరం. ఇందులో అతడి తప్పూ లేదు.. మా తప్పూ లేదు. ఎందుకంటే శ్రేయాస్‌ను ఎవరి స్థానంలో తీసుకోవాలో చెప్పండి? జట్టులో అత్యంత పోటీ వాతావరణం ఉంది. అందుకే తను మరికొంత కాలం వేచిచూడాల్సిందే’ అని అగార్కర్ తేల్చాడు.
జట్టులోకి పేసర్ బుమ్రా
బుమ్రా రాకతో..: ఆసియాకప్ తర్వాత విండీ్‌సతో టెస్టు సిరీస్ ఉండడంతో స్టార్ పేసర్ బుమ్రా ప్రాతినిధ్యంపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే సెప్టెంబరు 28న ఫైనల్ జరుగనుండగా.. అక్టోబరు 2 నుంచే టెస్టు ఆరంభమవుతుంది. అయితే పెద్ద టోర్నీల్లో బుమ్రా ఆడితేనే బావుంటుందనే ఆలోచనతో సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. దీంతో టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రా ఈ ఫార్మాట్‌లో ఆడబోతున్నాడు. ఏదిఏమైనా బుమ్రా రాకతో భారత బౌలింగ్ మరింత పటిష్టం కానుంది. అతడికి జతగా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనున్నారు. హర్షిత్ రాణా రిజర్వ్ పేసర్‌గా ఉండనున్నాడు. అంచనా వేసినట్టుగానే స్పిన్ త్రయం కుల్దీప్, అక్షర్, వరుణ్ చక్రవర్తిలకు చోటు దక్కింది. కోచ్ గంభీర్ ఆల్‌రౌండర్లకు ప్రాముఖ్యం ఇస్తుండడంతో వాషింగ్టన్ సుందర్‌ను కూడా తీసుకుంటారనే కథనాలు వెలువడ్డాయి. కానీ అతడిని స్టాండ్‌బైగానే పరిగణించారు.

సూర్యకు చెక్ పెట్టేందుకేనా?
భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఇప్పుడు టీ20 జట్టు వైస్‌కెప్టెన్‌గానూ ఎంపిక చేశారు. ఏడాది క్రితం కూడా అతను ఈ బాధ్యతలు నిర్వర్తించినా అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశం కాలేదు. కానీ తాజా పరిణామాలు మాత్రం ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్‌కు ఓ హెచ్చరికగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో సూర్య మెరుగ్గానే రాణించినా గతేడాది అంతర్జాతీయ స్థాయిలో మాత్రం 26.81 సగటుతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 సిరీస్‌లో సూర్య ఐదు మ్యాచ్‌ల్లో చేసింది 28 పరుగులే. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. కెప్టెన్‌గా సూర్య విజయాలశాతం ఎక్కువగానే ఉన్నా ఆసియాక్‌పలో బ్యాటర్‌గా ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో గిల్‌కు పగ్గాలు అప్పగించేందుకు సెలెక్టర్లు ఏమాత్రం సంకోచించరు. గిల్ ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో సారథిగా, బ్యాటర్‌గా శభాష్ అనిపించుకున్నాడు. అటు వన్డే ఫార్మాట్‌లోనూ కెప్టెన్ రోహిత్ కెరీర్‌పై సందేహాలు నెలకొనగా.. వైస్ కెప్టెన్ గిల్‌ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇలా అన్ని ఫార్మాట్లకు గిల్ ఏకైక సారథిగా మారే రోజు దగ్గరలోనే ఉందని క్రీడా పండితులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే ప్రశ్న అగార్కర్‌ను విలేకరులు అడగ్గా.. ‘నేను ప్రస్తుతం టీ 20 క్రికెట్ గురించే చెప్పగలను. గిల్ ఇప్పటికే టెస్టు కెప్టెన్. అలాగే అతను చివరిసారి టీ20 ఆడినప్పుడు వైస్‌కెప్టెన్‌గానే ఉన్నాడు. ఇంగ్లండ్‌లో మాదిరే ఇక్కడా అతడిలో నాయకత్వ లక్షణాలు చూడాలనుకుంటున్నాం’ అని అగార్కర్ సమాధానమిచ్చాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా.
స్టాండ్‌బై: ప్రసిద్ధ్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వీ జైస్వాల్.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News