Satwik Chirag Shine Again: అద్వితీయం
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:40 AM
నిరుడు పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి క్వార్టర్‌ఫైనల్లోనే పరాజయం పాలై నిరాశగా వెనుదిరిగింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి..
మరో కాంస్యంతో మెరిసిన సాత్విక్, చిరాగ్ జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప
పారిస్: నిరుడు పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి క్వార్టర్‌ఫైనల్లోనే పరాజయం పాలై నిరాశగా వెనుదిరిగింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి.. అదే వేదిక.. కానీ టోర్నీ ప్రపంచ చాంపియన్‌షిప్.. ఈసారి ఫలితం కూడా మారింది. విశ్వక్రీడల్లో పతకం దూరమైనా, ప్రపంచ టోర్నీలో కాంస్యం సాధించి సాత్విక్, చిరాగ్ జంట అబ్బురపరిచింది. శనివారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జోడీ సాత్విక్/చిరాగ్ 19-21, 21-18, 12-21తో ప్రపంచ 11వ ర్యాంకరైన చైనా జంట చెన్ బో యాంగ్/లియు యీ చేతిలో పోరాడి ఓడింది. సెమీస్ ఓటమితో సాత్విక్ ద్వయం కంచు పతకానికే పరిమితమైనా.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండోసారి పతకం నెగ్గి అ‘ద్వితీయ’ం అనిపించుకుంది. ఈ మెగా టోర్నీలో రెండు పతకాలు సాధించిన భారత డబుల్స్ జోడీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2022 టోక్యోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాత్విక్/చిరాగ్ జంట కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.
షి యుకి, యమగూచిలకు సింగిల్స్ టైటిళ్లు: ప్రపంచ చాంపియన్‌షిప్ సింగిల్స్ టైటిళ్లను షి యుకి (చైనా), అకానె యమగూచి (జపాన్) దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో షి యుకి 19-21, 21-10, 21-18తో కున్లావత్ వితిసార్న్ (థాయ్‌లాండ్)పై గెలిచి విజేతగా నిలిచాడు. ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), విక్టర్ లాయ్ (కెనడా) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో యమగూచి 21-9, 21-13తో చైనా స్టార్ చెన్ యుఫీని చిత్తుచేసి స్వర్ణం అందుకుంది. అన్ సే యంగ్ (కొరియా), క్వార్టర్స్‌లో సింధును ఓడించిన ఫుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా) కాంస్య పతకాలు సాధించారు. కొరియా జంట సియో సంగ్ జే/కిమ్ వోన్ హా 21-17, 21-12తో చైనా జోడీ చెన్ బో యాంగ్/లూ యికి షాకిచ్చి పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది.
15
ఇప్పటిదాకా ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత షట్లర్లు సాధించిన పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు (ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ (ఓ రజతం, ఓ కాంస్యం), మహిళల డబుల్స్‌లో జ్వాల/అశ్వినీ (కాంస్యం), పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (రజతం), ప్రకాశ్ పదుకోన్ (కాంస్యం), సాయి ప్రణీత్ (కాంస్యం), ప్రణయ్ (కాంస్యం), లక్ష్య సేన్ (కాంస్యం), పురుషుల డబుల్స్‌లో సాత్విక్/చిరాగ్ (రెండు కాంస్యాలు) పతకాలు గెలిచారు.
అడ్డంకులు అధిగమించి..
గతేడాది పారిస్ విశ్వక్రీడల వైఫల్యం నుంచి కోలుకోవడానికి అమలాపురం కుర్రాడు సాత్విక్, ముంబై షట్లర్ చిరాగ్‌కు చాలా రోజులే పట్టింది. ఒలింపిక్స్ తర్వాత ఏకంగా మూడున్నర నెలలపాటు విశ్రాంతి తీసుకొన్నారు. ఆ తర్వాత 2024 నవంబరులో చైనా మాస్టర్స్ బరిలోకి దిగిన సాత్విక్ జంట సెమీస్ చేరింది. అయితే, చిరాగ్ వెన్నునొప్పితో బాధపడడంతో మళ్లీ రెండు నెలలు ఆటకు దూరమైంది. జనవరిలో రీఎంట్రీ ఇచ్చిన ఈ జోడీ.. మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీ్‌స చేరింది. క్రమంగా పరిస్థితులు గాడిలో పడుతున్న సమయంలో ఫిబ్రవరిలో సాత్విక్ తండ్రి మరణం విషాదాన్ని మిగిల్చింది. చిరాగ్‌తో కలిసి ఖేల్‌రత్న అవార్డు అందుకునేందుకు వెళ్తున్న సమయంలో సాత్విక్ తండ్రి కాశీ విశ్వనాథం గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకొని బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సాత్విక్ జంట పోటీపడ్డా.. ఆ టోర్నీలో రాణించలేకపోయింది. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూనే సాత్విక్, చిరాగ్ ద్వయం వరల్డ్ చాంపియన్‌షి్‌పనకు సిద్ధమైంది. కానీ, ఈ టోర్నీలో మాత్రం ఎక్కడా తడబడకుండా సెమీస్‌దాకా చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రీక్వార్టర్స్‌లో ఆరో సీడ్, చైనా జోడీ లియాంగ్-వాంగ్ చాంగ్‌లను ఓడించిన సాత్విక్ ద్వయం.. క్వార్టర్స్‌లో ఆరొన్ చియా-సో వూ యిక్జ్‌జీపై నెగ్గిన తీరు అద్భుతం. ఇక, సెమీస్‌లో ఓడినా, ఓవరాల్‌గా రెండో ప్రపంచ పతకంతో సాత్విక్ జంట కెరీర్‌లో మరో మెట్టు పైకెక్కింది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి