U19 coach: హెడ్ కోచ్‌పై క్రికెటర్ల దాడి.. రంగంలోకి బీసీసీఐ!
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:04 PM
పుదుచ్చేరి క్రికెట్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. అండర్ 19 జట్టు హెడ్ కోచ్ వెంకట రమణపై ముగ్గురు స్థానిక ఆటగాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్ నుదిటిపై 20 కుట్లు.. భుజం ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పుదుచ్చేరి క్రికెట్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అండర్ 19 జట్టు హెడ్ కోచ్ ఎస్.వెంకట రమణపై ముగ్గురు స్థానిక ఆటగాళ్లు(Puducherry cricketers) దాడి చేశారు. అయితే ఈ వివాదం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జట్టును సెలక్ట్ చేయడంలో జరిగిన తగాదాతో ముడిపడి ఉంది. జట్టులో తమకు స్థానం దక్కకపోవడంతో ఆగ్రహించిన ప్లేయర్లు.. కోచ్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.
కోచ్ వెంకట రమణ(Venkata Ramana) నెట్స్‌లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహిస్తుండగా ముగ్గురు స్థానిక ఆటగాళ్లు కార్తికేయన్ జయసుందరం, అరవింద రాజ్, సంతోష్ కుమారన్ అక్కడికి వచ్చారు. కోచ్‌తో దురుసుగా ప్రవర్తిస్తూ.. వారితో ఉన్న బ్యాట్‌తో కొట్టిన్నట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. వెంకట రమణకు నుదిటిపై 20 కుట్లు, భుజానికి ఫ్రాక్చర్ అయింది. సదరు ప్లేయర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కారణం అదేనా?
ఈ వివాదం వెనుక పెద్ద కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. పుదుచ్చేరి క్రికెట్‌లో స్థానిక ఆటగాళ్లను నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. స్థానిక ఆటగాళ్ల స్థానంలో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లను ఫేక్ డాక్యుమెంట్ల సాయంతో జట్టులో చేర్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం 2021 నుంచి రంజీ ట్రోఫీలో కేవలం ఐదుగురు స్థానిక ఆటగాళ్లను మాత్రమే ఆడించారు. దీనితో స్థానిక క్రికెటర్లలో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ఈ రూపంలో బయటపడినట్లు సమాచారం.
బీసీసీఐ ఆగ్రహం..
కోచ్‌పై జరిగిన దాడి, ఫేక్ డాక్యుమెంట్స్ ఆరోపణల నివేదిక బయటకు రావడంతో బీసీసీఐ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. బోర్డు సెక్రటరీ దేవజీత్ సైకియా ఈ విషయంపై స్పందించారు.‘ఈ సంఘటనతో పాటు, నివేదించిన ఆరోపణలపై కూడా విచారణ చేయిస్తాం. ఈ సమస్య కేవలం పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ పరిధికి మాత్రమే పరిమితం కాదు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో విచారణ జరగడం ఖాయం’ అని తెలిపారు.
ఇవీ చదవండి:
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్
సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు