Share News

Vizag girl Karuna Kumari: తెలుగు ఖ్యాతిని పతాక స్థాయికి చేర్చిన అంధ బాలిక..

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:13 PM

మొదటిసారి నిర్వహించిన అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో తెలుగమ్మాయి ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇంతకీ ఎవరామె? ఆమె నేపథ్యం ఏంటంటే...

Vizag girl Karuna Kumari: తెలుగు ఖ్యాతిని పతాక స్థాయికి చేర్చిన అంధ బాలిక..
Vizag girl Karuna Kumari

ఇంటర్నెట్ డెస్క్: మొన్నటివరకూ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన సభ్యుల్లో తెలుగమ్మాయి శ్రీ చరణి ఉండటం పట్ల తెలుగు ప్రజలు ఎంతగానో గర్వపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో మరో తెలుగమ్మాయీ అదరగొడుతోంది. తొలిసారి నిర్వహించిన అంధ మహిళల క్రికెట్ టీ20 ప్రపంచ కప్‌(Visually Challenged T20 World Cup)లో తానూ సభ్యురాలై తెలుగు ఖ్యాతిని పతాక స్థాయికి చేర్చింది. ఆమే.. పాంగి కరుణ కుమారి(Pangi Karuna Kumari). ఓ 15 ఏళ్ల బాలిక సాధించిన ఈ ఘనత పట్ల మరోసారి ఇరు తెలుగు రాష్ట్రాలు గర్వపడుతూ.. ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నాయి.


ఎవరీ కరుణ కుమారి.?

అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పు కనుమలలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అంధ బాలిక కరుణ. ఆమె తల్లిదండ్రులు పాంగి సంధ్య(Sandhya), పాంగి రాంబాబు(Rambabu) గిరిజనులు. కరుణ ప్రస్తుతం.. విశాఖపట్నంలోని ప్రభుత్వ అంధ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది(Govt Residential School for the Visually Challenged). ఈమె పూర్తిగా అంధులైన క్రీడాకారుల కోసం ఉద్దేశించిన బీ1 కేటగిరీలో టీమిండియాకు ఎంపికైంది. క్రికెట్ ఆడేటప్పుడు కరుణ.. ముఖ్యంగా బంతి శబ్దం మీదే ఆధారపడుతుంది. బంతి వస్తోన్న దిశను పసిగట్టి అమాంతం దాన్ని షాట్‌గా మలుస్తుంది. కరుణ ఆడే విధానాన్ని గమనించిన భారత మాజీ అంధ క్రికెట్ టీమ్ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అజయ్ కుమార్ రెడ్డి.. ఆమె ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె టీమ్‌లో చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటిసారిగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఏపీ నుంచి ఓ తెలుగమ్మాయి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి.. విజేతగా నిలపడం శుభపరిణామమని అన్నారు.

Pangi Karuna Kumari.jpgఅంధ మహిళల టీ20 వరల్డ్ కప్ సభ్యురాలు కరుణ కుమారి


ఈ టోర్నీకి తమ కూతురు ఎంపికవ్వడం పట్ల నాడు కరుణ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 'కరుణ ఎంపిక పట్ల మా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది.' అని అన్నారు. ఈ విషయమై ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ.. కరుణకు అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ గెలిచిన సభ్యుల్లో కరుణ కుమారి ఉండటం పట్ల.. సహచరులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సీఎం అభినందనలు..

అంధుల మహిళా టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌, రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్లో నేపాల్‌పై అద్భుత విజయంతో జయకేతనం ఎగురవేసిన భారత టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మహిళల అసాధారణ ప్రతిభ దేశానికి గర్వ కారణంగా నిలిచిందని కొనియాడారు.


తొలిసారి నిర్వహించిన అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌నకు బెంగళూరు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, యూఎస్ వంటి దేశాలూ పాల్గొన్నాయి. సమర్థనం ట్రస్ట్ ఆఫ్ ది డిజేబుల్డ్ క్రికెట్ విభాగమైన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(CABI) ఈ టోర్నీని నిర్వహించింది. మొత్తం 21 లీగ్ మ్యాచ్‌లు, 2 సెమీఫైనల్స్, ఓ ఫైనల్ మ్యాచ్ జరిగాయి.


ఇవీ చదవండి:

అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..

ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..

Updated Date - Nov 23 , 2025 | 10:36 PM