US Open 2025: జొకో జోరు
ABN , Publish Date - Sep 04 , 2025 | 06:07 AM
25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్, మహిళల డిఫెండింగ్ చాంప్ అరియానా సబలెంక యూఎస్ ఓపెన్ సెమీస్‌కు దూసుకెళ్లారు. గతేడాది రన్నరప్, లోకల్ స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌తో...
యూఎస్ ఓపెన్
సెమీ్‌సకు నొవాక్, సబలెంక
న్యూయార్క్: 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్, మహిళల డిఫెండింగ్ చాంప్ అరియానా సబలెంక యూఎస్ ఓపెన్ సెమీస్‌కు దూసుకెళ్లారు. గతేడాది రన్నరప్, లోకల్ స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌తో ముఖాముఖి పోరులో ఏడో సీడ్ జొకో తన రికార్డును 11-0తో మరింతగా మెరుగుపర్చుకొన్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జొకో 6-3, 7-5, 3-6, 6-4తో నాలుగో సీడ్ ఫ్రిట్జ్‌పై సునాయాసంగా గెలిచాడు. ఈ క్రమంలో 53వసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరిన నొవాక్.. అమెరికా లెజెండ్ క్రిస్ ఎవర్ట్ 52సార్లు సెమీస్ చేరిన రికార్డును బద్దలుకొట్టాడు. సెమీస్‌లో అల్కారజ్‌తో జొకో అమీతుమీ తేల్చుకోనున్నాడు. తొలి సెట్‌లో నొవాక్ అలవోకగా నెగ్గినా.. రెండో సెట్‌లో ఫ్రిట్జ్ నుంచి పోటీ ఎదురైంది. అయితే, 5-5 వద్ద తనదైన దూకుడు ప్రదర్శించిన నొవాక్ సెట్‌ను సొంతం చేసుకొని 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ, మూడో సెట్‌లో ఫ్రిట్జ్ పోరాడి గెలిచినా.. ఆ తర్వాతి సెట్‌లో జొకో జోరు ముందు నిలవలేక పోయాడు. 2003లో చివరిసారి అమెరికా ఆటగాడు ఆండీ రాడిక్ న్యూయార్క్‌లో టైటిల్ నెగ్గాడు. ఈసారి ఫ్రిట్జ్ ఆ లోటు తీరుస్తాడనుకొంటే.. జొకో అడ్డుపడ్డాడు. కాగా, టాప్‌సీడ్ సబలెంకకు క్వార్టర్స్‌లో వాకోవర్ లభించింది. ప్రత్యర్థి మార్కెటా వొండ్రుసొవా (చెక్) ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. దీంతో ఆమె బరిలోకి దిగలేక పోయింది. శుక్రవారం జరిగే సెమీ్‌సలో గతేడాది ఫైనలిస్ట్ పెగులతో స బలెంక తలపడనుంది.
భాంబ్రి తొలిసారి..: యుకీ భాంబ్రి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరుకొన్నాడు. డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో భాంబ్రి-మైకేల్ వీనజ్ (న్యూజిలాండ్) జంట 6-4, 6-4తో జర్మనీకి చెందిన కెవిన్ క్రవీట్జ్-టిమ్ ప్యూట్జ్‌పై గెలిచింది.
నొవాక్ ‘సోడా పాప్’ సంబరాలు
మ్యాచ్ గెలిచిన తర్వాత జొకోవిచ్ ‘కె-పాప్ డీమన్ హంటర్స్’ సినిమాలోని ‘సోడా పాప్’ పాట డ్యాన్స్‌తో సంబరాలు చేసుకొన్నాడు. జొకో కుమార్తె తారకు ‘కె-పాప్ డీమన్ హంటర్స్’ అంటే ఎంతో ఇష్టం. కాగా, తార పుట్టిన రోజు కావడంతో.. ఆ డ్యాన్స్ మూమెంట్స్ ద్వారా కుమార్తెకు జొకో శుభాకాంక్షలు తెలిపాడు.
సినర్‌పై
రూ. 2.64 కోట్ల పందెం
ఈ ఏడాది యూఎస్ ఓపెన్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంప్ యానిక్ సినర్ నిలబెట్టుకొంటాడని కెనడా ర్యాపర్, సింగర్ డ్రేక్ భారీగా బెట్టింగ్ పెట్టాడు. ఇటలీ టాప్ సీడ్ ప్లేయర్‌పై డ్రేక్ రూ. 2.64 కోట్లు పందెం కాశాడు. ఒకవేళ సినర్ విజయం సాధిస్తే.. డ్రేక్‌కు రూ. 4.46 కోట్లు దక్కనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి