Share News

Rinku Singh Wedding: ఎంపీ ప్రియా సరోజ్‎తో యువ క్రికెటర్ రింకూ సింగ్ లవ్ మ్యారేజ్

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:38 PM

భారత యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ లవ్ మ్యారేజ్ (Rinku Singh Wedding) చేసుకోనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‎ను త్వరలో వివాహం చేసుకోనున్నాడు. మరికొన్ని రోజుల్లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగనుండగా, నవంబర్ నెలలో పెళ్లి జరుగుతుందని నివేదికలు వచ్చాయి.

Rinku Singh Wedding: ఎంపీ ప్రియా సరోజ్‎తో యువ క్రికెటర్ రింకూ సింగ్ లవ్ మ్యారేజ్
Rinku Singh wedding

భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే రింకూ సింగ్ (27) త్వరలో పెళ్లి (Rinku Singh Wedding) చేసుకోబోతున్నాడు. అవును అది కూడా మాములు వ్యక్తిని కాదు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యువ మహిళా ఎంపీ ప్రియా సరోజ్‌(26)ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరి పెళ్లి గురించి చర్చలు జరిగాయి. ఇప్పుడు వచ్చే జూన్ 8న ఆదివారం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోనున్నారు. నవంబర్ 18న వారణాసిలోని తాజ్ హోటల్‌లో పెళ్లి జరగనుందని తెలిసింది.


రింకూ సింగ్ ఎవరు

రింకూ సింగ్, 27 ఏళ్ల యువ క్రికెటర్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. 1997 అక్టోబర్ 12న అలీగఢ్‌లో జన్మించిన రింకూ, తన విధ్వంసక బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. భారత జాతీయ జట్టు తరఫున 2 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన రింకూ, 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ స్థానం సంపాదించాడు. అతని ఆటతీరు, ముఖ్యంగా ఐపీఎల్‌, అంతర్జాతీయ అరంగేట్రంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. రింకూ తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ ఎల్‌పీజీ పంపిణీ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.


ప్రియా సరోజ్ ఎవరు

ప్రియా సరోజ్, 26 ఏళ్ల యువ రాజకీయ నాయకురాలు, న్యాయవాది. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్‌ను 35,850 ఓట్ల తేడాతో ఓడించి, లోక్‌సభలో అతి పిన్న వయస్కురాలైన ఎంపీల్లో రెండో స్థానంలో నిలిచారు. ప్రియా ఢిల్లీలోని ఎయిర్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యను అభ్యసించి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ప్రియా సరోజ్ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేయడం విశేషం.


వీరి పరిచయం..

ప్రియా సరోజ్, రింకు సింగ్ మధ్య పరిచయం ప్రియా సరోజ్ స్నేహితురాలు ద్వారా జరిగింది. ఆ స్నేహితురాలి కుటుంబంలో ఒక సభ్యుడు క్రికెటర్ కావడం వల్ల, వీరి పరిచయం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లి వేడుక వారణాసిలో జరగనుంది. వివాహం రెండు కుటుంబాల అంగీకారంతో జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు క్రికెట్ అభిమానులు, రాజకీయ వర్గాల్లో కూడా ఈ పెళ్లిపై ఆసక్తి నెలకొంది.


ఇవీ చదవండి:

వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. 10 కంపెనీల లిస్టింగ్..

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 12:49 PM