Share News

Mithun Manhas BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్‌ ఏకగ్రీవం

ABN , Publish Date - Sep 29 , 2025 | 02:25 AM

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ క్రికెటర్‌ మిథున్‌ మన్హాస్‌ (45) ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆదివారం జరిగిన బోర్డు 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో...

Mithun Manhas BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్‌ ఏకగ్రీవం

  • సెలెక్షన్‌ కమిటీలో ఆర్‌పీ సింగ్‌, ఓజా

  • మహిళల కమిటీలో స్రవంతి నాయుడు

ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా ఢిల్లీ మాజీ క్రికెటర్‌ మిథున్‌ మన్హాస్‌ (45) ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆదివారం జరిగిన బోర్డు 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కొత్తగా ఎన్నికైన ఆఫీసు బేరర్లను ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా కొనసాగనున్నారు. కోశాధికారిగా భారత మాజీ స్పిన్నర్‌ రఘురామ్‌ భట్‌ బాధ్యతలు అందుకోనున్నాడు. ఐపీఎల్‌ చైర్మన్‌ పదవిని అరుణ్‌ ధూమల్‌ తిరిగి దక్కించుకున్నాడు. ఇక హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞాన్‌ ఓఝా, స్రవంతి నాయుడు పురుషుల, మహిళల సెలెక్షన్‌ కమిటీల సభ్యులుగా ఎంపికయ్యారు.

రేసులో ఒక్కడే..

బోర్డు అధ్యక్షుడిగా మన్హాస్‌ ఒక్కడే నామినేషన్‌ వేయడంతో.. అతడి ఎన్నిక లాంఛనమే అయింది. 70 ఏళ్లు నిండిన రోజర్‌ బిన్నీ బోర్డు రాజ్యాంగం ప్రకారం అనర్హుడు కావడంతో.. అతడి వారసుడిగా మిథున్‌ బోర్డు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ క్రమంలో బోర్డు ఛీప్‌గా సౌరవ్‌ గంగూలీ, బిన్నీ తర్వాత వరుసగా మూడో ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ కూడా మన్హాస్‌ కావడం విశేషం. 1997-98 నుంచి 2016-17 వరకు 20 ఏళ్లపాటు మన్హాస్‌ దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌, పార్ట్‌టైమ్‌ వికెట్‌ కీపర్‌గా ఢిల్లీ జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించాడు. 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 9,714 పరుగులు సాధించిన మన్హాస్‌.. 130 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, 55 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇక మౌలిక వసతుల కమిటీ సభ్యుడిగా ఆంధ్ర క్రికెట్‌ సంఘం కార్యదర్శి సానా సతీష్‌ను తీసుకున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ వ్యవహరించనున్నాడు.


సెలెక్షన్‌ కమిటీలో మార్పులు..

టీమిండియా మాజీ ఆటగాళ్లు ఆర్‌పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజాలకు సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీలో చోటు దక్కింది. ఇప్పటి వరకు ఒక సభ్యుడిగా ఉన్న ఎస్‌. శరత్‌ను జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీకి తిరిగి పంపారు. దీంతో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీలో భారత మాజీ ఆటగాళ్లు శివ సుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రా, ఆర్‌పీ సింగ్‌, ఓజా ఉన్నారు. మహిళల సెలెక్షన్‌ ప్యానెల్‌ చైర్మన్‌గా నీతూ డేవిడ్‌ స్థానంలో అమిత శర్మను ప్రకటించారు. కాగా 2005-2014 మధ్యకాలంలో భారత్‌కు ఆడిన హైదరాబాద్‌ ప్లేయర్‌ స్రవంతి నాయుడు కమిటీ సభ్యురాలిగా ఎంపికైంది. ఆమె ఒక టెస్టు, నాలుగు వన్డేలు, ఆరు టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇక మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కమిటీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా కేరళ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు జయేష్‌ జార్జ్‌ ఎంపికయ్యాడు.

14 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడితే..

అదనంగా కోటి

దేశవాళీ క్రికెట్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు బీసీసీఐ మరిన్ని చర్యలు తీసుకొంది. ఒక సీజన్‌లో 14 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి మ్యాచ్‌ ఫీజు కింద అదనంగా రూ. కోటి అందించనుంది. అంతేకాకుండా అండర్‌- 19, అండర్‌-16 ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే అర్హత సాధించాలంటే.. కనీసం ఒక ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాలనే నిబంధనను తీసుకువచ్చారు.

బీసీసీఐ ఆఫీసు బేరర్లు: మిథున్‌ మన్హాస్‌ (అధ్యక్షుడు), రాజీవ్‌ శుక్లా (ఉపాధ్యక్షుడు), దేవజిత్‌ సైకియా (కార్యదర్శి), ప్రభ్‌జీత్‌ భాటియా (జాయింట్‌ సెక్రటరీ), రఘురామ్‌ భట్‌ (కోశాధికారి)

పురుషుల సెలెక్షన్‌ కమిటీ: అజిత్‌ అగార్కర్‌ (చైర్మన్‌), శివ సుందర్‌ దాస్‌, అజయ్‌ రాత్రా, ఆర్‌పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా

మహిళల సెలెక్షన్‌ కమిటీ: అమిత శర్మ (చైర్‌పర్సన్‌), శ్యామా డే, సులక్షణ నాయక్‌, జయ శర్మ, స్రవంతి నాయుడు

ఇవి కూడా చదవండి

ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఎవరికీ అందని రికార్డు.. చరిత్రలో మొదటి జట్టుగా..

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 02:25 AM