Share News

Messi and CM Revanth Reddy Set to Thrill Hyderabad:పడిపోదాం మెస్సీ మాయలో

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:38 AM

ఒకరు ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ.. మరొకరు పొలిటికల్‌ స్టార్‌ రేవంత్‌రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే..

Messi and CM Revanth Reddy Set to Thrill Hyderabad:పడిపోదాం మెస్సీ మాయలో

ఒకరు ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ.. మరొకరు పొలిటికల్‌ స్టార్‌ రేవంత్‌రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే.. మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసి సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్న వారు. ఇప్పుడా ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు.

లియోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఓ సంచలనం. కోట్లాది ప్రేక్షకుల ఆరాధ్య దైవం. మైదానంలో చిరుతలా పరిగెత్తుతూ.. తనకు మాత్రమే సాధ్యమనిపించే అసాధారణ డ్రిబ్లింగ్‌తో బంతిని తన అధీనంలోకి తీసుకుంటూ గోల్‌ పోస్టుపై చేసే దాడిని ఎలా వర్ణించగలం? ఇప్పటిదాకా టీవీల్లో కళ్లప్పగించి చూసిన అతడి విన్యాసాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ అర్జెంటీనా దిగ్గజం భారత పర్యటన నేటి నుంచే. ముందుగా కోల్‌కతాలో అడుగుపెట్టనున్న మెస్సీ.. ఆ తర్వాత మన భాగ్యనగరాభిమానులను అలరించబోతున్నాడు. వాస్తవానికి తెలుగు ఫుట్‌బాల్‌ ప్రేమికులకు ఇది జీవితకాల అనుభవమే కానుంది. మెస్సీలాంటి ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు హైదరాబాద్‌కు వస్తాడని బహుశా ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరేమో.. కానీ ఆ అసాఽధ్యుడు స్థానిక ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తన మంత్రముగ్ధమైన ఆటను ప్రదర్శించనున్నాడు. సో.. మెస్సీ అభిమానులారా..

  • నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. చివరి 5 నిమిషాలు ఇద్దరూ బరిలోకి

  • హాజరుకానున్న రాహుల్‌ గాంధీ.. 2,500 పోలీసులతో భారీ భద్రత.. టికెట్‌ లేకుంటే నో ఎంట్రీ

  • అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ

  • 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్‌కు ఎంపిక

  • గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌గా గుర్తింపు

  • రూ.7,665 కోట్ల ఆస్తిపరుడు

  • ప్రతిష్ఠాత్మక ‘బాలన్‌ డి వోర్‌’ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్‌బాలర్‌

  • 2006లో జడ్పీటీసీగా రేవంత్‌ అరంగేట్రం

  • తర్వాతి ఏడాదే ఎమ్మెల్సీ, మరో రెండు ఏళ్లకే ఎమ్మెల్యేగా విజయోత్సాహం

  • 2018లో దెబ్బతగిలినా రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు

  • 2021లో పీసీసీ చీఫ్‌..2023 నాటికి 15 లక్షల కోట్ల జీడీపీ రాష్ట్రానికి సీఎం

కోల్‌కతా: దేశ ఫుట్‌బాల్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాకర్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ గోట్‌ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) భారత టూర్‌ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. మెస్సీతోపాటు అతడి ఇంటర్‌ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డీ పాల్‌, సువారెజ్‌ కూడా అభిమానులను అలరించనున్నారు. శనివారం, తొలిరోజు కోల్‌కతా నుంచి మెస్సీ పర్యటన మొదలవుతుంది.

మొదటి రోజు (శనివారం)

తెల్లవారుజాము 1.30 కోల్‌కతా చేరిక; ఉ. 9.30-10.30 మీట్‌ అండ్‌ గ్రీట్‌; ఉ.10.30-11.15 కోల్‌కతా కళాకారుడు మోంటీ పాల్‌ రూపొందించిన 70 అడుగుల తన విగ్రహం ‘మాన్యుమెంట్‌ డీ మెస్సీ’ని మెస్సీ ఆవిష్కరిస్తాడు. లేక్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భద్రత దృష్ట్యా వర్చువల్‌గా ప్రారంభిస్తాడు.


ఉదయం 11.15-12.00: సాల్ట్‌లేక్‌ స్టేడియానికి చేరిక; మ. 12.12-12.30: ఫ్రెండ్లీ మ్యాచ్‌, సన్మానం. కోచింగ్‌ క్లినిక్‌. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ను కలుస్తాడు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ పయనం.

రెండో రోజు (ఆదివారం) ముంబై

  • మ.3.30: క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో క్రికెట్‌ స్టార్లతో రాకెట్‌ స్పోర్ట్స్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో సచిన్‌ ఆడతాడు. రోహిత్‌, ధోనీ కూడా పాల్గొనే అవకాశం. సా.4.00: సెలెబ్రిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

  • సా.5.00: వాంఖడే స్టేడియంలో చారిటీ ఫ్యాషన్‌ షో. జాన్‌ అబ్రహాం, కరీనా, జాకీ ష్రాఫ్‌ పాల్గొంటారు.

మూడో రోజు (సోమవారం), ఢిల్లీ

‘గోట్‌’ టూర్‌లో చివరి అంకం. ప్రధాని మోదీతో సమావేశం. మ. 1.30: అరుణ్‌ జైట్లీ స్టేడియంలో సన్మాన కార్యక్రమం.

మెస్సీ.. మెస్సీ.. మెస్సీ.. ఇది ఒక పదం కాదు.. ప్రపంచ ఫుట్‌బాల్‌ భావోద్వేగం. ‘ఎదుగుదల’ లోపంతో ఏమైపోతాడో? అనుకొన్న వాడు.. తన ప్రతిభతో కోట్లాది మనసులను కొల్లగొట్టాడు. ఆటను ప్రేమించాడు.. కష్టాలకు ఓర్చాడు.. ఓర్పుతో నిలిచాడు.. పట్టుదలతో పోరాడాడు.. పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిశాడు.. విశ్వమే బంతిగా మారి.. తన కాలికింద వాలిపోయిందేమో అనేంతలా.. మైదానంలో మాయ చేసి.. సాకర్‌ మహోన్నత శిఖరంలా నిలిచాడు.. ఒకప్పుడు పొట్టిగా, పలుచగా, గాలొస్తే ఎగిరిపోయేలా కనిపించిన ఆ కుర్రాడు.. ఆ సమస్యలన్నింటినీ అధిగమించి తనదైన సామర్ధ్యంతో ఫుట్‌బాల్‌ అంటే మెస్సీ.. మెస్సీ అంటే ఫుట్‌బాల్‌ అనే స్థాయికి ఎదిగాడు. ఈ దిగ్గజ ఆటగాడి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

1.jpg

అందరివాడు

అమ్మమ్మ చలవే..

మెస్సీ ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాలర్‌ అయ్యాడంటే అది అతడి అమ్మమ్మ సెలియా ఒలివేరా చలవే. సాకర్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని మెస్సీ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. కానీ పొట్టిగా ఉండడంతో ఆటకు పనికి రాడని స్వస్థలం రొసారియోలో కోచ్‌లు ఎద్దేవా చేశారు. కానీ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా ఎదిగే సత్తా, నైపుణ్యాలు మనుమడికి పుష్కలంగా ఉన్నాయని భావించిన సెలియా..కోచ్‌లను ఒప్పించి శిక్షణ ఇప్పించారు. ఆమె నమ్మకం వమ్ముకాలేదు. అలా మెస్సీ దిగ్గజ సాకర్‌ ఆటగాడయ్యాడు. అయితే మెస్సీకి 11 సంవత్సరాల వయస్సులో సెలియా కన్నుమూశారు. దాంతో అతడి గుండె బద్దలయ్యింది. ఆ విషాదం నుంచి కోలుకొని తిరిగి ఆటపై మనసు లగ్నం చేయడానికి మెస్సీకి చాలాకాలం పట్టింది. అమ్మమ్మకు నివాళిగా..తాను చేసిన ప్రతి గోల్‌ తర్వాత మెస్సీ తన రెండు చేతులు ఆకాశంవైపు చూపుతుంటాడు.


హార్మోన్‌ లోపంతో సతమతం..

మెస్సీ చిన్నతనం నుంచే సిగ్గరి. దీంతోపాటు ఎత్తు కూడా తక్కువే. కానీ, ఎప్పుడైతే ఫుట్‌బాల్‌ను టచ్‌ చేశాడో.. అతడిలో ఏదో తెలియని అనుభూతి.. సంతోషంతో ముఖం వెలిగిపోయింది. ఇక్కడి నుంచి సర్వం మారిపోయింది. ఎప్పుడో ఒక్కసారి మాట్లాడే పిల్లవాడు.. హఠాత్తుగా డ్రిబ్లింగ్‌, పాస్‌లు, గోల్స్‌తోనే తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆరంభించాడు. అయితే, 11 ఏళ్ల వయసులో హార్మోన్‌ ఎదుగుదల లోపం (హార్మోన్‌ గ్రోత్‌ డెఫిషియెన్సీ) బయటపడడంతో సాకర్‌లో అతడి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఎన్నో క్లబ్‌లు అతడి ప్రతిభను కొనియాడినా.. చికిత్స ఖర్చులు భరించేందుకు వెనకడుగేశాయి. కానీ, బార్సిలోనా క్లబ్‌ ముందుకురావడంతో కెరీర్‌ మలుపు తిరిగింది.

4.jpg

‘న్యాప్కిన్‌’పై కాంట్రాక్ట్‌

న్యాప్కిన్‌ కాంట్రాక్ట్‌.. బార్సి లోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌ చారిత్రక ఘట్టాల్లో ఒకటి. 2000 సంవత్సరంలో ఆ క్లబ్‌ యూత్‌ అకాడమీ లా మాసా లో ట్రయల్స్‌ కోసం మెస్సీ అర్జెంటీనా నుంచి బార్సిలోనా వచ్చాడు. అతడి ప్రతిభా పాటవాలు బార్సిలోనా యాజమాన్యాన్ని అబ్బురపరిచినా.. ఒప్పందంపై చర్చలు కొలిక్కి రాలేదు. కానీ, మెస్సీని వదులుకోరాదనుకున్న ఆ క్లబ్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ కార్లోస్‌ రెక్సాచ్‌.. చివరకు యాజమాన్యాన్ని ఒప్పించి అప్పటికప్పుడే అగ్రిమెంట్‌ కుదిర్చాడు. కానీ ఒప్పందం రాసుకొనేందుకు తెల్ల పేపర్‌ లేకపోవడంతో అక్కడి ఓ పేపర్‌ న్యాప్కిన్‌పై అగ్రిమెంట్‌ రాసి మెస్సీ తండ్రి జార్జ్‌, రెక్సాచ్‌ సంతకాలు చేశారు. ఆ ఏడాది డిసెంబరు 14న జరిగిన ఈ ఘటనను ‘ఇది ఒక కాంట్రాక్ట్‌ కాదు.. నవ శకానికి నాంది’ అని సాకర్‌ పండితులు అభివర్ణిస్తారు. ఈ న్యాప్కిన్‌ను గతేడాది వేలం వేస్తే ఏకంగా రూ. 8 కోట్లకు పైగా అమ్ముడవడం ఆటలో మెస్సీ శక్తి, సామర్ధ్యాలకు నిదర్శనం.

3.jpg

దాతృత్వం..అపారం

చిన్నప్పుడు అనారోగ్యంపాలైన మెస్సీ..ఏ అర్జెంటీనా చిన్నారీ వాటిని ఎదుర్కోకూడదని తలిచాడు. తన ఫౌండేషన్‌ తరపున ఎందరో అర్జెంటీనా చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నాడు. వారికి స్పెయిన్‌లో చికిత్స చేయించి, తిరిగి అర్జెంటీనా తీసుకురావడం, వారు కోలుకొనేందుకు అయ్యే ఖర్చు వరకు మొత్తం తానే భరిస్తున్నాడు. అంతేకాదు కొన్ని ప్రత్యేక చికిత్సలకు సంబంధించి అర్జెంటీనా వైద్యులు స్పెయిన్‌లో శిక్షణ పొందేందుకు అవసరమైన ఆర్థిక సాయమూ చేస్తున్నాడు.

దర్పం మచ్చుకైనా లేదు

విఖ్యాత ఫుట్‌బాలర్‌గా పేరు ప్రఖ్యాతులు..వేలాది కోట్ల ఆస్తి..అయినా హంగు, ఆర్భాటం, దర్పం మచ్చుకైనా కనిపించవు మెస్సీలో. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’ అనే సామెతకు నిలువుటద్దంగా నిలుస్తాడు. లగ్జరీలకు అతడు ఆమడ దూరంలో ఉంటాడు. పైగా..‘ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే రొసారియోకు చెందిన సాధారణ బాలుడిని’ అని మెస్సీ అనడం అతడి వినమ్రతకు నిదర్శనం.


5.jpg

మ్యాచ్‌కు ముందు వాంతులు..

తొలి నాళ్లలో మ్యాచ్‌లకు ముందు మెస్సీ ఎంతో ఆందోళన చెందేవాడు. దరిమిలా వాంతులు చేసుకొనేవాడు. ఒక్కోసారి మ్యాచ్‌ మధ్యలోనూ వాంతులయ్యేవి. ఆహారం విషయంలో పట్టింపులు లేకుండా వ్యవహరించడంతో అలా అయ్యేదట. తర్వాత డైట్‌ విషయంలో కఠినంగా ఉండడంతో వాంతుల సమస్య తగ్గిపోయింది.

‘ఎడారి’లో దాహం తీరింది

2022 కతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌.. ఒకరకంగా మెస్సీకి చివరి అవకాశం. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి. ఇంత గొప్ప ఆటగాడి కెరీర్‌ వరల్డ్‌కప్‌ను అందుకోకుండానే ముగుస్తుందా? అనే నిర్వేదం. కానీ, డీలా పడిన జట్టులో స్ఫూర్తిని రగిల్చిన మెస్సీ.. వరుస విజయాలతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫ్రాన్స్‌తో టైటిల్‌ ఫైట్‌లో డ్రామా నడిచినా.. షూటౌట్‌లో అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ.. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’గా తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నాడు.

2.jpg

ఆ అవార్డు ఎనిమిది సార్లు..

‘బాలన్‌ డి వోర్‌’ అవార్డు సాకర్‌ ఆటగాళ్లకిచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. అలాంటి ఈ పురస్కారాన్ని మెస్సీ ఏకంగా ఎనిమిది సార్లు గెలుచుకోవడం విశేషం. ఈ అవార్డును ఇన్నిసార్లు బహుశా మరే ఫుట్‌బాలర్‌ చేరుకోకపోవచ్చు. ఇంకా..ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ప్లేయర్‌కు ప్రదానం చేసే ‘గోల్డెన్‌ బాల్‌’ను రెండుసార్లు (2014,. 2022) అందుకున్నదీ మెస్సీనే.

ఇప్పటికీ చెదరని రికార్డు

మెస్సీ పేరిట ఓ రికార్డు ఇప్పటికి పదిలంగా ఉంది. అదేంటంటే..ఒక కేలండర్‌ ఇయర్‌లో అత్యధిక గోల్స్‌ చేయడం. 2012లో 91 గోల్స్‌ కొట్టాడు. ఇంకా..ఒకే క్లబ్‌, (బార్సిలోనా) తరపున అత్యధికంగా 672 గోల్స్‌ చేసిన రికార్డూ లియోనెల్‌ సొంతం. లా లిగా టోర్నీలో అత్యధిక గోల్స్‌ (474) కూడా మెస్సీ పేరిటే రికార్డు ఉంది.


టియాగో కారు అలా...

2016లో టాటా గ్రూప్‌ విడుదలజేసిన టియాగో కారుకు అంతకుముందు జికా అన్న పేరుండేది. ఆ సమయంలో జికా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమయంలో జికా పేరును మార్చాలని టాటా గ్రూప్‌ అనుకుంది. అప్పుడు టాటా సంస్థకు లియోనెల్‌ మెస్సీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. మెస్సీ పెద్ద కుమారుడి పేరు థియాగో. ఈ పేరు కలిసొచ్చేలా జికాకు మార్పులు చేసి టాటా టియాగో అన్న కొత్త కారును మార్కెట్‌లోకి విడుదలజేసింది టాటా సంస్థ. దీంతో ఈ కార్ల విక్రయాలు భారీగా జరిగి టాటా సంస్థ లాభాలు గడించింది. అలా..టాటా గ్రూప్‌కు మెస్సీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

6.jpg

ఈ టూర్‌కు ఇదీ ఓ కారణం..

కోల్‌కతా: కోల్‌కతాకు చెందిన ప్రమోటర్‌ శతద్రు దత్తా అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ భారత్‌ రావడంలో కీలక భూమిక పోషించాడు. కానీ లియోనెల్‌ను ఇక్కడకు తీసుకురావడం ఆషామాషీగా ఏమీ జరగలేదు. నోబెల్‌ అవార్డు గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు అర్జెంటీనా రాజధాని బ్యూన్‌సఎయిర్స్‌తో అనుబంధం ఉండడమే మెస్సీ ఇక్కడకు వచ్చేందుకు ఓ కారణమట. ఈ విషయాన్ని శతద్రు వెల్లడించాడు. ‘రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అర్జెంటీనాను సందర్శించిన విషయాన్ని మెస్సీకి చెప్పా. ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి (1913) అందుకున్న తొలి ఐరోపాయేతర వ్యక్తి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పర్యటించిన తొలి దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా అనే విషయాన్ని కూడా అతడికి వివరించా. ఠాగూర్‌ బెంగాల్‌ ఆత్మగా తెలియజేశా. దాంతో..ఠాగూర్‌ గురించి తనకు తెలియజేసినందుకు మెస్సీ నాకు థ్యాంక్స్‌ చెప్పాడు’ అని శతద్రు వివరించాడు. మెస్సీ భారత్‌ వచ్చేందుకు ఇదీ కూడా ఓ కారణమని దత్తా తెలిపాడు.

భాగ్యనగరంలో ఇలా..

  • శంషాబాద్‌ విమానాశ్రయానికి సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నాడు.

  • సా. 5 గంటలకు ఫలక్‌నుమా ప్యాలె్‌సలో ఫ్యాన్స్‌తో మీట్‌ అండ్‌ గ్రీట్‌.

  • రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కు హాజరు; రాత్రికి ఫలక్‌నుమాలో బస.

  • ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబైకి పయనం.

మ్యాచుంటే ఆ కిక్కే వేరు!

మెస్సీ పర్యటన దేశ సాకర్‌ అభిమానుల్లో ఉత్సాహం, ఉద్వేగం కలిగిస్తోంది. అదే సమయంలో అతడు ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడకపోవడం వారిని నిరుత్సాహ పరుస్తోంది. సీరియస్‌ సాకర్‌ మ్యాచ్‌ ఉంటే ఆ కిక్కే వేరంటున్నారు. 2011 టూర్‌లో కోల్‌కతా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఆ పర్యటనలో భాగంగా వెనిజులా-అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన స్నేహపూర్వక పోటీకి 85 వేల మంది ఫ్యాన్స్‌ పోటెత్తారు. స్టేడియం పూర్తిగా నిండిపోవడంతో..మైదానంలో మెస్సీ మాయను తిలకించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్టేడియం రేకులపైకి ఎక్కారు. కానీ ఈసారి ‘గోట్‌ టూర్‌’లో సీరియస్‌ సాకర్‌ మ్యాచ్‌ లేకపోవడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.


ఊగిపోనున్న ‘ఉప్పల్‌’

సాకర్‌ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ ముస్తాబైంది. భారత ‘గోట్‌ టూర్‌’లో భాగంగా శనివారం ఉదయం కోల్‌కతాకు వస్తున్న మెస్సీ.. సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోనున్నాడు. నగరమంతా మెస్సీకి స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలు, కటౌట్లతో పండుగ వాతావరణం నెలకొంది. మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. ఫ్యాన్స్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

31 వేలకే పరిమితం..

ఉప్పల్‌ స్టేడియం పూర్తి సామర్థ్యం 39 వేలు కాగా, మెస్సీ ఈవెంట్‌కి కేవలం 31 వేల టిక్కెట్లే అమ్మకానికి ఉంచారు. భద్రతా పరమైన కారణాలతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు 27 వేల టిక్కెట్లు విక్రయించగా ఇంకా డిస్ట్రిక్‌ జొమోటో యాప్‌లో రూ.2,250 నుంచి రూ.30 వేల శ్రేణి మధ్య గల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు టిక్కెట్ల విక్రయం కొనసాగుతుంది.

60 మందితో ఫొటోలు..

హైదరాబాద్‌ టూర్‌లో భాగంగా మెస్సీని కలిసి ఫొటో దిగే అవకాశం అభిమానులకు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ధర నిర్ణయించారు. ఇప్పటివరకు 60 మంది ఈ మొత్తం చెల్లించి మెస్సీతో ఫొటో దిగే అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది. ఫలక్‌నుమా ప్యాలె్‌సలో ఈ.. మెస్సీ మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం జరగనుంది.

7.jpg

ఆర్‌ఆర్‌ 9 గీ మెస్సీ ఆల్‌ స్టార్స్‌

ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మెస్సీ ‘గోట్‌ టూర్‌’ సంగీత విభావరితో మొదలవనుంది. ఇందులో కొందరు టాలీవుడ్‌ నటులతో పాటు తెలుగు రాపర్స్‌ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ మొదలవుతుంది. ఇందులో ఆర్‌ఆర్‌ 9 వర్సెస్‌ మెస్సీ ఆల్‌ స్టార్స్‌ జట్లు తలపడనున్నాయి. 20 నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో ఆఖరి ఐదు నిమిషాల్లో మెస్సీ, రేవంత్‌ రెడ్డి మైదానంలో బరిలోకి దిగుతారు. నిర్ణీత సమయం ముగిశాక రేవంత్‌, మెస్సీ పెనాల్టీ షూటౌట్‌లో ఆడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 24 మంది నిరుపేద క్రీడాకారులతో ఫుట్‌బాల్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో నలుగురు హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ వర్ధమాన క్రీడాకారులకు మెస్సీ కొన్ని చిట్కాలు చెప్పనున్నాడు.

జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ..

‘గోట్‌ టూర్‌’లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేస్తున్న మెస్సీకి జెడ్‌ కేటగిరీ భద్రత ఏర్పాటు చేశారు. మెస్సీ స్టేడియానికి వచ్చే రూట్‌లో గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 07:35 AM