Share News

Lionel Messi GOAT Tour: నేటితో ముగియనున్న మెస్సి భారత పర్యటన.. చివరి రోజు విశేషాలివే..

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:25 AM

మెస్సి మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించారు. కోల్‌కతా పర్యటన సందర్భంగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మెస్సి ఫ్యాన్స్ సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.

Lionel Messi GOAT Tour: నేటితో ముగియనున్న మెస్సి భారత పర్యటన.. చివరి రోజు విశేషాలివే..
Lionel Messi India tour

న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి మూడు రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 13వ తేదీన ఆయన ఇండియాకు వచ్చారు. మొదటగా కోల్‌కతాలో పర్యటించారు. తన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ ఆడారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో కొన్ని నిమిషాల పాటు ముచ్చటించారు. మరుసటి రోజు.. 14వ తేదీన ముంబైలో పర్యటించారు. చివరి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు (సోమవారం) ఢిల్లీ వచ్చారు. ఈ రోజు ఢిల్లీలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కలవనున్నారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో మోదీని మెస్సి కలవనున్నారు. మోదీతో సమావేశం తర్వాత మెస్సి భారత పర్యటన ముగియనుంది. ఆయన తన సొంత దేశానికి వెళ్లిపోతారు. కాగా, మెస్సి మూడు రోజుల పర్యటనలో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించారు. కోల్‌కతా పర్యటన సందర్భంగా అనుకోని సంఘటన చోటుచేసుకుంది. మెస్సి ఫ్యాన్స్ సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. మెస్సిని చూడ్డానికి ఆయన ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆయన గేమ్ ఆడతాడేమోనని అనుకున్నారు. మెస్సి స్టేడియంలో 10 నిమిషాలు కూడా ఉండలేదు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు.


దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టారు. వాటిని స్టేడియంలోని ట్రాక్‌పై పడేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టేడియంలో జరిగిన సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. మెస్సితో పాటు ఆయన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. నిర్వహణ లోపం కారణంగా ఆ తప్పు జరిగిందని అన్నారు. సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు 13వ తేదీన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.


ఇవి కూడా చదవండి

వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు

పహల్గాం దాడి కేసు.. నేడు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఎన్ఐఏ

Updated Date - Dec 15 , 2025 | 11:55 AM