Archery World Cup: జ్యోతి సురేఖ కొత్త చరిత్ర
ABN , Publish Date - Oct 19 , 2025 | 05:33 AM
రికార్డులు కొల్లగొట్టడాన్ని ఆనవాయితీగా మార్చుకున్న తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ విజయవాడ అమ్మాయి.. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో కాంస్యం దక్కించుకుంది...
ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో కాంస్యం కైవసం
నాన్జింగ్ (చైనా): రికార్డులు కొల్లగొట్టడాన్ని ఆనవాయితీగా మార్చుకున్న తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ విజయవాడ అమ్మాయి.. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో కాంస్యం దక్కించుకుంది. దీంతో ఈ మెగా టోర్నమెంట్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా కాంపౌండ్ ఆర్చర్‌గా సురేఖ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ నెం.2 ర్యాంకర్ ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో శనివారం జరిగిన కంచు పతక పోరులో జ్యోతి అద్భుత ప్రదర్శన చేసింది. ఒక్క తప్పునకు తావివ్వకుండా..15కు 15 బాణాలను గురి చూసి సంధించి 10 పాయింట్ల చొప్పున రాబట్టింది. తద్వారా 150-140 స్కోరుతో గిబ్సన్‌ను చిత్తు చేసి కాంస్యం అందుకుంది. వరల్డ్ కప్ సిరీ్‌సలలో చివరిదైన ఫైనల్లో మొత్తం ఎనిమిది మంది ఆర్చర్లు తలపడ్డారు. 29 ఏళ్ల సురేఖ క్వార్టర్‌ఫైనల్లో 143-140 స్కోరుతో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా)పై విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది. అయితే హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆండ్రియా బెకెరా (మెక్సికో) చేతిలో 143-145 సురేఖ ఓటమిపాలైంది. ఫలితంగా కాంస్యం పోటీలో నిలిచిన సురేఖ.. ప్రత్యర్థిపై అమోఘంగా రాణించి పతకం కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News