Share News

Jahanara Alam:మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:50 PM

బంగ్లా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాంపై పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేశారు. 2022 మహిళల వన్డే ప్రపంచ కప్ సందర్భంగా మంజురుల్ తనను లైంగికంగా వేధించాడని విమర్శించారు. మంజురుల్ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో తన కెరీర్‌కు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు.

Jahanara Alam:మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్
Jahanara Alam

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ స్టార్ పేసర్ జహనారా ఆలమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. బంగ్లా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాంపై సంచలన ఆరోపణలు చేశారు. 2022 మహిళల వన్డే ప్రపంచ కప్ సందర్భంగా మంజురుల్ తనను లైంగికంగా వేధించాడని విమర్శించారు. మంజురుల్ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో తన కెరీర్‌కు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. ప్రస్తుతం ఆలమ్ బంగ్లా క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నారు.


ఒక్కసారి కాదు..

‘నేను(Jahanara Alam) ఒక్కసారి కాదు.. అనేకసార్లు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నా. మేం జట్టులో ఉన్నప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడలేం. నిరసన కూడా తెలియజేయలేం. బంగ్లాదేశ్ బోర్డు(BCB)లోని చాలామంది సీనియర్ అధికారుల మద్దతు కోరడానికి ఎంతో ప్రయత్నించాను. మహిళా కమిటీ ఛైర్‌పర్సన్ నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి దృష్టికి కూడా తీసుకెళ్లా’ అని ఆలమ్ ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆరోపించారు.


నాకు అర్థం కాలేదు..

‘2021లో తోహిద్ భాయ్.. కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు భాయ్ ద్వారా నన్ను సంప్రదించాడు. వారు నాతో ఎందుకు తప్పుగా ప్రవర్తించారో నాకు అర్థం కాలేదు. నేను నిశ్శబ్దంగా ఉండి క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాను. కానీ నేను ఆ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తప్పించుకున్నప్పుడు, మంజు భాయ్(Manjurul Islam) మరుసటి రోజు నుంచే నన్ను అవమానించడం ప్రారంభించారు’ అని తెలిపారు.


నెలసరి గురించి అడిగాడు..

‘రెండో ప్రతిపాదన 2022 ప్రపంచ కప్ సమయంలో మంజు భాయ్ నుంచి వచ్చింది. దీంతో గతంలో జరిగిన ప్రతి దాని గురించి నేను బీసీబీకి తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. నేను నాదెల్‌కు చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను. అయితే వారు తాత్కాలిక పరిష్కారాన్ని చూపేవారు. కానీ పరిస్థితులు మళ్లీ యథాస్థితికి వచ్చేవి. నేను సీఈవోకు కూడా విషయం తెలియజేశాను. మా ప్రీ-క్యాంప్ సమయంలో.. నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు మంజురుల్ ఇస్లాం అసభ్యకరంగా తాకాడు. ఇతర మహిళా క్రికెటర్లతోనూ అతడు ఇలాగే వ్యవహరించేవాడు. షేక్‌హ్యాండ్ సమయంలోనూ అనుచితంగా ప్రవర్తించేవాడు. అలాగే నా దగ్గరికి వచ్చి నెలసరి గురించి కూడా అతడు ఇబ్బందికరంగా అడిగాడు’ అని ఆలమ్ వెల్లడించారు.


మరోవైపు ఈ ఆరోపణలను మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం ఖండించాడు. ఆలమ్ చేసిన వ్యాఖ్యలు నిరాధరమైనవని తోసిపుచ్చాడు. జహనారా ఆలమ్ ఆరోపణలపై బీసీబీ కూడా స్పందించింది. ‘ఆలమ్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. అవసరం అయితే.. మేం కచ్చితంగా ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం’ అని బీసీబీ వైస్ ఛైర్మన్ షఖావత్ హుస్సేన్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఖరారు.. ఆందోళనలో భారత్ అభిమానులు!

IND vs SA: కెప్టెన్‌గా తిలక్ వర్మ..రోహిత్‌కు నో ఛాన్స్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 12:50 PM