Asia Cup Ind Vs Pak: పాక్‌తో మ్యాచ్.. నల్ల బ్యాండ్స్ ధరించి నిరసన తెలపనున్న టీమిండియా?
ABN , Publish Date - Sep 14 , 2025 | 02:54 PM
పాక్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా సభ్యులు తమ చేతులకు నల్లటి బ్యాండ్స్ ధరించి నిరసన తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఎప్పుడూ ఉండేదే. కానీ పహల్గాం దాడి తరువాత పరిస్థితి మరింత దిగజారింది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాక్‌తో జరగనున్న మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్స్, బీసీసీఐపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల హోరు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు కూడా చేరిందని, వాతావరణం గంభీరంగా ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (India vs Pakistan black armbands protest)
ఈ నేపథ్యంలో సాటి భారతీయుల మనోభావాలకు అద్దం పట్టేలా టీమిండియా సభ్యులు కూడా నిరసనలు తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీమిండియా సభ్యులు తమ చేతులకు నల్లటి బ్యాండ్స్ కట్టుకుని బరిలోకి దిగే అవకాశం ఉందట. స్నేహపూర్వక కరచాలనాలు, నవ్వులు కూడా ఉండకపోవచ్చని సమాచారం. నినాదాల వంటివేవీ ఉండకపోయినా టీమిండియా సభ్యులు ఇలా వివిధ సంకేతాల ద్వారా తమ నిరసన తెలియజేసే అవకాశం ఉంది (Team India symbolic protest).
భారతీయుల భావోద్వేగంపై బీసీసీఐ అధికారులకూ పూర్తి అవగాహన ఉంది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ రయన్ టెన్ డస్కాటే కూడా స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులను జట్టు సభ్యులు అర్థం చేసుకున్నారని తెలిపారు. ‘సాటి భారతీయుల భావోద్వేగాలు టీమిండియా సభ్యులందరికీ తెలుసు. అయితే, అందరూ ప్రొఫెషనల్‌గా ఉండాలని గౌతీ (గౌతమ్ గంభీర్) చెప్పారు. మన చేతుల్లో లేని విషయాల గురించి ఆందోళన వద్దని అన్నారు’ అని తెలిపారు.
ఇక నేటి మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. పాక్ మాత్రం సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లేకుండానే భారత్‌తో తలపడనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో యూఏఈపై విజయం సాధించగా ఒమన్‌ను పాక్ 93 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మన్ ముహమ్మద్ హ్యారిస్ 43 బంతుల్లో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈసారి పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, ముగ్గురు స్పిన్నర్లను టీమిండియా బరిలోకి దింపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
నేటి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ ఎక్కడొస్తుంది.. ఎలా చూడాలంటే..
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి