Ind-Pak Unsold Tickets: ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్లు
ABN , Publish Date - Sep 12 , 2025 | 09:48 PM
మరో రెండు రోజుల్లో భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభం కానున్నా టిక్కెట్లు మాత్రం ఇంకా అమ్ముడు పోవట్లేదన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ మధ్య పోరు అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. కానీ ఇదంతా గతం. పహల్గాం దాడి తరువాత జనాల్లో పాక్‌పై వ్యతిరేకత పెరిగింది. ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడొద్దని కూడా చాలా మంది డిమాండ్ చేశారు. ఇక సెప్టెంబర్ 14న రెండు జట్లు ఈ టోర్నీలో తొలిసారిగా తలపడనున్నాయి. కానీ టిక్కెట్‌లకు మాత్రం ఆశించిన మేర డిమాండ్ లేదని తెలుస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి దాదాపు సగం టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదట (India vs Pakistan Asia Cup tickets unsold).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ టోర్నీని నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ టిక్కెట్ రేట్లను కూడా తగ్గించిందట. ఒకప్పుడు 475 దిర్హామ్‌లుగా (రూ.11,420) ఉండే టిక్కెట్ రేట్లను 350 దిర్హామ్‌లకు (రూ.8,415) తగ్గించిందట. అయితే, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ వార్తలను ఖండించింది. వీటిల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘టిక్కెట్లు అమ్ముడుపోవట్లేదనే వార్తల్లో అసలు వాస్తవమే లేదు. ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి’ అని ఈసీబీ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు (Asia Cup ticket price cut).
ఈ ఏడాది దుబాయ్ వేదికగా భారత్, పాక్ క్రికెట్ టీమ్స్ తలపడటం ఇది రెండోసారి. గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రిలీజ్ చేసిన నాలుగు నిమిషాల్లోనే నిండుకున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చి దాదాపు 10 రోజులు గడిచిపోయింది. అయితే, అభిమానులు మాత్రం మునుపట్లా ఆసక్తి కనబరచడం లేదని సమాచారం. టిక్కెట్ల రేట్లు అధికంగా ఉండటంతో పాటు పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్స్ కూడా టిక్కెట్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. టోర్నీ నిర్వాహకులు మాత్రం ఈ వార్తలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి