India vs Pakistan Asia Cup Final: మూడోసారీ మోతెక్కించాలి
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:27 AM
‘పాకిస్థాన్ మాకు పోటీయే కాదు..’ అని భారత కెప్టెన్ సూర్యకుమార్ ధీమాగా చెప్పాడు. అయినా.. యుద్ధభూమిలోనే కాదు, క్రికెట్ మైదానంలోనూ ఆ జట్టును చిత్తుగా ఓడిస్తే తనివితీరా చూసి ఆనందించాలన్నది..
నేడు పాక్‌తో భారత్ టైటిల్ ఫైట్
తీవ్ర ఒత్తిడిలో దాయాదిఫ హార్దిక్ ఆడేనా?
‘పాకిస్థాన్ మాకు పోటీయే కాదు..’ అని భారత కెప్టెన్ సూర్యకుమార్ ధీమాగా చెప్పాడు. అయినా.. యుద్ధభూమిలోనే కాదు, క్రికెట్ మైదానంలోనూ ఆ జట్టును చిత్తుగా ఓడిస్తే తనివితీరా చూసి ఆనందించాలన్నది అభిమానుల ఆకాంక్ష. అందుకే పాక్‌తో ఆడే ప్రతీ మ్యాచ్‌నూ వారు భావోద్వేగంతో తిలకిస్తుంటారు. పైగా ఈసారి కరచాలన వివాదం, రెచ్చగొట్టే చేష్టల వ్యవహారం సరేసరి..
ఈ నేపథ్యంలో ఆదివారం ఇరు జట్ల మధ్యే ఆఖరి సమరం జరుగబోతోంది. ఈ కీలక మ్యాచ్‌లోనూ ‘ఫైనల్’ పంచ్ తమదే అవ్వాలని టీమిండియా భావిస్తోంది. అటు గతమెలా ఉన్నా ఈసారి మాత్రం ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వకూడదని పాక్ కసితో ఉంది
.
దుబాయ్: దాదాపు ఏకపక్ష మ్యాచ్‌లతో.. అక్కడక్కడా ఉత్కంఠభరిత క్షణాలతో సాగిన ఆసియాకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. 41 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్-పాక్ జట్లు తొలిసారి ఫైనల్లో తలపడబోతున్నాయి. దీంతో ఆదివారం జరిగే ఈ హైవోల్టేజి సమరంపై ఆసక్తి రెట్టింపయ్యింది. టోర్నీలో భారత్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా తుది పోరుకు అర్హత సాధించగా, అటు పాక్ ఓడిన రెండు మ్యాచ్‌లు భారత్‌పైనే కావడం గమనార్హం. ఏదిఏమైనా ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఈ ఆసియాక్‌పపై గట్టిగానే పడిందని చెప్పవచ్చు. కరచాలనం నిరాకరణతో పాటు గ్రూప్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించాక కెప్టెన్ సూర్య తమ విజయాన్ని సైనికులకు అంకితమిచ్చాడు. దీనికి ప్రతిగా అన్నట్టు సూపర్-4 మ్యాచ్‌లో ఫర్హాన్ గన్‌ఫైర్ సంబరాలు, రౌఫ్ 6-0 సంకేతాలు భారత అభిమానుల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టయ్యింది. ఇరు బోర్డుల పరస్పర ఫిర్యాదులతో ఐసీసీ జరిమానాలు కూడా విధించింది. వ్యవహారం ఇంతవరకూ వచ్చాక ఫైనల్లో ఆ ప్రభావం ఎలా ఉండబోతున్నదనే సందేహం అందరిలో నెలకొంది. ఓవరాల్‌గా టీ20ల్లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో భారత్ 11-3తో పాక్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అదే ఆసియాకప్‌లో ఆడిన ఐదు టీ20 మ్యాచ్‌ల్లోనూ 4-1తో భారత్‌దే పైచేయి.
గాయాలతో ఆందోళన
ఫైనల్‌కు ముందు భారత్‌ను గాయాల బెడద వేధిస్తోంది. శ్రీలంకతో మ్యాచ్‌లో హార్దిక్ తొడకండరాలు పట్టేయడంతో ఒక్క ఓవర్‌కే పరిమితమై మైదానం వీడాడు. దీంతో ఫైనల్లో అతడు బరిలోకి దిగడం సందేహంగా మారింది. ఆదివారం ఉదయం పాండ్యాపై ఓ అంచనాకు రానున్నట్టు బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపాడు. అభిషేక్ సైతం కండరాల నొప్పితో శ్రీలంక ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో గ్రౌండ్‌ను వీడి తిరిగి రాలేదు. అయితే తను బాగానే ఉన్నట్టు మోర్కెల్ ప్రకటించడం సానుకూలాంశం కానుంది. ఎందుకంటే అభిషేక్ భీకర ఫామ్‌ను చూసే పాక్ జట్టు భయపడుతోంది. భారత్ కూడా అతడి మెరుపు ఆరంభాలపైనే అతిగా ఆధారపడింది. గిల్, కెప్టెన్ సూర్య అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఒకవేళ అభిషేక్ విఫలమైతే పరిస్థితి ఏమిటనేది జట్టు ఆలోచించాల్సిన విషయం. లంకపై శాంసన్, తిలక్‌లకు మాత్రం తగిన మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడగలిగారు. మరోవైపు బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌ల్లో భారత బౌలర్లు 60 వికెట్లకు 41 మాత్రమే తీయగలిగారు. యూఏఈ, బంగ్లా జట్లను మాత్రమే ఆలౌట్ చేయగలిగారు. స్పిన్నర్ కుల్దీప్ 13 వికెట్లతో నిలకడగా రాణిస్తున్నా అతడికి సహకారం కరువైంది. స్పిన్ పిచ్‌లపైనా వరుణ్ ఐదు, అక్షర్ నాలుగు వికెట్లతో సరిపెట్టుకున్నారు. అటు పేసర్ బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసినా అతడి నుంచి జట్టు మరింతగా ఆశిస్తోంది. ఫైనల్లో తన సత్తాకు తగ్గట్టు రాణిస్తే పాక్‌ను కట్టడి చేయవచ్చు. దూబే స్థానంలో అర్ష్‌దీ్‌పనే కొనసాగిస్తారా? అనేది వేచిచూడాల్సిందే.
బ్యాటింగ్‌లో రాణిస్తేనే..
పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో నిలకడైన బ్యాటర్ కనిపించడం లేదు. బుమ్రాను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ ఫర్హాన్ కాస్త మినహాయింపు. సయీమ్ అయూబ్ 6 మ్యాచ్‌ల్లో 23 పరుగులే చేయగా ఇందులో 4 డకౌట్లున్నాయి. తలత్, కెప్టెన్ సల్మాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. చివర్లో షహీన్ అఫ్రీది బ్యాటింగ్ మెరుపులే ఆ జట్టుకు కీలక పరుగులు అందిస్తున్నాయి. అయితే పేసర్లు షహీన్, రౌఫ్ ఆకట్టుకుంటున్నారు. వీరు భారత టాపార్డర్‌ను ఆరంభంలోనే దెబ్బతీస్తే లో స్కోరింగ్ మ్యాచ్‌కు అవకాశం ఉంటుంది. సయీమ్ బౌలింగ్‌లో మాత్రం రాణిస్తూ 8 వికెట్లు తీయగలిగాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్, హార్దిక్, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్/దూబే.
పాకిస్థాన్: ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), తలత్, మహ్మద్ హారిస్, నవాజ్, సుఫి యాన్, షహీన్ అఫ్రీది, హారిస్ రౌఫ్.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్
విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి