Share News

India Storms into Asia Cup Final: ఫైనల్లో భారత్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:23 AM

వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌.. ఆసియా కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అభిషేక్‌ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) ధనాధన్‌ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో..

India Storms into Asia Cup Final: ఫైనల్లో భారత్‌

ఆసియా కప్‌లో నేడు

బంగ్లాదేశ్‌ X పాకిస్థాన్‌

రా.8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

  • 41 రన్స్‌తో బంగ్లా చిత్తు

  • బాదేసిన అభిషేక్‌ శర్మ

  • తిప్పేసిన కుల్దీప్‌ యాదవ్‌

దుబాయ్‌: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌.. ఆసియా కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అభిషేక్‌ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) ధనాధన్‌ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. బుధవారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. హార్దిక్‌ పాండ్యా (38), శుభ్‌మన్‌ గిల్‌ (29) రాణించారు. రిషద్‌ హుస్సేన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో బంగ్లా 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సైఫ్‌ హసన్‌ (69), పర్వేజ్‌ హొస్సేన్‌ ఇమాన్‌ (21) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కుల్దీప్‌ మూడు.. బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అభిషేక్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. సూపర్‌-4లో నాలుగు పాయింట్లతో టీమిండియా తొలి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో రెండో బెర్త్‌ ఎవరికి దక్కుతుందో తేలుతుంది. లిట్టన్‌ దాస్‌ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో జాకెర్‌ అలీ బంగ్లా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.


బౌలర్ల దెబ్బకు విలవిలా..

సైఫ్‌ ఒంటరి పోరాటం చేసినా.. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేకపోయింది. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ తన్జిద్‌ హసన్‌ (1)ను అవుట్‌ చేసిన బుమ్రా.. ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టాడు. దీంతో సైఫ్‌, పర్వేజ్‌ ఆచితూచి ఆడడంతో స్కోరు బోర్డు మందకొడిగా కదిలింది. అయితే, నాలుగో ఓవర్‌లో వరుణ్‌ బౌలింగ్‌లో రెండు వరుస బౌండ్రీలతో దూకుడు పెంచిన పర్వేజ్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ బాదాడు. దీంతో ఆరు ఓవర్లకు బంగ్లా 44/1తో నిలిచింది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్‌, అక్షర్‌ పరుగులను కట్టడి చేస్తూ బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్న పర్వేజ్‌ను అవుట్‌ చేసిన కుల్దీప్‌.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. మరోవైపు సైఫ్‌ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. కాగా, 10వ ఓవర్‌లో తన బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన హ్రిదయ్‌ (7)ను అక్షర్‌ అదే ఓవర్‌లో క్యాచౌట్‌ చేశాడు. ఆ తర్వాత షమీమ్‌ (0)ను వరుణ్‌ బౌల్డ్‌ చేయడంతో.. బంగ్లా 74/4తో ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. జాకెర్‌ అలీ (4)ని సూర్య రనౌట్‌ చేశాడు. మరోవైపు అక్షర్‌ వేసిన 14వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న సైఫ్‌.. జట్టు స్కోరును సెంచరీ దాటించాడు. బంగ్లా విజయానికి చివరి 5 ఓవర్లలో 61 పరుగులు కావల్సి ఉండగా.. సైఫుద్దీన్‌ (4)ను వరుణ్‌ వెనక్కిపంపాడు. 17వ ఓవర్‌లో రిషద్‌ (2), తన్జిమ్‌ హసన్‌ (0)ను కుల్దీప్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చగా.. సైఫ్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో బంగ్లా పోరాటం ముగిసింది.


‘డెత్‌’లో డీలా..

డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పవర్‌ప్లే తొలి మూడు ఓవర్లలో 17 పరుగులే చేసినా.. ఆ తర్వాత ఓపెనర్లు అభిషేక్‌, గిల్‌ బ్యాట్లు ఝుళిపించారు. నాలుగో ఓవర్‌లో నసుమ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో గిల్‌ 4, 6తో జోరు చూపగా.. అభిషేక్‌ సిక్స్‌తో మొత్తం 21 పరుగులు లభించాయి. ఇక్కడి నుంచి టాప్‌ గేర్‌లో సాగిన శర్మ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు బాదడంతో.. ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 72/0తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ రిషద్‌.. గిల్‌తోపాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ శివం దూబే (2)ను అవుట్‌ చేసి టీమిండియా జోరుకు బ్రేకులు వేశాడు. దీంతో తొలి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు సింగిల్‌తో అభిషేక్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. ఈ క్రమంలో కొంతసేపు స్తబ్దుగా ఉన్న అభిషేక్‌.. 11వ ఓవర్‌లో 6,4తో మరోసారి బ్యాట్‌కు పని చెప్పడంతో జట్టు స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. ధాటిగా ఆడుతున్న అభిషేక్‌ అనవసరంగా రనౌట్‌ కాగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరడంతో టీమిండియా బ్యాటింగ్‌ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. తిలక్‌ వర్మ (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అయితే, డెత్‌ ఓవర్లలో హార్దిక్‌ పాండ్యాకు అక్షర్‌ పటేల్‌ (10 నాటౌట్‌) జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ, బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో.. వీరిద్దరూ 34 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యాన్ని మాత్రమే నమోదు చేశారు. అడపాదడపా షాట్లు ఆడిన పాండ్యా ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి పెవిలియన్‌ చేరడంతో.. టీమిండియా 170 మార్క్‌ను కూడా అందుకోలేక పోయింది.


స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (రనౌట్‌) 75, గిల్‌ (సి) తన్జిమ్‌ షకిబ్‌ (బి) రిషద్‌ 29, శివమ్‌ దూబే (సి) హ్రిదయ్‌ (బి) రిషద్‌ 2, సూర్యకుమార్‌ (సి) జాకెర్‌ అలీ (బి) ముస్తాఫిజుర్‌ 5, హార్దిక్‌ పాండ్యా (సి) తన్జిద్‌ హసన్‌ (బి) సైఫుద్దీన్‌ 38, తిలక్‌ (సి) సైఫ్‌ హసన్‌ (బి) తన్జిమ్‌ షకిబ్‌ 5, అక్షర్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 168/6; వికెట్ల పతనం: 1-77, 2-83, 3-112, 4-114, 5-129, 6-168; బౌలింగ్‌: తన్జిమ్‌ షకిబ్‌ 4-0-29-1, నసుమ్‌ అహ్మద్‌ 4-0-34-0, ముస్తాఫిజుర్‌ 4-0-33-1, సైఫుద్దీన్‌ 3-0-37-1, రిషద్‌ హుస్సేన్‌ 3-0-27-2, సైఫ్‌ హసన్‌ 2-0-7-0.

బంగ్లాదేశ్‌: సైఫ్‌ హసన్‌ (సి) అక్షర్‌ (బి) బుమ్రా 69, తన్జిద్‌ హసన్‌ (సి) దూబే (బి) బుమ్రా 1, పర్వేజ్‌ హుస్సేన్‌ (సి) అభిషేక్‌ (బి) కుల్దీప్‌ 21, హ్రిదయ్‌ (సి) అభిషేక్‌ (బి) అక్షర్‌ 7, షమీమ్‌ హుస్సేన్‌ (బి) వరుణ్‌ 0, జాకెర్‌ అలీ (రనౌట్‌) 4, సైఫుద్దీన్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 4, రిషద్‌ హుస్సేన్‌ (సి) తిలక్‌ (బి) కుల్దీప్‌ 2, తన్జిమ్‌ షకిబ్‌ (బి) కుల్దీప్‌ 0, నసుమ్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 4, ముస్తాఫిజుర్‌ (సి) అక్షర్‌ (బి) తిలక్‌ 6, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం 19.3 ఓవర్లలో 127 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-4, 2-46, 3-65, 4-74, 5-87, 6-109, 7-112, 8-112, 9-116, 10-127; బౌలింగ్‌: హార్దిక్‌ 2-0-14-0, బుమ్రా 4-0-18-2, వరుణ్‌ చక్రవర్తి 4-0-29-2, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-18-3, అక్షర్‌ పటేల్‌ 4-0-37-1, శివమ్‌ దూబే 1-0-10-0, తిలక్‌ వర్మ 0.3-0-1-1.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 03:23 AM