Share News

Womens World Cup: పోరాడినా పోయింది

ABN , Publish Date - Oct 20 , 2025 | 03:01 AM

స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన (88), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (70)తోపాటు దీప్తి శర్మ (50, 4/51) ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్నా.. గెలుపు వాకిట భారత మహిళల జట్టుకు నిరాశే ఎదురైంది. వరల్డ్‌ కప్‌లో ఆదివారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో...

Womens World Cup: పోరాడినా పోయింది

నేటి మ్యాచ్‌

శ్రీలంక X బంగ్లాదేశ్‌

రేపటి మ్యాచ్‌

దక్షిణాఫ్రికా X పాకిస్తాన్‌

(మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో)

మహిళల వరల్డ్‌కప్‌

  • స్మృతి, దీప్తి, హర్మన్‌ శ్రమ వృథా

  • 4 పరుగులతో ఓడిన భారత్‌

  • సెమీ్‌సకు ఇంగ్లండ్‌ ఫ నైట్‌ శతకం

ఇండోర్‌: స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన (88), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (70)తోపాటు దీప్తి శర్మ (50, 4/51) ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్నా.. గెలుపు వాకిట భారత మహిళల జట్టుకు నిరాశే ఎదురైంది. వరల్డ్‌ కప్‌లో ఆదివారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. భారత్‌ వరుసగా మూడో ఓటమిని చవి చూసింది. తొలుత ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. హీథర్‌ నైట్‌ (109) సెంచరీతో సత్తా చాటగా, అమీ జోన్స్‌ (56) రాణించింది. శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో భారత్‌ ఓవర్లన్నీ ఆడి 284/6 స్కోరుకే పరిమితమైంది. ఫామ్‌లో లేని జెమీమా రోడ్రిగ్స్‌ స్థానంలో పేసర్‌ రేణుక జట్టులోకి వచ్చింది. నైట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.

ఆఖర్లో తడబాటు: ఛేదనలో ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (6), హర్లీన్‌ (24) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. కానీ, మంధాన, కౌర్‌ మూడో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. 26వ ఓవర్‌లో మంధాన అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. తర్వాతి ఓవర్‌లో హర్మన్‌ ఫిఫ్టీ సాధించింది. అయితే, దూకుడుగా ఆడుతున్న కౌర్‌ను బ్రంట్‌ క్యాచవుట్‌ చేసింది. ఈ దశలో దీప్తి, మంధాన జాగ్రత్తగా ఆడుతూ పరిస్థితి చేయి దాటకుండా చూశారు. కానీ, సెంచరీకి చేరువవుతున్న స్మృతిని స్మిత్‌ క్యాచ్‌ అవుట్‌ చేయడంతో.. నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధాటిగా ఆడే రిచా (8) వికెట్‌ పారేసుకొంది. అర్ధ శతకం పూర్తి చేసుకొన్న దీప్తి నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్‌ పారేసుకోవడంతో మ్యాచ్‌ మలుపుతిరిగింది. ఆఖరి 6 బంతుల్లో 14 పరుగులు అవసరమవగా.. అమన్‌జోత్‌ (18 నాటౌట్‌), స్నేహ్‌ రాణా (10 నాటౌట్‌) జట్టును గెలిపించలేకపోయారు.


మెరిసిన టాపార్డర్‌: నైట్‌తోపాటు టాపార్డర్‌ బ్యాటర్లు రాణించడంతో ఇంగ్లండ్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బ్యూమాంట్‌ (22), జోన్స్‌ తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. అయితే, బ్యూమాంట్‌ను బౌల్డ్‌ చేసిన దీప్తి జట్టుకు బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన నైట్‌ ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఫిప్టీ పూర్తి చేసుకొన్న జోన్స్‌ను కూడా దీప్తి వెనక్కిపంపినా.. కెప్టెన్‌ బ్రంట్‌ (38), నైట్‌ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగింది. బ్రంట్‌ను శ్రీచరణి పెవిలియన్‌ చేర్చగా.. సెంచరీ సాధించిన నైట్‌ రనౌట్‌ అయింది. అయితే, డెత్‌ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన దీప్తి, చరణి.. ఇంగ్లండ్‌ 300 మార్క్‌కు చేరకుండా అడ్డుకొన్నారు.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌: బ్యూమాంట్‌ (బి) దీప్తి 22, అమీ జోన్స్‌ (సి) మంధాన (బి) దీప్తి 56, హీదర్‌ నైట్‌ (రనౌట్‌) 109, బ్రంట్‌ (సి) హర్మన్‌ (బి) శ్రీచరణి 38, డంక్లీ (సి) దీప్తి (బి) శ్రీచరణి 15, ఎమ్మా లంబ్‌ (సి) మంధాన (బి) దీప్తి 11, క్యాప్సీ (సి) హర్లీన్‌ (బి) దీప్తి 2, చార్లీ డీన్‌ (నాటౌట్‌) 19, ఎకెల్‌స్టోన్‌ (రనౌట్‌) 3, లిన్సే స్మిత్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 288/8; వికెట్ల పతనం: 1-73, 2-98, 3-211, 4-249, 5-254, 6-257, 7-276, 8-280; బౌలింగ్‌: రేణుక 8-0-37-0, క్రాంతి 8-0-46-0, స్నేహ్‌ రాణా 10-0-56-0, శ్రీచరణి 10-0-68-2, దీప్తి 10-0-51-4, అమన్‌జోత్‌ 4-0-26-0.

భారత్‌: ప్రతీక (సి) జోన్స్‌ (బి) బెల్‌ 6, స్మృతీ మంధాన (సి) క్యాప్సీ (బి) స్మిత్‌ 88, హర్లీన్‌ (ఎల్బీ) డీన్‌ 24, హర్మన్‌ప్రీత్‌ (సి) లంబ్‌ (బి) బ్రంట్‌ 70, దీప్తి (సి) డంక్లీ (బి) ఎకెల్‌స్టోన్‌ 50, రిచా (సి) నైట్‌ (బి) బ్రంట్‌ 8, అమన్‌జోత్‌ (నాటౌట్‌) 18, స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 284/6; వికెట్ల పతనం: 1-3, 2-42, 3-167, 4-234, 5-256, 6-262; బౌలింగ్‌: బెల్‌ 9-0-52-1, స్మిత్‌ 10-0-40-1, బ్రంట్‌ 8-0-47-2, డీన్‌ 10-0-67-1, ఎకెల్‌స్టోన్‌ 10-0-58-1, క్యాప్సీ 3-0-20-0.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 03:01 AM