Asia Cup 2025: ఒమన్ వణికించెన్
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:01 AM
ఆసియాకప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అయితే శుక్రవారం జరిగిన నామమాత్రపు పోరులో పసికూన ఒమన్.. భారత్‌ను వణికించింది. పాక్‌పై 67, యూఏఈపై 130 పరుగులకే...
భారత్ X ఆస్ట్రేలియా
మహిళల మూడో వన్డే నేడు
(మ. 1.30 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..)
చెమటోడ్చి నెగ్గిన భారత్
అబుధాబి: ఆసియాకప్ గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. అయితే శుక్రవారం జరిగిన నామమాత్రపు పోరులో పసికూన ఒమన్.. భారత్‌ను వణికించింది. పాక్‌పై 67, యూఏఈపై 130 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు వరల్డ్ చాంపియన్ భారత్‌పై మాత్రం అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌లోనూ బెంబేలెత్తించడం విశేషం. కాగా, ఆరంభంలో కాస్త నిదానంగా ఆడడంతో భారీ స్కోరు ఛేదనలో ఆ జట్టు వెనుకబడింది. దీంతో చివరకు భారత్ 21 పరుగుల తేడాతో గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), అభిషేక్ (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), తిలక్ (18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 29) రాణించారు. ఫైజల్, కలీం, జితేన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. ఆమిర్ కలీం (46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64), హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.
ఆకట్టుకున్న కలీం, మీర్జా: భారీ ఛేదనలో ఒమన్ బ్యాటర్లు గట్టిగానే పోరాడారు. దీంతో భారత బౌలర్లు పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. బంతికో పరుగు చొప్పున సాధించిన జతిందర్ (32)ను తొమ్మిదో ఓవర్‌లో కుల్దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వికెట్ల పతనం సాగుతుందనుకున్నా.. 43 ఏళ్ల ఓపెనర్ ఆమిర్ కలీంకు హమ్మద్ మీర్జా జత కలవడంతో ఎదురుదాడి ఆరంభమైంది. 13వ ఓవర్ నుంచి లక్ష్యం వైపు వేగంగా సాగారు. అటు కలీం 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కుల్దీప్ ఓవర్‌లో మీర్జా రెండు సిక్సర్లతో జోరు చూపాడు. 18 బంతుల్లో 48 రన్స్ అవసరమవగా.. చేతిలో 9 వికెట్లు ఉండడంతో ఒమన్ సంచలనం చేస్తుందా? అనిపించింది. కానీ 18వ ఓవర్‌లో కలీమ్‌ను హర్షిత్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే 30 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన మీర్జా సైతం వెనుదిరగడంతో ఒమన్‌కు ఓటమి ఖరారైంది.
శాంసన్ నిలకడగా..: బ్యాటర్లకు తగిన ప్రాక్టీస్ కోసం టాస్ గెలవగానే భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దీంతో ఒమన్‌పై సులువుగా 200 స్కోరు సాధిస్తారని అంతా భావించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు బౌలర్లు ఏకంగా 8 వికెట్లు పడగొట్టారు. స్లో పిచ్ కావడంతో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. కానీ ఓపెనర్ అభిషేక్ మాత్రం సహజశైలిలో చెలరేగాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన శాంసన్ నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించింది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం సహచరులనందరినీ ముందుగా పంపి తను పదకొండో నెంబర్‌గా డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఇక రెండో ఓవర్‌లోనే ఓపెనర్ గిల్ (5)ను పేసర్ ఫైజల్ కళ్లుచెదిరే బంతితో బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అభిషేక్ ధాటికి పవర్‌ప్లేలో జట్టు 60/1 స్కోరుతో నిలిచింది. ఏడో ఓవర్‌లో శాంసన్ 6,4తో 12 రన్స్ సాధించగా.. తర్వాతి ఓవర్‌లోనే అభిషేక్, హార్దిక్ (1) వెనుదిరిగారు. అనంతరం ఉన్న కాసేపు అక్షర్ (26) వేగంగా ఆడాలని ప్రయత్నించి శాంసన్‌తో నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. దూబే (5) విఫలం కాగా.. తిలక్ వచ్చీ రాగానే భారీ షాట్లకు వెళ్లి 16వ ఓవర్‌లో 6,4తో స్కోరులో కదలిక తెచ్చాడు. అటు శాంసన్ ఓ ఫోర్‌తో 41 బంతుల్లో తన కెరీర్‌లో నెమ్మదైన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో చివరి మూడు ఓవర్లలో జట్టు 21 రన్స్ మాత్రమే సాధించింది.
స్కోరుబోర్డు
భారత్: అభిషేక్ (సి) శుక్లా (బి) రామనంది 38, గిల్ (బి) షా ఫైజల్ 5, శాంసన్ (సి) బిస్త్ (బి) షా ఫైజల్ 56, హార్దిక్ (రనౌట్) 1, అక్షర్ (సి) శుక్లా (బి) ఆమిర్ కలీం 26, శివమ్ దూబే (సి) జతిందర్ (బి) ఆమిర్ కలీం 5, తిలక్ (సి) జిక్రియా ఇస్లామ్ (బి) రామనంది 29, హర్షిత్ (నాటౌట్) 13, అర్ష్‌దీప్ (రనౌట్) 1, కుల్దీప్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 188/8; వికెట్ల పతనం: 1-6, 2-72, 3-73, 4-118, 5-130, 6-171, 7-176, 8-179; బౌలింగ్: షకీల్ 3-0-33-0, షా ఫైజల్ 4-1-23-2, నదీమ్ 1-0-19-0, జితెన్ రామనంది 4-0-33-2, సమయ్ శ్రీవాత్సవ 2-0-23-0, జిక్రియా ఇస్లామ్ 3-0-23-0, ఆమిర్ కలీం 3-0-31-2.
ఒమన్: జతిందర్ (బి) కుల్దీప్ 32, ఆమిర్ కలీం (సి) హార్దిక్ (బి) హర్షిత్ 64, హమ్మద్ మీర్జా (సి/సబ్) రింకూ (బి) హార్దిక్ 51, జిక్రియా ఇస్లామ్ (నాటౌట్) 0, వినాయక్ శుక్లా (సి/సబ్) రింకూ (బి) అర్ష్‌దీప్ 1, రామనంది (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 167/4; వికెట్ల పతనం: 1-56, 2-149, 3-154, 4-155; బౌలింగ్: హార్దిక్ 4-0-26-1, అర్ష్‌దీప్ 4-0-37-1, హర్షిత్ 3-0-25-1, కుల్దీప్ 3-0-23-1, అక్షర్ 1-0-4-0, శివమ్ దూబే 3-0-31-0, తిలక్ 1-0-8-0, అభిషేక్ 1-0-12-0.
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి