India Series Win: విశాఖలో విజయ గర్జన
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:35 AM
బౌలింగ్‌లో భళా అనిపించారు.. బ్యాటింగ్‌లో బెదరగొట్టారు. వెరసి సిరీస్ నిర్ణాయక వన్డేలో టీమిండియా చెలరేగింది. పేసర్ ప్రసిద్ధ్ విమర్శకులకు సమాధానమిస్తూ పదునైన బంతులతో కీలక వికెట్లు తీసి సఫారీల...
2-1తో భారత్‌దే సిరీస్
ఆఖరి వన్డేలో సఫారీలపై ఘన విజయం
డికాక్ సెంచరీ వృథా
జైస్వాల్ అజేయ శతకం
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీతో కోహ్లీ
బౌలింగ్‌లో భళా అనిపించారు.. బ్యాటింగ్‌లో బెదరగొట్టారు. వెరసి సిరీస్ నిర్ణాయక వన్డేలో టీమిండియా చెలరేగింది. పేసర్ ప్రసిద్ధ్ విమర్శకులకు సమాధానమిస్తూ పదునైన బంతులతో కీలక వికెట్లు తీసి సఫారీల భారీ స్కోరుకు కళ్లెం వేశాడు. అటు స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ ఉచ్చులో టెయిలెండర్లు విలవిల్లాడారు. ఇక ఓ మాదిరి ఛేదనలో ఓపెనర్ జైస్వాల్ వన్డేల్లో తొలి శతకంతో మెరవగా.. వెటరన్లు రోహిత్, విరాట్ మరోసారి చెలరేగారు. ఫలితంగా సఫారీలను 9 వికెట్లతో చిత్తుచేసిన టీమిండియా 2-1తో సిరీ్‌సను సొంతం చేసుకుంది.
విశాఖపట్నం స్పోర్ట్స్
(ఆంధ్రజ్యోతి): దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీ్‌సను భారత జట్టు 2-1తో గెల్చుకుంది. శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో కనబర్చిన రాహుల్ సేన 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. ముందుగా దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 106) సెంచరీ సాధించగా, కెప్టెన్ బవుమా (48), బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్ కుల్దీప్, పేసర్ ప్రసిద్ధ్‌లకు నాలుగేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 39.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 271 రన్స్ చేసి గెలిచింది. రోహిత్ (73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75), విరాట్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జైస్వాల్.. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కోహ్లీ నిలిచారు.
టాపార్డర్ అదుర్స్: భారీ ఛేదన కాకపోవడంతో భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడింది. ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం అందించగా.. విరాట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరించడంతో ఓపెనర్లు నిదానంగానే ఆడారు. జైస్వాల్ లెఫ్టామ్ పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడినా ఈసారి పట్టుదలగా క్రీజులో నిలిచాడు. అయితే స్ట్రయిక్‌ను రొటేట్ చేయడంలో విఫలమయ్యాడు. రోహిత్ మాత్రం ధాటిని చూపుతూ అడపాదడపా బౌండరీలతో స్కోరులో కదలిక తెచ్చాడు. కాస్త కుదురుకున్నాక జైస్వాల్ ఆటతీరులోనూ మార్పు కనిపించింది. దీనికి తోడు మంచు ప్రభావం చూపడంతో బ్యాటర్లకు ఇబ్బందిలేకపోయింది. జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయ్యాక ఆటలో వేగం పెంచాడు. పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు సాధించాడు. అయితే సెంచరీ వైపు సాగుతున్న రోహిత్ స్లాగ్‌స్వీ్‌పనకు వెళ్లి కేశవ్ ఓవర్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత జైస్వాల్ కెరీర్‌లో తొలి శతకం పూర్తి చేయగా.. విరాట్ సూపర్ ఫామ్‌తో ప్రేక్షకులను అలరించాడు. బాష్ ఓవర్‌లో 6,4 ఆ వెంటనే బార్ట్‌మన్ ఓవర్‌లో 4,6తో అదరగొట్టాడు. ఈ ఊపుతో విరాట్ 40 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. 40వ ఓవర్‌లో అతను మరో 2 ఫోర్లతో 61 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

అటు ప్రసిద్ధ్, ఇటు కుల్దీప్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు ఆరంభం బాగానే ఉన్నా మధ్య ఓవర్ల నుంచి కష్టాలు మొదలయ్యాయి. ప్రసిద్ధ్ టాప్, మిడిలార్డర్‌ను దెబ్బతీయగా.. చివర్లో కుల్దీప్ హవా చూపాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రికెల్టన్‌ను అర్ష్‌దీప్ డకౌట్ చేశాడు. ఈ దశలో ఓపెనర్ డికాక్ జట్టుకు అండగా నిలిచాడు. సిరీ్‌సలో తొలిసారిగా బ్యాట్‌ను ఝళిపించిన అతను కెరీర్‌లో 23వ శతకంతో ఆకట్టుకున్నాడు. అతడికి బవుమా సహకరించడంతో రెండో వికెట్‌కు 113 రన్స్ జత చేరాయి. ప్రసిద్ధ్ రెండో ఓవర్‌లో డికాక్ 6,6,4తో 18 రన్స్ రాబట్టాడు. ఈ జోరుతో డికాక్ 42 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాక, మరింత ధాటిని కనబర్చిన అతను 79 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అయితే బవుమాను జడేజా అవుట్ చేయడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. కానీ డికాక్‌కు బ్రీట్‌స్కే (24) జత కలవడంతో మూడో వికెట్‌కు 54 రన్స్ చేరాయి. తిలక్‌ను బ్రీట్‌స్కే లక్ష్యం చేసుకోవడంతో కెప్టెన్ రాహుల్ తిరిగి ప్రసిద్ధ్‌కు బంతినిచ్చాడు. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది. తన తొలి స్పెల్‌లో రెండు ఓవర్లకే 27 రన్స్ ఇచ్చుకున్న ప్రసిద్ధ్ ఈసారి మిడిలార్డర్ భరతం పడుతూ.. వరుస 4 ఓవర్లలో 3 వికెట్లతో సఫారీల వెన్ను విరిచాడు. ముందుగా 29వ ఓవర్‌లో బ్రీట్‌స్కే, మార్‌క్రమ్ (1)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఫుల్ లెంగ్త్ డెలివరీకి డికాక్‌ను బౌల్డ్ చేయడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఇక టెయిలండర్లను స్పిన్నర్ కుల్దీప్ కుదురుకోనీయకుండా చకచకా 4 వికెట్లతో సఫారీ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా: డికాక్ (బి) ప్రసిద్ధ్ 106, రికెల్టన్ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 0, బవుమా (సి) కోహ్లీ (బి) జడేజా 48, బ్రీట్‌స్కే (ఎల్బీ) ప్రసిద్ధ్ 24, మార్‌క్రమ్ (సి) కోహ్లీ (బి) ప్రసిద్ధ్ 1, బ్రేవిస్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 29, యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 17, బాష్ (సి అండ్ బి) కుల్దీప్ 9, కేశవ్ (నాటౌట్) 20, ఎన్‌గిడి (ఎల్బీ) కుల్దీప్ 1, బార్ట్‌మన్ (బి) ప్రసిద్ధ్ 3, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 47.5 ఓవర్లలో 270 ఆలౌట్; వికెట్ల పతనం: 1-1, 2-114, 3-168, 4-170, 5-199, 6-234, 7-235, 8-252, 9-258, 10-270; బౌలింగ్: అర్ష్‌దీప్ 8-1-36-1, హర్షిత్ 8-2-44-0, ప్రసిద్ధ్ 9.5-0-66-4, జడేజా 9-0-50-1, కుల్దీప్ 10-1-41-4, తిలక్ 3-0-29-0.
భారత్: జైస్వాల్ (నాటౌట్) 116, రోహిత్ (సి) బ్రీట్‌స్కే (బి) కేశవ్ 75, కోహ్లీ (నాటౌట్) 65, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 39.5 ఓవర్లలో 271/1; వికెట్ పతనం: 1-155; బౌలింగ్: యాన్సెన్ 8-1-39-0, ఎన్‌గిడి 6.5-0-56-0, కేశవ్ మహరాజ్ 10-0-44-1, బార్ట్‌మన్ 7-0-60-0, బాష్ 6-0-53-0, మార్‌క్రమ్ 2-0-17-0.

6
మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన ఆరో భారత బ్యాటర్‌గా జైస్వాల్. రైనా, రాహుల్, విరాట్, రోహిత్, గిల్ ముందున్నారు.
1
వన్డేల్లో ఎక్కువ శతకాలు (23) చేసిన వికెట్ కీపర్‌గా సంగక్కరతో కలిసి టాప్‌లో నిలిచిన డికాక్. అలాగే భారత్‌పై జయసూర్యతో కలిసి ఎక్కువ సెంచరీలు (7) చేసిన బ్యాటర్ కూడా డికాకే.
టాస్ గెలిచారోచ్..
ఒకటా.. రెండా వరుసగా 20 వన్డేల్లో టాస్ ఓడిన భారత జట్టుకు ఈసారి అదృష్టం వరించింది. 2023 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ తర్వాత తిరిగి ఇన్నాళ్లకు టీమిండియా టాస్ గెలవడం విశేషం. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు మంచు ప్రభావం ఉండడంతో టాస్ గెలిచిన జట్టుకు ప్రయోజనం ఎక్కువగా ఉంటోంది. మరోవైపు అనలిస్ట్ హరి సూచన మేరకు తానీసారి ఎడమ చేత్తో నాణేన్ని ఎగరేసి ఫలితం రాబట్టినట్టు కెప్టెన్ రాహుల్ తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News