IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి
ABN , Publish Date - Nov 19 , 2025 | 07:05 PM
సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 73 పరుగుల తేడాతో భారత ఏ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాపార్డ్ ఘోరంగా విఫలమైంది.
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 19) జరిగిన మూడో వన్డేలో భారత-ఏ జట్టు(India A vs South Africa A )కు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా ప్రొటీస్ చేతిలో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. అయితే ఇది వరకే సౌతాఫ్రికా సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయం ఆ జట్టుకు కాస్తా ఊరటనిస్తుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇక మూడో వన్డే( Rajkot ODI) విషయానికి వస్తే... టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్(Pretorius) (123), రివాల్లో మూన్‌సామి (107) అద్బుత శతకాలు సాధించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. రుబిన్ హెర్మన్ (11), క్వెషైల్ (1), కెప్టెన్ ఆకెర్‌మన్ (16), డియాన్ ఫార్రెస్టర్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరంతా కూడా ఓపెనర్ల మాదిరిగా రాణించి ఉంటే సౌతాఫ్రికా ఇంకాస్త భారీ స్కోర్ చేసేది. ఆఖర్లో డెలానో పాట్‌గెటర్ (30*) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి.. ప్రొటీస్ స్కోర్‌ను 300 మార్కు దాటించాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 10 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.
టాపార్డర్ విఫలం:
ఇక భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే... 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (25) సహా టాపార్డర్ అంతా ఘోరంగా విఫలమైంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ చెరో 11, రియాన్ పరాగ్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆతర్వాత ఇషాన్ కిషన్(Ishan Kishan) (53), ఆయుశ్ బదోని(Ayush Badoni ) (66) భారత్ విజయం కోసం కాసేపు పోరాడారు. 49.1 ఓవర్లలో 252 పరుగులకు భారత్ ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నకాబా పీటర్ 4 వికెట్లు సాధించాడు. మొరేకి 3, ఫోర్టుయిన్ 2 పడగొట్టారు.