Hanuma Vihari: ఆంధ్రను వీడిన విహారి
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:02 AM
వైసీపీ ప్రభుత్వంలో అనేక అవమానాలనెదుర్కొని ఆంధ్ర క్రికెట్ జట్టును వీడి..మళ్లీ వెనక్కివచ్చిన హనుమ విహారి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు....
వచ్చే సీజన్ నుంచి త్రిపుర తరఫున బరిలోకి
ఏసీఏ నుంచి సహకారం లేదన్న హనుమ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వైసీపీ ప్రభుత్వంలో అనేక అవమానాలనెదుర్కొని ఆంధ్ర క్రికెట్ జట్టును వీడి..మళ్లీ వెనక్కివచ్చిన హనుమ విహారి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్‌లో త్రిపుర తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర సీనియర్ జట్టు బాధ్యతలు పూర్తిగా తనకే అప్పగిస్తామని పెద్దలు చెప్పినా అలా జరగలేదని విహారి వాపోయాడు. ఏసీఏలో పెద్దగా మార్పులేమీ రాలేదని, అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉందని అన్నాడు. తనకు వైట్‌బాల్ క్రికెట్‌లో అవకాశం ఇస్తారన్న నమ్మకం లేదన్నాడు. మరోవైపు త్రిపుర నుంచి ప్రతిపాదన వచ్చిందని తెలిపాడు. దీంతో తాను ఏసీఏను నిరభ్యంతర పత్రం కావాలని అడిగానని, వారు మంజూరు చేశారని చెప్పాడు. ఇక, దీనిపై ఏసీఏ కార్యవర్గంలోని ఒక కీలక సభ్యుడు స్పందిస్తూ గత సీజన్‌లో విహారికి అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ‘యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని విహారి కోరినందునే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి విహారిని ఎంపిక చేయలేదు. ఏపీఎల్‌లో అద్భుతంగా ఆడినందున అతడికి ఈ సీజన్‌లో అన్ని ఫార్మాట్లలో అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. కానీ, మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా త్రిపుర వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు’ అని ఆ కార్యవర్గ సభ్యుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఇవి కూడా చదవండి
యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్ అవుట్
ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం
మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి