Handshake Controversy: కరచాలన వివాదం
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:59 AM
ఆసియా కప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఉదంతంపై ఆగ్రహం ప్రకటించిన...
ఐసీసీకి పాక్‌బోర్డు ఫిర్యాదు
రెఫరీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలి
లేదంటే ఆసియా కప్ బహిష్కరణ?
దుబాయ్: ఆసియా కప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఉదంతంపై ఆగ్రహం ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే)ను ఆ బాధ్యతలనుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆసియా కప్‌ను బహిష్కరించాలని పీసీబీ యోచిస్తున్నదనే వార్తలు కూడా వినవస్తున్నాయి. కాగా..టీమిండియా క్రికెటర్లు తమ జట్టుతో కరచాలనం చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీబీ ఈ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)తోపాటు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. అయితే..పీసీబీ చీఫ్ మొహిసిన్ నక్వీయే ఏసీసీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఐసీసీకి భారత్‌కు చెందిన జైషా చీఫ్‌గా వ్యవహరిస్తుండడం గమనార్హం. ‘క్రికెట్ స్ఫూర్తికి సంబంధించి ఎంసీ సీ నియమావళిని మ్యాచ్ రెఫరీ ఉల్లంఘించాడు. అందువల్ల అతడిపై చర్యలు తీసుకోవాలి’ పీసీబీ చీఫ్ నక్వీ ఎక్స్‌లో కోరాడు. అయితే ఆసియా కప్‌తో ఐసీసీకి సంబంధంలేదు. ఇది ఏసీసీ నిర్వహించే టోర్నీ. అలాంటప్పుడు ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా చర్యకు బదులుగా..మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బహిష్కరించాడు.
పైక్రాఫ్టే సూచించాడు..: భారత కెప్టెన్‌తో కరచాలనం చేయొద్దని టాస్ సమయంలో పాకిస్థాన్ సారథి సల్మాన్ ఆఘాకు పైక్రాఫ్ట్ సూచించినట్టు పీసీబీ ఆరోపించింది. పైక్రాఫ్ట్ ఆదేశం మేరకే ఆటగాళ్ల జాబితాను ఇరుజట్ల కెప్టెన్లు పరస్పరం మార్చుకోలేదని పాక్ మేనేజర్ నవేద్ చీమా ఆరోపించాడు. ఈమేరకు అతడు ఏసీసీకి ఫిర్యాదు చేశాడు. అలాగే మ్యాచ్ తర్వాత తమ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ మరో ఫిర్యాదునూ ఏసీసీకి పాకిస్థాన్ మేనేజర్ చేశాడు.
సరైన సమాధానమిచ్చాం : సూర్యకుమార్
‘ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. మేం వారికి సరైన సమాధానమే ఇచ్చాం’ అని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ బదులిచ్చాడు.
నక్వీతో నో..?
పాకిస్థాన్‌కు చెందిన మొహిసిన్ నక్వీ ఈనెల 28న జరిగే ఫైనల్ అనంతరం బహుమతి ప్రదాన వేదికమీద ఉంటారు. ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు చేరితే మొహిసిన్ నక్వీతో కలసి మన ఆటగాళ్లు వేదికను పంచుకోవాల్సివుంటుంది. మన టీమ్ గెలిస్తే ఏసీసీ చైర్మన్‌గా విజేత జట్టుకు నక్వీయే ట్రోఫీ ప్రదానం చేయాల్సివుంది. అదే జరిగితే భారత్ నక్వీతో కలిసి వేదికను పంచుకోబోదని అంటున్నారు. మరి ప్రత్యామ్నాయంగా గంభీర్ జట్టు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News