Robin Smith: మాజీ క్రికెటర్ కన్నుమూత
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:10 PM
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ ఆకస్మికంగా కన్నుమూశారు. సోమవారం ఆయన నివాసంలో ప్రాణాలు విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్(62) కన్నుమూశారు. సౌత్ పెర్త్‌లోని తన నివాసంలో సోమవారం స్మిత్ మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రపంచంలోని మేటి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న ఈ లెజెండరీ ఆటగాడి మృతి పట్ల ఇంగ్లండ్ బోర్డు సంతాపం ప్రకటించింది.
రాబిన్ ‘ది జడ్జ్’..
రాబిన్ స్మిత్(Robin Smith)కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ఇంగ్లండ్‌లో అందరూ ‘ది జడ్జ్’ అని పిలుస్తుంటారు. ఆయన మరణ వార్త ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులను విషాదంలోకి నెట్టింది. ‘గుండెల నిండా బాధ, మనసంతా వేదనతో రాబిన్ స్మిత్ మరణ వార్తను మీతో పంచుకుంటున్నాం. డిసెంబర్ 1న స్మిత్ హఠాత్తుగా మరణించాడు. ప్రేమించే తండ్రిగా.. సోదరభావంతో మెలిగే వ్యక్తిగా ఆయన మా హృదయాల్లో నిలిచే ఉంటాడు’ అని రాబిన్ కుటుంబం పేర్కొంది. ‘ప్రపంచంలోని అరవీర భయంకర బౌలర్లకు వెరవకుండా బ్యాటింగ్ చేసిన రాబిన్ మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు తీరని లోటు’ అని ఈసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మద్యానికై బానిసై..
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన రాబిన్ స్మిత్ 1983లో ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. క్రికెట్‌పై ఆసక్తితో అక్కడి హ్యాంప్‌షైర్ క్లబ్‌తో చేరిన అతడు.. దేశవాళీలో అదరగొట్టి జాతీయ జట్టుకు ఎంపియ్యాడు. దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసిన అతడు.. అనతికాలంలోనే ఇంగ్లండ్ అత్యుత్తమ క్రికెటర్‌గా ఖ్యాతి గడించారు. 1988 నుంచి 1996 మధ్య కాలంలో 62 టెస్టులు ఆడాడు. వన్డేల్లోనూ రాణించిన రాబిన్ 1992 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. 2004లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. దీంతో మానసిక సమస్యలతో ఇబ్బంది పడినట్టు అప్పట్లో మీడియాలో ప్రచురితమైంది. అయితే.. రెండు వారాలకు ముందు రాబిన్ ఇంగ్లండ్ లయన్స్ జట్టు స్క్వాడ్‌తో సరదాగా గడిపాడు. అంతలోనే అతడు మరణ వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇవి కూడా చదవండి:
అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్
హార్దిక్ పునరాగమనం.. బరోడా ఘన విజయం