Faf du Plessis: ఐపీఎల్‌కు డుప్లెసిస్ గుడ్ బై
ABN , Publish Date - Nov 29 , 2025 | 08:57 PM
14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ఫాఫ్ డుప్లెసిస్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌లో ఆడనున్నట్టు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ అభిమానులకు షాకిచ్చాడు. ఐపీఎల్‌కు గుడ్ బై చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. వచ్చే నెలలో జరగనున్న మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు. అయితే ఈ ఏడాది జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడనున్నట్లు ప్రకటించడం గమనార్హం.
‘14 సీజన్ల తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఈ లీగ్ నా(Faf du Plessis) ప్రయాణంలో ఓ ముఖ్య భాగం. ఇండియా నాకు స్నేహితులతో పాటు మధురమైన జ్ఞాపకాలను కూడా ఇచ్చింది. ఇది వీడ్కోలు కాదు.. మళ్లీ కచ్చితంగా కలుస్తాను. అయితే ఈ ఏడాది ఓ కొత్త సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నా. రాబోయే పీఎస్ఎల్ సీజన్‌లో ఆడబోతున్నా. కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త సవాల్. పాకిస్తాన్ ఆతిథ్యం కోసం ఎదురు చూస్తున్నా’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
14 ఏళ్లుగా..
ఫాఫ్ గత 14 ఏళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ తర్వాత రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి, వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈ సీజన్ వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసింది. కాగా ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?