Share News

Eden Gardens Test: అనుకున్నట్టే జురెల్‌

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:21 AM

ఫామ్‌లో ఉన్న వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్‌ సిరీ్‌సకు అతడికి జట్టులో చోటు లభించగా.. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆల్‌రౌండర్‌...

Eden Gardens Test: అనుకున్నట్టే జురెల్‌

టెస్ట్‌ జట్టునుంచి నితీశ్‌ అవుట్‌

‘ఈడెన్‌’ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మార్పు

కోల్‌కతా: ఫామ్‌లో ఉన్న వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్‌ సిరీ్‌సకు అతడికి జట్టులో చోటు లభించగా.. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై వేటుపడింది. గురువారం నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్‌ కోసం నితీశ్‌ను టెస్టు జట్టు నుంచి విడుదల చేసినట్టు సహాయ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపాడు. తాజాగా బెంగళూరులో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అనధికార టెస్ట్‌ల్లో ధ్రువ్‌ రెండు సెంచరీలతో అదరగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్‌ టూర్‌లో గాయంతో జట్టుకు దూరమైన రిషభ్‌ పంత్‌ మళ్లీ జట్టులోకి రావడంతో.. జురెల్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఎంపిక చేశారు. జడేజా, సుందర్‌, అక్షర్‌ పటేల్‌ రూపంలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండడంతో అదనపు బ్యాటర్‌తో ఆడే అవకాశం ఉంటుందని డష్కాటే చెప్పాడు. అంటే, తుది జట్టులో కుల్దీ్‌పకు చోటు దక్కడం కష్టమే. కాగా, నితీశ్‌ను భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలనుకొంటున్నట్టు పేర్కొన్నాడు. ‘వెస్టిండీ్‌సతో టెస్ట్‌లు, వన్డే సిరీ్‌సల్లో నితీశ్‌ ఆడాడు. భవిష్యత్‌ అవసరాల కోసం అతడు మరింతగా రాటుదేలాల్సి ఉంది. ఈ సిరీస్‌ నెగ్గడం ఎంతో కీలకం కావడంతో.. అందుకు తగ్గట్టుగా జట్టు కూర్పు ఉంటుంద’ని డష్కాటే తెలిపాడు. అయితే, అవసరమైతే నితీశ్‌ను గువాహటిలో జరిగే రెండో టెస్ట్‌కు పిలిచే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన నితీశ్‌ ఆశించిన రీతిలో రాణించడం లేదు. విండీ్‌సతో తొలి టెస్ట్‌లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్‌ చేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. ఓ ఇన్నింగ్స్‌లో 43 పరుగులు మాత్రమే చేశాడు.

బవుమాకు ఫిట్‌నెస్‌ డ్రిల్‌

బుధవారం ఉదయం దక్షిణాఫ్రికా జట్టు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసింది. గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ టెంబా బవుమా.. కోచ్‌, ఫిజియో సమక్షంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకొన్నాడు. 20 నిమిషాలపాటు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాల్గొన్న బవుమా ఆ తర్వాత నెట్స్‌లో సాధన చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సలో కండర గాయం కావడంతో బవుమా జట్టుకు దూరమయ్యాడు. గతవారం భారత్‌-ఎతో జరిగిన రెండో అనధికార టెస్ట్‌తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.


చరిత్ర సృష్టించాలనుకొంటున్నాం

గత 15 ఏళ్లలో భారత్‌తో దక్షిణాఫ్రికా ఒక్క టెస్ట్‌ కూడా నెగ్గలేదు. కానీ, ఈసారి ఆ దాహాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నామని సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ అన్నాడు. పిచ్‌ను చూస్తే మ్యాచ్‌ ఆఖరి రోజు వరకు సాగే అవకాశం ఉందని చెప్పాడు. దక్షిణాఫ్రికా కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కేశవ్‌ మహారాజ్‌, ముత్తుసామి, సైమన్‌ హార్మర్‌లతో కూడిన స్పిన్‌ త్రయం.. టీమిండియాకు దీటుగా ఉందన్నాడు.

స్పిన్‌

బలంతోనే..?

స్వదేశంలో స్పిన్‌ బౌలింగ్‌ టీమిండియా ప్రధాన బలం. ఈడెన్‌ గార్డెన్స్‌లో కూడా ఇదే ఫార్ములాను భారత మేనేజ్‌మెంట్‌ అమలు చేసే అవకాశం ఉంది. సఫారీల బ్యాటర్లు కూడా ఉపఖండంలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో అనేక సందర్భాల్లో తడబడ్డారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 05:22 AM