Ashwin: బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన అశ్విన్
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:01 PM
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోకాలి గాయం కారణంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. సిడ్నీ థండర్ జట్టులో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. ఆ అవకాశం వాయిదా పడింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్( Big Bash League 2025) నుంచి వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా ఈ ఎడిషన్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. అశ్విన్ ఇటీవలే బీబీఎల్‌లోని సిడ్నీ థండర్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
గ్రాండ్‌గా ప్లాన్ చేశాం.. కానీ!
అశ్విన్ బీబీఎల్ అరంగేట్రం చేసి ఉంటే చరిత్ర సృష్టించేవాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్ ఈ లీగ్‌లో ఆడలేదు. అశ్విన్ ఆడితే.. బీబీఎల్ ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నమోదు అయ్యేది. ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్(Sydney Thunder) యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది.
‘గాయం కారణంగా అశ్విన్ బీబీఎల్ ఎంట్రీ వాయిదా పడింది. ఈ సీజన్ మొత్తానికి అశ్విన్ దూరమయ్యాడు. ఇది మా దురదృష్టకరం. యాష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. యాష్‌పై ఈ సీజన్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అతడి అరంగేట్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. దురదృష్టవశాత్తు అది వాయిదా పడింది’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ లీగ్ మిస్ అయినందుకు అశ్విన్ కూడా బాధ పడ్డాడు. ఫ్యాన్స్‌ను నిరాశపరిచినందుకు క్షమాపణలు చెప్పాడు.
కాగా 2025-2026 బిగ్‌బాష్ లీగ్ సీజన్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అశ్విన్ ప్రాతినిధ్యం వహించాల్సిన సిడ్నీ థండర్ జట్టు తమ తొలి మ్యాచ్ డిసెంబర్ 16న హోబర్ట్ హరికేన్స్‌తో తలపడనుంది.