Cheteshwar Pujara: ఉక్కు సంకల్పం
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:27 AM
ఆశలు కొడిగడుతున్న వేళ.. అలుపెరుగని యోధుడిలా అవకాశాలు సృష్టిస్తాడు. ప్రత్యర్థుల దెబ్బకు జట్టు అల్లకల్లోలమైనా.. నేనున్నానంటూ ధీశాలిలా ఎదురొడ్డుతాడు. ఓర్పు.. నేర్పుతో పరిస్థితులను చక్కదిద్దుతాడు...
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఆశలు కొడిగడుతున్న వేళ.. అలుపెరుగని యోధుడిలా అవకాశాలు సృష్టిస్తాడు. ప్రత్యర్థుల దెబ్బకు జట్టు అల్లకల్లోలమైనా.. నేనున్నానంటూ ధీశాలిలా ఎదురొడ్డుతాడు. ఓర్పు.. నేర్పుతో పరిస్థితులను చక్కదిద్దుతాడు.. తర్వాతి బ్యాటర్లకు భరోసాగా నిలుస్తాడు. అతడే భారత జట్టు నయా వాల్ చటేశ్వర్ పుజార. దశాబ్దానికిపైగా టీమిండియాకు పెట్టని కోటగా నిలిచిన పుజార శకం ముగిసింది.
కోహ్లీలా కవర్ డ్రైవ్ ఆడలేడు.. రిషభ్ పంత్‌లా విధ్వంసం సృష్టించనూలేడు. బంతిని బలంగా బాదుతూ.. వీక్షకులకు వెర్రెత్తిస్తున్న టీ20 జమానాలో.. క్లాసిక్ క్రికెట్‌కు మచ్చుతునక! టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ రిటైరైనప్పుడు.. నేనున్నాంటూ జట్టుకు అండగా నిలిచాడు. నిస్వార్థం, ఉక్కు సంకల్పంతో.. మూడో నెంబర్‌లో గుబాళించాడు. ఆటగాడిగా పెద్దగా స్టార్‌డమ్ లేకపోవచ్చు.. అంతులేని అభిమాన గణం మాత్రం అతని సొంతం. ఫోర్లు, సిక్స్‌లు, స్ట్రయిక్ రేట్‌తో పుజార సేవలను కొలవలేం. జట్టు కోసం సర్వస్వం ధారపోస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలింగ్‌ను ఎదుర్కొని.. జట్టును ప్రమాదం నుంచి గట్టెక్కించేందుకు శతవిధాలా పాటుపడతాడు. బుల్లెట్ లాంటి బంతులు శరీరాన్ని తాకుతున్నా.. అదరడు.. బెదరడు. కోహ్లీ లాంటి వాళ్లు టెస్టుల్లో శాతకాల మీద శతకాలు బాదొచ్చు.. కానీ, దానికి బలమైన పునాది మాత్రం పుజారానే!
మాజీ రంజీ ఆటగాడు అరవింద్ కుమారుడే చటేశ్వర్ పుజార. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పుజారకు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఉండేది. చిన్నవయసులోనే తల్లిని కోల్పోవడంతో.. పుజారకు అరవింద్ అన్నీ తానై చూసుకొన్నాడు. అసలుసిసలు టెస్టు క్రికెట్ మనస్తత్వాన్ని అతడిలో నాటుకొనేలా చేశాడు. తన తల్లి మరణించినప్పుడు కూడా పుజార ఆ బాధను బయటకు కనిపించకుండా తనలోనే తాను దిగమింగుకోవడం అతడి సహనశీలతకు నిదర్శనమని అరవింద్ ఒకానొక సమయంలో చెప్పాడు. అండర్-14 క్రికెట్‌లో త్రిశతకం బాదిన పుజార ఇంగ్లండ్‌లో అండర్-19 విభాగంలో డబుల్ సెంచరీ సాధించాడు. స్ట్రోక్ ప్లేయర్ కాకపోయినా.. పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి బౌలర్లును అలసిపోయేలా చేస్తాడు. గంటల కొద్దీ క్రీజులో ఉన్నా ఏమాత్రం అలసట దరిచేరనీయకుండా ఆడడం అతడి ప్రత్యేకత. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన చటేశ్వర్.. 2010లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై ఆరంగేట్రం చేశాడు. పదేళ్లకుపైగా భారత టెస్టు క్రికెట్‌కు వెన్నుముకగా నిలిచిన పుజార 2023లో చివరగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాడు. గాయాలు, వరుస వైఫల్యాలతో జట్టులో చోటు కోల్పోయాడు.

మాటల్లో పొదుపు..
‘ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్: ఎ వెరీ అన్ యూజువల్ మెమోయిర్’ పుస్తకంలో తన భర్త స్వభావం గురించి పుజార భార్య పూజ కొన్ని విషయాలు పంచుకొంది. ‘తక్కువగా మాట్లాడతాడు. చిరునవ్వుతో పనైపోతుందనుకొంటే.. మౌనం పాటిస్తాడు. అతడి నోటి వెంట పదాలు పొదుపుగా వెలువడతాయి. ఈ తరం క్రికెటర్లకు భిన్నం’ అని రాసింది. పుజార కెరీర్ కోసం అతని కుటుంబం చేసిన త్యాగాల గురించి రాసుకొచ్చింది. ఇక భగవద్గీత తమ జీవితాల్లో చూపిన ప్రభావం గురించి తన పుస్తకంలో వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News