Marathon Batsman: నయా వాల్ నిష్క్రమణ
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:37 AM
చటేశ్వర్ పుజార.. టెస్టు క్రికెట్‌కు అసలు సిసలైన పర్యాయపదం. యుద్ధభూమిలో సైనికుడి మాదిరి పట్టుదల, ఓర్పు అతడి సొంతం. ఓవైపు వికెట్లు పడుతున్నా నేనున్నాగా అనే భరోసాతో క్రీజులో గంటలకొద్దీ పాతుకుపోయి అతనాడిన...
క్రికెట్‌కు పుజార వీడ్కోలు
వన్‌డౌన్‌లో తిరుగులేని బ్యాటర్
చటేశ్వర్ పుజార.. టెస్టు క్రికెట్‌కు అసలు సిసలైన పర్యాయపదం. యుద్ధభూమిలో సైనికుడి మాదిరి పట్టుదల, ఓర్పు అతడి సొంతం. ఓవైపు వికెట్లు పడుతున్నా నేనున్నాగా అనే భరోసాతో క్రీజులో గంటలకొద్దీ పాతుకుపోయి అతనాడిన ఇన్నింగ్స్ ఎన్నెన్నో. అతడికి బంతులు వేసీ వేసీ బౌలర్ల భుజాలు నొప్పి పుట్టాల్సిందేగానీ అతను మాత్రం అంత సులువుగా పెవిలియన్ చేరడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో బౌన్సీ, సీమ్ పిచ్‌లపై పేసర్ల బుల్లెట్‌లాంటి బంతులకు ఒళ్లు హూనమవుతున్నా బెదరకుండా శతకాలతో జట్టును గెలిపించిన ధీరుడు. టీమిండియా నయా వాల్‌గా మన్ననలందుకున్న ఈ సౌరాష్ట్ర హీరో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సీనియర్ల రిటైర్మెంట్ కొనసాగుతూనే ఉంది. తాజాగా చటేశ్వర్ పుజార 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సౌరాష్ట్రకు చెందిన 37 ఏళ్ల పుజార 2010లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. దశాబ్దానికి పైగా వన్‌డౌన్ స్థానంలో జట్టుకు నమ్మదగ్గ బ్యాటర్‌గా సేవలందించాడు. ఈక్రమంలో జట్టుకు ఇంటా, బయటా చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెరీర్‌లో ఆడిన 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 16 శతకాలున్నాయి. ఇక ఐదు వన్డేల్లో 51 పరుగులున్నాయి. జూన్, 2023లో జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్ మ్యాచ్ పుజార కెరీర్‌లో చివరిది. ఆ తర్వాత కొత్త తరం ఆటగాళ్లపై మేనేజ్‌మెంట్ దృష్టి సారించడంతో అతనికి ద్వారాలు మూసుకుపోయాయి. అయినా దేశవాళీల్లో సౌరాష్ట్ర, కౌంటీల్లో ససెక్స్ తరఫున కొనసాగాడు. ఓవరాల్‌గా కెరీర్ మొత్తంలో పుజార 278 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 51.82 సగటుతో 66 శతకాలు, మూడు ట్రిపుల్ సెంచరీలతో 21,301 పరుగులు చేశాడు.
మారథాన్ ఇన్నింగ్స్‌తో..
ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత మూడో స్థానంలో పుజార జట్టుకు ఆశాకిరణంగా మారాడు. 2012, జూన్‌లో తొలి టెస్టు సెంచరీ కొట్టాడు. రెండు నెలల తర్వాత స్వదేశంలోనే ఇంగ్లండ్‌పై తొలి డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే క్రీజులో సుదీర్ఘ సమయం గడపడంలో తనను మించిన వారు లేరనే చెప్పవచ్చు. 2013 జొహాన్నె్‌సబర్గ్ టెస్టులో ఆరు గంటలపాటు క్రీజులో నిలిచి 153 పరుగులు సాధించడమే కాదు మ్యాచ్‌ను ఉత్కంఠభరిత డ్రాగా ముగించాడు. 2015లో కొలంబోలోనూ 289 బంతులనెదుర్కొని 145 పరుగులు చేశాడు. ఇక 2017లో రాంచీలో పుజార ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆసీ్‌సతో జరిగిన ఈ టెస్టులో తను ఏకంగా 11 గంటలపాటు పట్టు వదలకుండా పోరాటం సాగించి డబుల్ సెంచరీతో నిలిచాడు. ఈక్రమంలో భారత్ తరఫున రికార్డు స్థాయిలో 525 బంతుల (87.5 ఓవర్లు)ను ఆడడం విశేషం. అదే ఏడాది ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై ఐదు రోజుల పాటు క్రీజులో నిలిచి అరుదైన ఫీట్ సాధించాడు. భారత్ తరఫున ఎంఎల్ జైసింహ, రవిశాస్త్రి తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో భారత ఆటగాడిగా పుజార రికార్డులకెక్కాడు.
ఆసీస్ గడ్డపై
తొలిసారి..
భారత క్రికెట్ చరిత్రలో 2018-19 ఆస్ట్రేలియా పర్యటన చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ సాధించగలిగింది. ఈ ఘనతలో పుజారదే కీలక పాత్ర. అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీలలో శతకాలు బాదిన తను అత్యధికంగా 521 పరుగులతో జట్టుకు తొలి సిరీస్ విజయాన్నందించాడు. ఆ తర్వాత రెండేళ్లకు భారత్ అక్కడ మరో సిరీస్ గెల్చుకోగలిగింది. ఈసారి పుజార నాలుగు అర్ధశతకాలతో అండగా నిలిచాడు. బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ బౌలర్లు అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకున్నా నొప్పిని భరిస్తూనే 200కి పైగా బంతులు ఆడి 56 రన్స్ చేయడం గమనార్హం.
క్రికెట్ నాకెంతో
ఇచ్చింది..
రాజ్‌కోట్‌లాంటి పట్టణం నుంచి వచ్చిన నేను చిన్నతనం నుంచే భారత జట్టులో చోటు కోసం కలలు కన్నాను. కానీ క్రికెట్ నాకెంతో ఇవ్వబోతున్నదనే విషయం అప్పట్లో నాకు తెలీదు. కాలక్రమంలో భారత జెర్సీ ధరించి జాతీయ గీతాలాపన చేయడం, జట్టుకు నా తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ మాటల్లో వర్ణించలేని అనుభవాలు. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి మధుర అనుభూతులకు కూడా ముగింపు పలకాల్సిందే. అందుకే అపారమైన కృతజ్ఞతతో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. కెరీర్ ఆసాంతం నాకు అండగా నిలిచిన బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు. నా మార్గదర్శకులు, కోచ్‌లు, మెంటార్, ఆధ్యాత్మిక గురువు నా ఎదుగుదలలో తోడ్పడ్డారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, భార్య, కూతురు, ఇతర కుటుంబ సభ్యుల అండ లేకుంటే ఇక్కడిదాకా వచ్చేవాణ్ని కాదు. సహచర క్రికెటర్లు, సహాయక సిబ్బంది, నెట్ బౌలర్లు, అంపైర్లు అనలి్‌స్టలు, గ్రౌండ్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌ల సహకారం కూడా మరువలేనిది.
పుజార
పుజార కెరీర్ ఇలా..
ఫార్మాట్ మ్యాచ్‌లు పరుగులు సెంచరీలు
టెస్టులు 103 7,195 19
వన్డేలు 5 51 0
ఫస్ట్ క్లాస్ 278 21,301 66
మూడో స్థానంలో నువ్వు బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడల్లా అదే భరోసా. ఆడిన ప్రతిసారీ టెస్ట్ క్రికెట్ స్థాయిని పెంచావు. నీ బలమైన టెక్నిక్, సంయమనంతో జట్టుకు మూలస్తంభంగా నిలిచావు. 2018లో ఆస్ట్రేలియాపై గెలుపు నువ్వు లేకుంటే సాధ్యమయ్యేదే కాదు.
సచిన్ టెండూల్కర్
కష్టకాలంలో జట్టుకు గోడలా అడ్డు నిలిచావు. ఆశలు ఆవిరవుతున్న వేళ.. పోరాటంతో స్ఫూర్తిని రగిలించావు
గంభీర్
గాబాలో నీ ఆటతో ఫ్యాన్‌గా మారిపోయా. జట్టు కోసం ఏదైనా చేస్తావు. సెకండ్ ఇన్నింగ్స్‌లో నీకు మరిన్ని శుభాలు కలగాలి.
వీవీఎస్ లక్ష్మణ్
నిజమైన పోరాట యోధుడు. నా హయాంలో జట్టు నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడంలో పుజారది ముఖ్య భూమిక. ఆస్ట్రేలియాపై వరుసగా సిరీస్ నెగ్గడంలో నీ ప్రదర్శన అమోఘం.
- రవిశాస్త్రి
నిస్వార్థం, దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. టెస్ట్ క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించావు. అకుంఠిత దీక్షతో జట్టుకు గోడలా నిలిచావు. నిబద్ధతతో దేశ క్రికెట్‌కు సేవలందించావు.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
క్రికెట్‌కు అత్యుత్తమ రాయబారివి. నీ ఘనతలను చూసి గర్విస్తున్నాం. నీతో కలసి పనిచేసే అవకాశం దక్కడం గొప్పగా భావిస్తున్నా.
కుంబ్లే
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News