Share News

Ind vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ 250.. భారం టీమిండియా బౌలర్లపైనే..!

ABN , Publish Date - Mar 02 , 2025 | 06:13 PM

బౌలర్లు సమష్టిగా రాణించడం, అద్భుతమైన ఫీల్డింగ్ తోడు కావడంతో టీమిండియాను తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ కట్టడి చేయగలిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు చెలరేగారు. ఆరంభంలో తక్కువ స్కోరుకే టాపార్డర్‌ను వెనక్కి పంపారు.

Ind vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ 250.. భారం టీమిండియా బౌలర్లపైనే..!
Ind vs NZ

బౌలర్లు సమష్టిగా రాణించడం, అద్భుతమైన ఫీల్డింగ్ తోడు కావడంతో టీమిండియాను తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ కట్టడి చేయగలిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు చెలరేగారు. ఆరంభంలో తక్కువ స్కోరుకే టాపార్డర్‌ను వెనక్కి పంపారు. అయితే మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ (79) , అక్షర్ పటేల్ (42) నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. వేగంగా ఆడే క్రమంలో అయ్యర్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ గాడి తప్పింది. చివరకు టీమిండవియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది.


చివర్లో హార్దిక్ పాండ్యా (45) వేగంగా ఆడడంతో భారత్ చెప్పుకోదగిన స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ (23), రవీంద్ర జడేజా (16) ఫర్వాలేదనిపించారు. శుభ్‌మన్ గిల్ (2), రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (11) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కివీస్ బౌలర్లలో హెన్రీ ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. జేమీసన్, రచిన్ రవీంద్ర, రోర్క్, శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఫీల్డర్లు పట్టిన అద్భుతమైన క్యాచ్‌లు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. కోహ్లీ క్యాచ్‌ను ఫిలిప్స్, జడేజా క్యాచ్‌ను విలియమ్సన్ కళ్లు చెదిరే రీతిలో అందుకున్నారు.


గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ చివరి లీగ్ మ్యాచ్ సెమీస్‌లో ఏయే జట్లు తలపడబోతున్నాయే తేల్చేస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో సెమీస్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఏ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు, గ్రూప్-బి నుంచి అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ జట్లు ఇంటి దారి పట్టాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 02 , 2025 | 06:13 PM