Cricket Regulations: ఒకరికి గాయమైతే మరొకరు ఆడొచ్చు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:43 AM
ఈ దేశవాళీ సీజన్ (2025-26) ‘ప్లేయింగ్ కండీషన్స్‘కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో...
బీసీసీఐ కీలక నిర్ణయం
ఆటగాడికి సబ్‌స్టిట్యూట్ నిబంధన
ఈ దేశవాళీ సీజన్‌లో అమలు
న్యూఢిల్లీ: ఈ దేశవాళీ సీజన్ (2025-26) ‘ప్లేయింగ్ కండీషన్స్‘కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని..తీవ్రంగా గాయపడిన ఆటగాడి స్థానంలో మరో క్రికెటర్‌ను అనుమతించే విషయంలో నూతన నిబంధనను వెలువరించింది. ‘ఏదైనా మ్యాచ్‌లో ఆటగాడు తీవ్రంగా గాయపడితే అతడికి బదులు మరో ఆటగాడిని అనుమతిస్తాం’ అని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈమేరకు ‘ఆట నిబంధనల’లో మార్పు చేసినట్టు తెలిపింది. రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, సీకే నాయుడు అండర్-19 ట్రోఫీ టోర్నమెంట్లకు కొత్త నిబంధన వర్తిస్తుంది. అయితే ఆ క్రికెటర్ సదరు మ్యాచ్‌కు మైదానంలో ఉన్న సమయంలో గాయపడినప్పుడే సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని అనుమతిస్తారు. ఫ్రాక్చర్ లేదా శరీరంపై లోతైన గాయం అయినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ నాలుగు, ఐదు టెస్ట్‌ల సమయంలో కీలక ఆటగాళ్ల గాయంతో రెండు జట్లు సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్ట్‌లో భారత్ కీపర్ పంత్ పాదానికి, ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది. వీరిద్దరి గాయం రెండు జట్లపై పెద్ద ప్రభావం చూపింది. కాగా..కంకషన్ సమయంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని అనుమతించే విధానం క్రికెట్‌లో ఎప్పటినుంచో ఉంది. కానీ ఇలా తీవ్రంగా గాయపడిన సందర్భంలో సబ్‌స్టిట్యూట్‌ను అనుమతించే నిబంధన మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో లేదు.
అలా చర్చ మొదలై..
ఇటీవల ఇంగ్లండ్, భారత్ టెస్ట్ సిరీస్‌లో పంత్, వోక్స్ ఉదంతాల దరిమిలా..తీవ్రంగా గాయపడిన ఆటగాడికి బదులు మరో క్రికెటర్‌ను అనుమతించాలనే చర్చ కూడా జరిగింది. ఆ చర్చను టీమిండియా కోచ్ గంభీర్ స్వాగతించాడు. ‘ఒక ఆటగాడు తీవ్రంగా గాయపడ్డాడని అంపైర్లు, రెఫరీ భావించినప్పుడు అతడి స్థానంలో మరొకరిని అనుమతించాలి. లేదంటే సదరు జట్టును శిక్షించినట్టే. హోరాహోరీగా సాగే మ్యాచ్‌లో 11 మంది జట్టుతో 10 మంది సభ్యులు గల టీమ్ తలపడడం సబబేనా’ అని గంభీర్ ప్రశ్నించాడు. ‘ఒక ఆటగాడికి బదులు మరో క్రికెటర్‌ను అనుమతించడంలో తప్పులేదు’ అని గౌతమ్ స్పష్టంజేశాడు. కానీ గంభీర్ అభిప్రాయంతో ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ విభేదించాడు. ‘గాయపడిన ఆటగాడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ అనే విషయంపై చర్చే అసంబద్ధం. గాయాలనేవి క్రికెట్‌లో భాగం. కంకషన్ అంటారా..క్రికెటర్ క్షేమం రీత్యా ఆ నిబంధన ఓకే. కానీ గాయపడిన ఆటగాడికి సబ్‌స్టిట్యూట్ అంశంలో లొసుగులుంటాయి’ అని వ్యాఖ్యానించాడు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి