Share News

BCCI New Rules: భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. ఇక నుంచి వారికి నో ఎంట్రీ..

ABN , Publish Date - Feb 13 , 2025 | 08:28 PM

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జరిగిన విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను బీసీసీఐ కొత్త విధానాలపై విలేకరులు ప్రశ్నించారు. అయితే రోహిత్ మాత్రం స్పందించేందుకు నిరాకరించారు.

BCCI New Rules: భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. ఇక నుంచి వారికి నో ఎంట్రీ..
BCCI new policies

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) టీమిండియా క్రికెట్ ప్లేయర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 నేపథ్యంలో.. ప్లేయర్లతో వారి కుటుంబ సభ్యులు రావడాన్ని నిరాకరించింది. ప్లేయర్లతో కుటుంబ సభ్యులు ఉండకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో ఇండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఛాంపియన్స్ ట్రోఫీలో అలా జరగకూడదనే ఉద్దేశ్యంతో ఆటగాళ్లకు కొత్త నిబంధనలు జారీ చేసింది బీసీసీఐ.


ఈ కొత్త నిబంధనల ప్రకారం.. సిరీస్ లేదా టోర్నమెంట్ 45 రోజుల కంటే తక్కువ కాలం ఉంటే క్రికెటర్ల కుటుంబ సభ్యులను వారితో అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. 45 రోజుల కంటే ఎక్కువ కాలం సిరీస్ ఉన్నప్పుడు మాత్రమే ఆటగాళ్ల కుటుంబ సభ్యులను భారత జట్టుతో ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. అయితే, ఈ సందర్భాల్లోనూ గరిష్ఠంగా రెండు వారాలపాటు మాత్రమే క్రికెటర్లతో ఉండేందుకు అనుమతి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.


ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జరిగిన విలేకరుల సమావేశంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను.. బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే, దీనిపై స్పందించేందుకు రోహిత్ నిరాకరించాడు. మరోవైపు.. ఈ కొత్త నిబంధనలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌తో మాట్లాడేందుకు రోహిత్ ప్రయత్నించినట్లుగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అజిత్ అగార్కర్‌తో రోహిత్ మంతనాలు జరుపుతున్నట్లుగా కనపడుతోంది.


బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘తాజా నిబంధనల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్లతోపాటు వారి భార్యలు, భాగస్వాములు వచ్చే అవకాశం లేదు. సీనియర్ ఆటగాళ్లలో ఒకరు దీనిపై అడిగారు. కానీ, ఇప్పటికే ఈ విధానంపై అంతిమ నిర్ణయం తీసుకున్నట్లు అతనికి చెప్పాం. పర్యటన ఒక నెల కన్నా తక్కువ సమయం ఉన్నందున కుటుంబ సభ్యులు, భాగస్వాములు ఆటగాళ్లతోపాటు వచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ మినహాయింపులు కావాలంటే.. సదరు క్రికెటరే వారి పూర్తి ఖర్చులను భరించాల్సి ఉంటుంది. బీసీసీఐ వారి కోసం ఎలాంటి ఖర్చునూ భరించదు.’ అని స్పష్టం చేశారు.


ఇటీవల జరిగిన మ్యాచుల్లో టీమిండియా వరుసగా విఫలమవుతోంది. దీంతో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగాగే కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తోంది బీసీసీఐ. టీమ్‌లోని ప్లేయర్లను విడివిడిగా ప్రయాణించేందుకు బీసీసీఐ అనుమతించడం లేదు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వైట్‌ బాల్ సిరీస్‌లోనూ ఇదే విధానాన్ని అమలు చేసింది బీసీసీఐ. అంతేకాదు.. క్రికెటర్ల వ్యక్తిగత సిబ్బందిని సైతం వారితో తీసుకెళ్లడానికి బీసీసీఐ అనుమతించడం లేదు.

Updated Date - Feb 13 , 2025 | 08:28 PM