Share News

Asia Cup 2025 Abu Dhabi: బంగ్లా అవలీలగా

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:32 AM

కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) అర్ధసెంచరీతో ఆసియాక్‌పలో బంగ్లాదేశ్‌ బోణీ చేసింది. గురువారం గ్రూప్‌ ‘బి’లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది...

Asia Cup 2025 Abu Dhabi: బంగ్లా అవలీలగా

ఆసియా కప్‌

హాంకాంగ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం

కెప్టెన్‌ లిట్టన్‌ హాఫ్‌ సెంచరీ

అబుధాబి: కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) అర్ధసెంచరీతో ఆసియాక్‌పలో బంగ్లాదేశ్‌ బోణీ చేసింది. గురువారం గ్రూప్‌ ‘బి’లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. తౌహీద్‌ హ్రిదయ్‌ (35 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌ 20 ఓవర్లలో 143/7 స్కోరు సాధించింది. నిజాకత్‌ ఖాన్‌ (42), ఓపెనర్‌ జీషన్‌ అలీ (30), యాసిన్‌ ముర్తజా (28) మాత్రమే రాణించారు. పేసర్లు తన్‌జీమ్‌ హసన్‌, టస్కిన్‌ అహ్మద్‌, స్పిన్నర్‌ రిషాద్‌ రెండేసి వికెట్లు సాధించారు. ఆ తర్వాత ఛేదనలో బంగ్లాదేశ్‌ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 144 పరుగులు చేసి నెగ్గింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు పర్వేజ్‌ (19), తన్‌జీద్‌ (14) వికెట్లు కోల్పోయినా 51/2 స్కోరుతో జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత 7-12 ఓవర్ల మధ్య హాంకాంగ్‌ బౌలర్లు ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కానీ కెప్టెన్‌ లిట్టన్‌ వరుస ఫోర్లతో స్కోరును గాడిలో పెట్టాడు. 16వ ఓవర్‌లో 6,4తో 16 రన్స్‌ సాధించిన అతడు 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేశాడు. అతడికి మరో ఎండ్‌లో హ్రిదయ్‌ సహకరించగా మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. విజయానికి రెండు పరుగుల దూరంలో లిట్టన్‌ వెనుదిరిగినా మరో 14 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.

పేసర్ల కట్టడి: అఫ్ఘాన్‌పై 94 పరుగులకే పరిమితమైన హాంకాంగ్‌ ఈసారి కాస్త మెరుగ్గానే ఆడింది. అయితే ఆరంభంలో బంగ్లా పేసర్లు ఇబ్బందిపెట్టడంతో పవర్‌ప్లేలో 34 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో నిజాకత్‌ ఖాన్‌, ఓపెనర్‌ జీషన్‌ అలీ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరంభంలో తడబడిన జీషన్‌ తొమ్మిదో ఓవర్‌లో 6,4తో బ్యాట్‌ ఝుళిపించాడు. ఆ తర్వాత అడపాదడపా బౌండరీలతో వేగం పెంచిన అతడిని తన్‌జీమ్‌ అవుట్‌ చేశాడు. ఈ దశలో యాసిన్‌ ముర్తజా ధాటిగా ఆడి స్కోరులో వేగం చూపాడు. కానీ 18వ ఓవర్‌లో అతడు రనౌట్‌ కావడంతో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే నిలకడగా ఆడుతున్న నిజాకత్‌, కించిత్‌ (0)లను స్పిన్నర్‌ రిషాద్‌ అవుట్‌ చేయడంతో హాంకాంగ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


సంక్షిప్త స్కోర్లు

హాంకాంగ్‌ :20 ఓవర్లలో 143/7: (నిజాకత్‌ ఖాన్‌ 42, జీషన్‌ అలీ 30 తన్‌జీమ్‌ 2/21, రిషాద్‌ 2/31, టస్కిన్‌ 2/38); బంగ్లాదేశ్‌ 17.4 ఓవర్లలో 144/3 : (లిట్టన్‌ దాస్‌ 59, హ్రిదయ్‌-నాటౌట్‌ 35, ఇక్బాల్‌ 2/14, శుక్లా 1/32).

6-Business.jpg

రెఫరీలు, అంపైర్లు

అంతా అతివలే..

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌

దుబాయ్‌ : మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో తొలిసారి..మెగా టోర్నీలో అంతా అతివలే మ్యాచ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈమేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 14 మందితో కూడిన మ్యాచ్‌ అధికారుల జాబితాను గురువారం ప్రకటించింది. ఇందులో..అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో తొలి మహిళా మ్యాచ్‌ రెఫరీగా ఖ్యాతి గాంచిన తెలుగు మాజీ క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మికి చోటు దక్కింది. మొత్తం నలుగురు మ్యాచ్‌ రెఫరీలుగా వ్యవహరించనున్నారు. అలాగే 14 మంది అంపైర్లలో భారత్‌నుంచి మాజీ క్రీడాకారిణులు వ్రింద రాథీ, ఎన్‌.జనని, గాయత్రీ వేణుగోపాలన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ భారత్‌, శ్రీలంక వేదికలుగా ఈనెల 30న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:32 AM