ODI Records: రికార్డుల హోరు
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:20 AM
దక్షిణాఫ్రికాతో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా నామమాత్రమైన మూడో వన్డేలో దుమ్ము రేపింది. టాప్-3 బ్యాటర్లు హెడ్ (142), కెప్టెన్ మిచెల్ మార్ష్ (100), కామెరూన్ గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కిన వేళ రికార్డులతో...
సఫారీలపై ఆఖరి వన్డేలో 276 రన్స్‌తో
ఆస్ట్రేలియా గెలుపు
మెకే (ఆస్ట్రేలియా): దక్షిణాఫ్రికాతో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా నామమాత్రమైన మూడో వన్డేలో దుమ్ము రేపింది. టాప్-3 బ్యాటర్లు హెడ్ (142), కెప్టెన్ మిచెల్ మార్ష్ (100), కామెరూన్ గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కిన వేళ రికార్డులతో హోరెత్తించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 276 పరుగులతో సఫారీలపై ఘన విజయం సాధించింది. తద్వారా వన్డేలలో దక్షిణాఫ్రికాకు అత్యంత భారీ ఓటమిని రుచి చూపించింది. తొలుత ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 431/2 స్కోరు చేసింది. వన్డేలలో ఆసీ్‌సకిది రెండో అత్యధిక స్కోరు. అనంతరం యువ స్పిన్నర్ కూపర్ కొనొలీ (5/22) ధాటికి దక్షిణాఫ్రికా 24.5 ఓవర్ల 155 పరుగులకే కుప్పకూలింది. బ్రేవిస్ (49), జోర్జి (33) ఆదుకోకపోతే పర్యాటక జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మొత్తంగా..తొలి రెండు వన్డేలలో ఓడి సిరీస్ చేజార్చుకున్న ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్‌లో గెలిచి ఓదార్పు దక్కించుకుంది.
కొద్దిలో రికార్డు చేజారింది: అంతకుముందు ఆస్ట్రేలియా వన్డేలలో తమ అత్యధిక స్కోరు 434/4ను తిరగరాసే అవకాశాన్ని 4 పరుగుల తేడాతో కోల్పోయింది. ఆ స్కోరును కూడా సౌతాఫ్రికాపైనే 2006లో సాధించడం గమనార్హం. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు హెడ్, మార్ష్ విరుచుకుపడ్డారు. 34 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 250 పరుగులు జత చేశారు. ఎంపాక 6 ఓవర్లలో 73, ముల్డర్ 7 ఓవర్లలో 93, ముత్తుసామి 9 ఓవర్లలో 75 రన్స్ సమర్పించుకున్నారు. 35వ ఓవర్లో హెడ్‌ను కేశవ్..కొద్దిసేపటికే మార్ష్‌ను ముత్తుసామి అవుట్ చేశారు. ఆ తర్వాత గ్రీన్.. బౌలర్ల భరతం పట్టాడు. దాంతో చివరి 10 ఓవర్లలో ఆసీస్ 126 రన్స్ రాబట్టింది. ఈక్రమంలో గ్రీన్ సెంచరీ, కేరీ హాఫ్ సెంచరీ పూరించారు.
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 431/2 (హెడ్ 142, మార్ష్ 100, గ్రీన్ 118 నాటౌట్, కేరీ 50 నాటౌట్, కేశవ్ మహరాజ్ 1/57, ముత్తుసామి 1/75).
దక్షిణాఫ్రికా: 24.5 ఓవర్లలో 155 ఆలౌట్ (బ్రేవిస్ 49, జోర్జి 33, కొనొలీ 5/22, అబాట్ 2/27, బార్ట్‌లెట్ 2/45).
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News