India vs Australia 1st ODI Result: బ్యాట్లెత్తేశారు
ABN , Publish Date - Oct 20 , 2025 | 03:06 AM
ఈ ఏడాది వన్డేల్లో అప్రతిహతంగా సాగుతున్న భారత జోరుకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో విఫలమైన గిల్ సేనపై డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్...
తొలి వన్డేలో భారత్‌కు ఆసీస్ ఝలక్
నిరాశపర్చిన రో-కో
రాణించిన మార్ష్
పెర్త్: ఈ ఏడాది వన్డేల్లో అప్రతిహతంగా సాగుతున్న భారత జోరుకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో విఫలమైన గిల్ సేనపై డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో వరుసగా 8 విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. అలాగే మూడు వన్డేల ఈ సిరీ్‌సలో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. గురువారం రెండో వన్డే అడిలైడ్‌లో జరుగుతుంది. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0)లపై అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత్ ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించగా, టీమిండియా 136/9 స్కోరు సాధించింది. రాహుల్ (38), అక్షర్ (31), నితీశ్ (19) మాత్రమే రాణించారు. హాజెల్‌వుడ్, ఓవెన్, కునేమన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత ఆసీస్ లక్ష్యాన్ని 22 ఓవర్లలో 131 పరుగు లుగా సవరించారు. ఈ ఛేదనను ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులతో పూర్తి చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), ఫిలిప్ (37), రెన్షా (21 నాటౌట్) సత్తా చాటారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మార్ష్ నిలిచాడు.
మార్ష్ అజేయంగా..: ఓపెనర్ మిచెల్ మార్ష్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఓపెనర్ హెడ్ (8), షార్ట్ (8) పవర్‌ప్లేలోనే వెనుదిరిగినా.. మార్ష్, ఫిలిప్ భారీషాట్లతో భారత బౌలర్లపై ఆధిపత్యం చూపారు. సిరాజ్, అర్ష్‌దీప్, హర్షిత్ ఓవర్లలో మార్ష్ ఒక్కో సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్‌లో ఫిలిప్ వెనుదిరిగినా అప్పటికే మూడో వికెట్‌కు 55 రన్స్ జత చేరి మ్యాచ్ ఆసీస్ వైపు నిలిచింది. ఇక ఆ తర్వాత రెన్షా, మార్ష్ మరో వికెట్ కోల్పోకుండా ఆడి 29 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.

పేలవ ఆరంభం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను బౌన్సీ పిచ్‌పై పేసర్లు స్టార్క్, హాజెల్‌వుడ్, ఎలిస్ కొత్త బంతితో వణికించారు. ముఖ్యంగా రోహిత్, విరాట్ తమ ఆటతీరుతో ఉసూరుమనిపించారు. కెప్టెన్సీ కూడా లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడతాడనుకున్న హిట్‌మ్యాన్ ఇబ్బందిపడి చివరకు హాజెల్‌వుడ్ ఎక్స్‌ట్రా బౌన్స్‌కు పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆసీస్ గడ్డపై అద్భుతంగా ఆడే విరాట్ 8 బంతులాడినా ఖాతా కూడా తెరువలేదు. కవర్‌డ్రైవ్ ఆడే ప్రయత్నంలో కూపర్ అద్భుత క్యాచ్‌కు దొరికిపోయాడు. అంతలోనే చక్కగా కుదురుకున్న గిల్ (10)ను ఎలిస్ అవుట్ చేయడంతో 25/3 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. అటు 9-17 ఓవర్ల మధ్య ఏకంగా నాలుగు సార్లు వర్షంతో ఆటంకం కలిగింది. దీంతో మ్యాచ్‌ను పలు దఫాలుగా 49, 35, 32 చివరగా 26 ఓవర్లుగా కుదించాల్సి వచ్చింది. శ్రేయాస్ (11) కూడా నిరాశపర్చిన వేళ.. అక్షర్, రాహుల్ జోడీ మాత్రం ఆదుకునే ప్రయత్నం చేసింది. వరుస బౌండరీలతో స్కోరును పెంచుతూ ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. 20వ ఓవర్‌లో అక్షర్‌ను కునేమన్ అవుట్ చేయగా.. తర్వాతి ఓవర్‌లోనే రాహుల్ రెండు వరుస సిక్సర్లతో 17 రన్స్ రాబట్టాడు. సుందర్ (10)తో కలిసి తను ఆరో వికెట్‌కు 31 రన్స్ రాబట్టాడు. అయితే సుందర్, రాహుల్, హర్షిత్ (1), అర్ష్‌దీప్ (0) 12 బంతుల వ్యవధిలోనే వెనుదిరగ్గా ఆఖరి ఓవర్‌లో నితీశ్ రెండు సిక్సర్లతో స్కోరును 130 దాటించాడు.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) రెన్షా (బి) హాజెల్‌వుడ్ 8, గిల్ (సి) ఫిలిప్ (బి) ఎలిస్ 10, విరాట్ (సి) కూపర్ (బి) స్టార్క్ 0, శ్రేయాస్ (సి) ఫిలిప్ (బి) హాజెల్‌వుడ్ 11, అక్షర్ (సి) రెన్షా (బి) కునేమన్ 31, రాహుల్ (సి) రెన్షా (బి) ఓవెన్ 38, సుందర్ (బి) కునేమన్ 10, నితీశ్ (నాటౌట్) 19, హర్షిత్ (సి) ఫిలిప్ (బి) ఓవెన్ 1, అర్ష్‌దీప్ (రనౌట్) 0, సిరాజ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 26 ఓవర్లలో 136/9. వికెట్ల పతనం: 1-13, 2-21, 3-25, 4-45, 5-84, 6-115, 7-121, 8-123, 9-124; బౌలింగ్: స్టార్క్ 6-1-22-1, హాజెల్‌వుడ్ 7-2-20-2, ఎలిస్ 5-1-29-1, ఓవెన్ 3-0-20-2, కునేమన్ 4-0-26-2, షార్ట్ 1-0-17-0.
ఆస్ర్టేలియా: మార్ష్ (నాటౌట్) 46, హెడ్ (సి) హర్షిత్ (బి) అర్ష్‌దీప్ 8, షార్ట్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8, ఫిలిప్ (సి) అర్ష్‌దీప్ (బి) సుందర్ 37, రెన్షా (నాటౌట్) 21, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 21.1 ఓవర్లలో 131/3. వికెట్ల పతనం: 1-10, 2-44, 3-99; బౌలింగ్: సిరాజ్ 4-1-21-0, అర్ష్‌దీప్ 5-0-31-1, హర్షిత్ 4-0-27-0, అక్షర్ 4-0-19-1, నితీశ్ 2.1-0-16-0, సుందర్ 2-0-14-1.
1
ఆసీస్ గడ్డపై 30 వన్డేలు ఆడిన విరాట్ డకౌట్ కావడం ఇదే తొలిసారి.
2
మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను ఓడిన రెండో భారత సారథిగా గిల్. కోహ్లీ ముందున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News