Share News

Arjun Tendulkar Engagement: అర్జున్ నిశ్చితార్థంపై అభిమాని ప్రశ్న.. స్పందించిన సచిన్

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:09 PM

తన తనయుడు అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని సచిన్ టెండుల్కర్ తాజాగా ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ సందర్భంగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని అన్నారు.

Arjun Tendulkar Engagement: అర్జున్ నిశ్చితార్థంపై అభిమాని ప్రశ్న.. స్పందించిన సచిన్
Arjun Tendulkar engagement

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిందన్న వార్త ప్రస్తుతం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఓ ముంబై వ్యాపారవేత్త మనుమరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగిందని మీడియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే, అంశంపై సచిన్ కుటుంబం, సానియా కుటుంబం ఇంతవరకూ స్పందించలేదు. ఇది అభిమానుల్లో ఉత్కంఠకు దారితీసింది. అయితే, ఈ విషయమై సచిన్ టెండుల్కర్ తొలిసారిగా స్పందించారు.

సచిన్ టెండుల్కర్ ఇటీవల సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించారు. అభిమానుల ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ప్రస్తావన తెచ్చారు. అతడికి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం నిజమేనా అని సచిన్‌ను ప్రశ్నించాడు. దీనికి ఆయన అవునని సమాధానం ఇచ్చారు. ‘అవును.. ఎంగేజ్‌మెంట్ జరిగింది. అతడి జీవితంలో ఓ కొత్త అధ్యాయం ఆరంభమైంది. ఇది మాకెంతో ఆనందం కలిగించే అంశం’ అని రిప్లై ఇచ్చారు. తనయుడిపై సచిన్ తొలిసారి స్పందించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.


ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్. సానియా కుటుంబం.. హాస్పిటాలిటీ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ప్రముఖ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వారివే. ఇక అర్జున్, సానియాల ఎంగేజ్‌మెంట్ వేడుక అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది.

అర్జున్ ప్రస్తుతం క్రికెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్‌కు బ్యాటింగ్‌పైనా పట్టు ఉంది. గోవా తరపున దేశవాళీ క్రికెట్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టి 532 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టి 119 పరుగులు చేశాడు. 18 లిస్ట్ ఏ మ్యాచుల్లో కూడా ఆడి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 2023 ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేశాడు. నాలుగు మ్యాచులు ఆడి మూడు వికెట్లు తీశాడు. ఆ తదుపరి సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.


ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 02:32 PM