Share News

US Open 2025: అల్కారజ్‌ అలవోకగా

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:11 AM

అమెరికాకు చెందిన తెలుగు సంతతి ఆటగాడు నిశేష్‌ బసవా రెడ్డి తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. 9వ సీడ్‌ ఖచనోవ్‌తో జరిగిన పోరులో తొలి సెట్‌ గెలిచిన బసవా రెడ్డి 7-6 (5), 3-6, 5-7, 1-6తో ఓడాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు...

US Open 2025: అల్కారజ్‌ అలవోకగా

యూఎస్‌ ఓపెన్‌

  • రెండో రౌండ్‌కు స్వియటెక్‌, రూడ్‌

  • కీస్‌, స్విటోలినా, వీనస్‌ ఇంటిబాట

  • రెండో రౌండ్‌కు స్వియటెక్‌, రూడ్‌

  • కీస్‌, స్విటోలినా, వీనస్‌ ఇంటిబాట

పోరాడి ఓడిన బసవా రెడ్డి

అమెరికాకు చెందిన తెలుగు సంతతి ఆటగాడు నిశేష్‌ బసవా రెడ్డి తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. 9వ సీడ్‌ ఖచనోవ్‌తో జరిగిన పోరులో తొలి సెట్‌ గెలిచిన బసవా రెడ్డి 7-6 (5), 3-6, 5-7, 1-6తో ఓడాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బసవా రెడ్డి కుటుంబం అమెరికాలో స్థిరపడింది.

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో రెండో రోజు పురుషుల సింగిల్స్‌ బరిలోకి దిగిన స్పెయిన్‌ సంచలనం కార్లోస్‌ అల్కారజ్‌తో పాటు కాస్పర్‌ రూడ్‌, ఖచనోవ్‌, అండ్రీ రుబ్లెవ్‌, హోల్గర్‌ రూన్‌, ఫ్రాన్సెస్‌ టియాఫోలాంటి సీడెడ్‌లంతా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల్లో మాత్రం ఆరో సీడ్‌ మాడిసన్‌ కీస్‌, ఉక్రెయిన్‌ స్టార్‌ స్విటోలినా, వెటరన్‌ ఏస్‌ వీనస్‌ విలియమ్స్‌ ఆరంభంలోనే ఇంటిబాట పట్టారు. స్థానిక ఆటగాడు రిలీ ఓపెల్కాతో జరిగిన పోరును మాజీ చాంపియన్‌ అల్కారజ్‌ 6-4, 7-5, 6-4తో వరుససెట్లలో ముగించాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను మూడేళ్ల క్రితం (2022) ఇక్కడే నెగ్గిన 22 ఏళ్ల అల్కారజ్‌.. గ్రాండ్‌స్లామ్స్‌లో తొలి రౌండ్‌ విజయాల రికార్డును 19-0తో మరింత పదిలం చేసుకున్నాడు. 11వ సీడ్‌ రూన్‌ 6-3, 7-6 (4), 7-6 (2)తో బొటిక్‌ వాన్‌పై, 12వ సీడ్‌ రూడ్‌ 6-1, 6-2, 7-6 (5)తో సెబాస్టియన్‌పై, 15వ సీడ్‌ రుబ్లెవ్‌ 6-4, 6-4, 6-4తో ప్రిజ్‌మిక్‌పై, 17వ సీడ్‌ టియాఫో 6-3, 7-6 (6), 6-3తో నిషిఒకపై గెలిచారు.


కీస్‌.. 89 తప్పిదాలు: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న అమెరికా స్టార్‌ క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌కు సొంతగడ్డపై మాత్రం చుక్కెదురైంది. మెక్సికోకు చెందిన 82వ ర్యాంకర్‌ రెనటా జరజువా 6-7 (12), 7-6 (3), 7-5తో కీస్‌ను కంగుతినిపించి రెండో రౌండ్‌ చేరింది. 3 గంటలా పది నిమిషాల హోరాహోరీ పోరులో కీస్‌.. ఏకంగా 89 అనవసర తప్పిదాలు, 14 డబుల్‌ ఫాల్ట్స్‌ చేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది. గతంలో ఇక్కడ రెండుసార్లు విజేతగా నిలిచిన 45 ఏళ్ల వీనస్‌ను 11వ సీడ్‌ ముచోవా 6-3, 2-6, 6-1తో ఓడించింది. 12వ సీడ్‌ స్విటోలినా 2-6, 4-6తో అన్నా బొండర్‌ చేతిలో చిత్తయింది. రెండో సీడ్‌ స్వియటెక్‌ 6-1, 6-2తో ఎమిలియానో అరంగాను, ఐదో సీడ్‌ మిర్రా అండ్రీవ 6-0, 6-1తో అలిసియాను, 15వ సీడ్‌ కసత్కినా 7-5, 6-1తో ఎలెనాను, సక్కారి 6-3, 6-2తో మరియాను ఓడించి రెండో రౌండ్లో ప్రవేశించారు.

వావ్‌.. వాంగ్‌: హాంకాంగ్‌కు చెందిన 21 ఏళ్ల కోల్‌మన్‌ వాంగ్‌ 6-4, 7-5, 7-6 (4)తో అలెగ్జాండర్‌ను ఓడించి రెండో రౌండ్‌ చేరాడు. ఈ క్రమంలో ఓపెన్‌ ఎరా (1968 నుంచి)లో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ నెగ్గిన తొలి హాంకాంగ్‌ ఆటగాడిగా వాంగ్‌ చరిత్ర సృష్టించాడు.


స్టయిల్‌ అదిరింది

కార్లోస్‌ అల్కారజ్‌ ఈ గ్రాండ్‌స్లామ్‌కు విభిన్నమైన గెటప్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎప్పటిలా సాధారణ హెయిర్‌ కట్‌లో గాకుండా ఈసారి గుండు చేయించుకున్నాడు. గతానికి కాస్త భిన్నంగా స్లీవ్‌లెస్‌ టీ షర్ట్‌ ధరించిన అతను.. పూర్తిగా హెయిర్‌ కట్‌ చేయించుకొని తొలి రౌండ్‌ మ్యాచ్‌లో పోటీపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం తన కొత్త హెయిర్‌ స్టయిల్‌పై అల్కారజ్‌ మాట్లాడుతూ.. ‘నా సోదరుడు తన బార్బర్‌ నైపుణ్యాలను చూపించాడు. టోర్నీ ఆరంభానికి ముందు మెషీన్‌తో నా హెయిర్‌ కట్‌ను సరిచేసే క్రమంలో ఇలాగైంది. ఇది చాలామందికి నచ్చిందనే అనుకుంటున్నా. ఏమంటారు.. మీరంతా?’ అని ప్రేక్షకులను అడిగాడు. వారంతా.. సూపర్బ్‌ అని గట్టిగా అరవడంతో.. ‘ఇది బాగుందని మీరు అంగీకరిస్తున్నారు’ అని అల్కారజ్‌ గట్టిగా నవ్వాడు. అయితే, సహచర ఆటగాడు ఫ్రాన్సెస్‌ టియాఫో మాత్రం.. ‘వామ్మో.. భయంకరంగా ఉంది. అయినా, ఇదో రకం స్టయిల్‌ అనుకోవడమే’ అని అనడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 06:11 AM