Afghan Cricket Board: పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్ల మృతి.. అప్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:11 AM
పాక్ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు మరణించడంతో అప్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్, శ్రీలంకతో జరగాల్సిన ట్రైసిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు అప్ఘాన్ క్రికెటర్లు దుర్మరణం చెందడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనను అప్ఘాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తీవ్రంగా ఖండించింది. త్వరలో శ్రీలంక, పాక్‌తో జరగాల్సిన త్రైపాక్షిక టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది (Afghan Cricketers Killed in Pak Air Strikes).
పట్కాయ్ ప్రావిన్స్‌లో పాక్ దళాలు ఈ దాడులు చేశాయి. ఈ దాడిలో ఉంగూర్ జిల్లాకు చెందిన దేశవాళీ క్రికెట్ ప్లేయర్స్ కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఏసీబీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడులు పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ ఘటనపై అప్ఘాన్ టీమ్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా స్పందించాడు. త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి మద్దతు తెలిపాడు. వైమానిక దాడులు ఆటవికచర్య అని మండిపడ్డాడు. సామాన్య పౌరులను టార్గెట్ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు (Pak Air strikes in Patkai Province).
గత వారం రోజులుగా అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు వెంబడి పలుమార్లు ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరు వైపులా పదుల సంఖ్యలో జనాలు మరణించారు. ఇటీవల 48 గంటల పాటు ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటించాయి. అయితే, పట్కాయ్ ప్రావిన్స్‌లో పాక్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది.
సరిహద్దు వెంబడి అర్గున్, బెర్మల్ జిల్లాలో నివాస ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. దోహాలో ఇరు దేశాలు చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడంతో అప్ఘానిస్థాన్ మండిపడింది. శాంతి ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది (Afghan-Pak Clashes).
ఈ ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. అప్ఘాన్, పాక్ వివాదాన్ని పరిష్కరించడం సులువేనని అన్నారు. పాక్ దాడి చేసినట్టు కూడా తనకు తెలిసిందని చెప్పారు. ఇప్పటికే తాను ఎనిమిది యుద్ధాలను ఆపేసినా రావాల్సిన క్రెడిట్ మాత్రం రాలేదని మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఇవి కూడా చదవండి
పీసీబీ చీఫ్ కుతంత్రాలు.. ఇప్పటికీ టీమిండియా చేతికి దక్కని ఆసియా కప్ ట్రోఫీ
ఇలా అనడం సిగ్గు చేటు.. మాజీ క్రికెటర్‌పై మండిపడ్డ గౌతమ్ గంభీర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి