హక్కుల కోసం ఆటతోనే ధిక్కారం!
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:07 AM
అఫ్ఘానిస్థాన్ క్రికెట్‌లో చారిత్రక ఘట్టం చోటు చేసుకోనుంది. మహిళల హక్కులను కాలరాస్తున్న తాలిబన్ల ఛాందస భావాలను నిగ్గదీసే ఉద్యమం అంతర్జాతీయ వేదికగా ఉవ్వెత్తున...

బరిలోకి అఫ్ఘాన్ మహిళా క్రికెట్ జట్టు
నేడు మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్
తాలిబన్లనే ఎదిరిస్తున్న ధీర వనితలు
మెల్‌బోర్న్: అఫ్ఘానిస్థాన్ క్రికెట్‌లో చారిత్రక ఘట్టం చోటు చేసుకోనుంది. మహిళల హక్కులను కాలరాస్తున్న తాలిబన్ల ఛాందస భావాలను నిగ్గదీసే ఉద్యమం అంతర్జాతీయ వేదికగా ఉవ్వెత్తున ఎగసిపడనుంది. స్వేచ్ఛ కోసం.. క్రికెట్‌పై ఉన్న ప్రేమ కోసం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దులు దాటిన అఫ్ఘాన్ మహిళలు దాదాపు మూడేళ్ల తర్వాత జట్టుగా బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం ‘వితౌట్ బోర్డర్స్ లెవెన్’తో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అఫ్ఘాన్ మహిళల జట్టు బరిలోకి దిగనుంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు. తమ హక్కులు.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అఫ్ఘాన్ మహిళలు చేస్తున్న పోరాటం. ఆడవాళ్లు బయటకు రాకుండా, చదువుకోకుండా అణచి వేస్తున్న తాలిబన్ పాలకులను నిలదీస్తున్న ధీర వనితల పోరాటం. ప్రాణాలు పోతాయనే హెచ్చరికలు వచ్చినా.. అఫ్ఘాన్‌మహిళా క్రికెటర్లు అదరలేదు.. బెదరలేదు. కోటి ఆశలతో కొంగొత్త జీవితాన్ని కోరుకొంటున్న ఈ అమ్మాయిలు.. అగచాట్లు అనుభవిస్తున్న సదరు అఫ్ఘాన్ మహిళలకు గొంతుక కావాలనుకొన్నారు.
వీరందరికీ ఆదర్శం, మార్గదర్శి ఫిరోజా అమీరి. ఆశ్రయం కోసం పలుదేశాలను అభ్యర్థించిన అమీరికి ఆస్ట్రేలియా సాయం చేసింది. అయితే, తనతోపాటు తన టీమ్ కూడా రావాలని ఆమె చేసిన పోరాటం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. 2021లో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు 21 మందికి కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. అయితే, పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో వారందరూ చెల్లాచెదురయ్యారు. అమీరి వారిని సంఘటితం చేసి ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందేలా చేసింది. ఇప్పటి వరకూ వివిధ క్లబ్‌లకు ఆడుతూ ఉన్న వీరు.. మూడేళ్ల తర్వాత అఫ్ఘాన్ మహిళల క్రికెట్ జట్టుగా బరిలోకి దిగనున్నారు. ‘మాకందరికీ ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశాన్ని వీడాం. మళ్లీ ఇప్పుడు అందరం ఒక్కటయ్యాం’ అని అమీరి భావోద్వేగంతో చెప్పింది. అఫ్ఘాన్ మహిళల విద్య, క్రీడలు, భవిష్యత్తుకు ఈ మ్యాచ్ దారులు తెరుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య
టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య
ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి