Why Ants Move In A Line?: చీమలు అలా ఒకే వరుసలో వెళ్తుంటాయ్.. ఎందుకు.?
ABN , Publish Date - Nov 19 , 2025 | 07:54 PM
ఎక్కడ చూసినా చీమలు ఒకే వరుసలో ముందుకు వెళ్తూ ఉంటాయి. అవి అలా ప్రయాణించడానికి కారణమేంటో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇదిగో ఈ కథనం చదవండి.. దాని వెనకాల ఉన్న రహస్యాన్ని తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: చీమలంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని వింటుంటాం. వాటిని ప్రేరణగా తీసుకుని అలా వరుసగా ముందుకెళ్లాలని చాలా సందర్భాల్లో మనకు అలాంటి మాటలూ వినిపిస్తుంటాయ్. చీమలా.. అలుపెరగని జీవిగా శ్రమించాలని ఎందరో మహానుభావులు ఉద్భోదిస్తూనే ఉంటారు. మరి ఆ చీమలు అలా ఒకే వరుసలో ముందుకు కదలడానికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్కౌట్‌ను అనుసరిస్తూ..
క్రమశిక్షణకు మారుపేరైన చీమలు.. ఫెరోమోన్లు అనే రసాయన సంకేతాలను అనుసరిస్తాయి. అందువల్లే అవి వరుసలో కదులుతుంటాయని నిపుణులు వివరిస్తున్నారు. చీమల దండులో.. ఒకటి ఆహారాన్ని పసిగట్టినప్పుడు అది స్కౌట్‌గా వ్యవహరిస్తుంది. ఆ స్కౌట్ చీమ తిరిగొచ్చే క్రమంలో దారి పొడవునా ఫెరోమోన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. దానిని బాటగా అనుసరించి మిగతా చీమలు ముందుకు కదులుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పద్ధతి ఆహారాన్ని వెతకడం కోసమే కాకుండా.. వాటి సైన్యానికి ఆపద తలెత్తిన సందర్భంలోనూ.. మరో మంచి ప్రదేశాన్ని వెతికే క్రమంలో ఈ మార్గాన్ని ఏర్పాటుచేసుకుని ముందుకు సాగుతుంటాయి.
స్కౌట్ చీమతో పాటు.. ఆ మార్గంలో ప్రయాణించే మరిన్ని చీమలు కూడా ఫెరోమోన్‌ను విడుదల చేస్తూ వాటి సైన్యం అనుసరించేందుకు మార్గం సుగమం చేస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ఫెరోమోన్ వాసన ఎంత గాఢంగా ఉంటే.. మిగతా చీమలు వాటికి అంతగా ఆకర్షితమవుతాయి. అలా చీమల దండు దారి తప్పకుండా, సమయం వృథా కాకుండా ఆహార వనరులను చేరుకునేందుకు ఈ రసాయనం తోడ్పడుతుంది. అవి ఒకే లైన్లో కదలడం వల్ల.. శక్తిని ఆదా చేస్కోవడం సహా సమర్థవంతగా పనిచేస్తాయి. ఇలా ఒకే మార్గంలో ప్రయాణించడం ద్వారా అవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి పనులను ముగించుకుని తిరిగి వచ్చేందుకూ వీలు కల్పిస్తుంది.
సంభాషణకు సహకారంగా..
చీమలు అనుసరించే ఈ మార్గం.. అవి మాట్లాడకుండా, ఎలాంటి శబ్దాలు, సైగలు వంటివి చేస్కోకుండా వాటి సంభాషణకు సహకరిస్తుందని శాస్త్రవేత్తలు అన్నారు. మానవులు ఎలాగైతే మ్యాప్‌లు, నావిగేషన్ వంటి యాప్‌లను ఉపయోగిస్తారో.. చీమల దండు కూడా వాటి మధ్య సమన్వయం కోసం ఈ సంకేతాలపై ఆధారపడతాయని చెప్పారు. అయితే చీమలు ఇలాంటి సందర్భాల్లో యాదృచ్ఛిక మార్గాలే ఎంచుకుంటాయని పరిశోధకులు తెలిపారు. సురక్షితమైన, చిన్న చిన్న మార్గాలలో ప్రయాణించి వాటిని ఫెరోమోన్‌లతో బలోపేతం చేస్తూ.. వాటి సైన్యం దాన్ని అనుసరించేందుకు మార్గం సుగమం చేస్తాయి. వీటి సహకారం, వనరుల సేకరణను చూస్తే.. భూమిపై అత్యంత విజయవంతమైన జాతులలో ఒకటిగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.
ఆటంకం ఎదురైనప్పుడు..
మూకుమ్మడిగా ఇలా ఒకేదారిన పయనించే చీమలను చూసి వాటిని వేటాడేందుకు ప్రయత్నించే జంతువులు కూడా భయపడతాయి. ఇవన్నీ గుంపుగా కదలడం చూసి.. వాటన్నింటినీ ఒక పెద్ద కీటకంగా భావించి దూరంగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. చీమల దారి వ్యవస్థ దాదాపు ఒక మానవ ట్రాఫిక్ నెట్‌వర్క్‌లా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇలా ఇవి వెళ్లే మార్గంలో ఏవైనా ఆటంకాలొస్తే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాయని తెలిపారు. కొత్త మార్గం దొరికిన తర్వాత.. అవి దానిని ఫెరోమోన్‌లతో గుర్తించి తక్కువ కాలవ్యవధిలో సర్దుబాటు చేసుకుంటాయట. ఇలా.. చీమల దండు నుంచి మానవులు ఎంతో నేర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
ఇవీ చదవండి: