Share News

Clash Over Chicken Fry: చికెన్ ఫ్రై కోసం గొడవ.. రణరంగంలా మారిన పెళ్లి మండపం..

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:19 PM

చికెన్ ఫ్రై విషయంలో పెళ్లి మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆపితే గానీ, గొడవ ఆగలేదు.

Clash Over Chicken Fry: చికెన్ ఫ్రై కోసం గొడవ.. రణరంగంలా మారిన పెళ్లి మండపం..
Clash Over Chicken Fry

పెళ్లి మండపంలో చికెన్ ఫ్రై చిచ్చు పెట్టింది. భోజనాల సందర్భంగా చికెన్ ఫ్రై కోసం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి మండపం కాస్తా రణ భూమిలా మారిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిజ్‌నోర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు మొదలయ్యాయి.


భోజనాల దగ్గర చికెన్ ఫ్రై విషయంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వాళ్లకు గొడవ మొదలైంది. పెళ్లి కూతురు తరఫు వారు కావాలనే తక్కువ మొత్తంలో చికెన్ ఫ్రై వేస్తున్నారని పెళ్లి కొడుకు తరఫు వారు గొడవకు దిగారు. దీంతో పెళ్లి కూతురు తరఫు వారు ఎక్కువ మొత్తంలో చికెన్ ఫ్రై తెప్పించారు. పెళ్లి కొడుకు తరఫు వారికి ఒడ్డించారు. అయినా కూడా పెళ్లి కొడుకు బంధువులు సంతృప్తి చెందలేదు. ‘చికెన్ ఫ్రై మర్యాదపూర్వకంగా వడ్డించటం లేదు’ అంటూ మళ్లీ గొడవకు దిగారు.


ఈ సారి పెళ్లి కూతురు తరఫు వాళ్లు వెనక్కు తగ్గలేదు. మాటకు మాట సమాధానం ఇచ్చారు. దీంతో గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపారు. అప్పటికే కొంతమంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ గుండె జబ్బు ఉన్న వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

అమెరికా రోడ్లపై స్త్రీ .. వైరల్‌గా మారిన వీడియో..

మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన ట్రక్ డ్రైవర్.. 10 మంది మృతి..

Updated Date - Nov 03 , 2025 | 05:25 PM