నీటిని విరజిమ్మే వంతెన
ABN , Publish Date - Feb 09 , 2025 | 01:16 PM
సాయంత్రం అయితే చాలు సందర్శకులతో ఆ నదీ తీరం సంద్రంగా మారుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ నదిపైనున్న రంగురంగుల ఫౌంటెన్ బ్రిడ్జి అందాలను చూస్తూ మైమరిచిపోతారు. అతి పొడవైన ఫౌంటెన్ వంతెనగా ఇది ‘గిన్నిస్ రికార్డు’ల్లోకి కూడా ఎక్కింది.

సాయంత్రం అయితే చాలు సందర్శకులతో ఆ నదీ తీరం సంద్రంగా మారుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ నదిపైనున్న రంగురంగుల ఫౌంటెన్ బ్రిడ్జి అందాలను చూస్తూ మైమరిచిపోతారు. అతి పొడవైన ఫౌంటెన్ వంతెనగా ఇది ‘గిన్నిస్ రికార్డు’ల్లోకి కూడా ఎక్కింది.
ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన. మామూలుగా అయితే పాత వంతెన అని పట్టించుకోవడమే మానేస్తారు. కానీ దక్షిణ కొరియా అలాకాదు... పర్యాటకులను ఆకర్షించడానికి, సాయంత్రం వేళల్లో సందర్శకులు సేదతీరేందుకు ఆ వంతెనను ‘ఫౌంటెన్ బ్రిడ్జ్’గా మార్చింది. పాత వంతెనకే ఫౌంటెన్‌ను అమర్చడం ద్వారా ఆ ప్రాంత రూపురేఖలనే మార్చేసింది. రాత్రుళ్లు ఫౌంటెన్ అందాలతో, సందర్శకులతో ఆ ప్రాంతమంతా ఇప్పుడు సందడిగా ఉంటోంది. దక్షిణకొరియాలోని సియోల్ నగరంలో హ్యాంగన్ నదిపై ఒక పాత వంతెన ఉంది. దీన్ని ‘బాన్పో గ్రాండ్ బ్రిడ్జ్’ అని అంటారు. ఇప్పుడు స్థానికులు ‘మూన్‌లైట్ రెయిన్‌బో ఫౌంటెన్ బ్రిడ్జ్’ అని పిలుస్తున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఫౌంటెన్ వంతెనగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
ప్రపంచంలో ఇదొక్కటే...
సియోల్‌లో ఉన్న ముఖ్యమైన వంతెనలలో ఇదొకటి. ప్రతి రోజూ ఈ వంతెనపై నుంచి సుమారు లక్ష వాహనాలు వెళ్తుంటాయి. 1976లో ఈ వంతెనను నిర్మించారు. 2009లో వంతెనకు ఫౌంటెన్ అమర్చారు. ఒక కిలోమీటరు పొడవుండే ఈ డబల్ డెక్కర్ వంతెన అందాలు రాత్రిపూట చూసి తీరాల్సిందే. ఫౌంటెన్ కోసం కావాల్సిన నీరు నది నుంచి తీసుకుంటారు. ఆ నీటిని రీ సైకిల్ చేస్తారు. నిమిషానికి 60 టన్నుల నీరు ఫౌంటెన్‌లలో నుంచి నదిలోకి విరజిమ్ముతుంది. 43 మీటర్ల దూరం మేర ఫౌంటెన్ నుంచి నీరు విరజిమ్ముతుంది.
రాత్రుళ్లు రెయిన్‌బో ఎఫెక్ట్‌తో అలంరించేందుకు రంగురంగుల లైట్లు అమర్చారు. ఫౌంటెన్ నిర్మాణంలో దాదాపు 380 లెడ్ నాజిల్స్ ఉపయోగించారు. దీంతో ఈ ఫౌంటెన్ బ్రిడ్జ్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రాత్రుళ్లు మ్యూజిక్‌కు అనుగుణంగా నీరు విరజిమ్మే దృశ్యం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇలాంటి వంతెన ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే సందర్శకులు ఫౌంటెన్ బ్రిడ్జ్ అందాలు చూసేందుకు పోటెత్తుతుంటారు.