Share News

జీఐ మిర్చి.. యమా హాట్‌ గురూ

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:26 AM

నిగనిగలాడే ఎరుపు రంగు, ఆకట్టుకునే రూపం.. కాస్త దూరం నుంచి చూస్తే టమాటా కాబోలు అనుకుంటాం. చపాటా మిర్చికి ఎంతో ప్రత్యేకత ఉంది. వరంగల్‌ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన చపాటా ఇటీవల జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ను సాధించి వార్తల్లోకెక్కింది.

జీఐ మిర్చి.. యమా హాట్‌ గురూ

మీకు ఎన్నిరకాల మిర్చీ తెలుసు? సన్న మిరప, దొడ్డు మిరప... అంటారా? ప్రపంచవ్యాప్తంగా అనేక మిరప జాతులున్నాయి. మనదేశంలోనే లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే వాటిలో ఆయా ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని విశేష మిరప జాతులున్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం ‘జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగులను ఇస్తుంది. తాజాగా వరంగల్‌కు చెందిన ‘చపాటా’ మిర్చి ఈ లిస్టులోకి చేరింది. అలాంటి ‘జీఐ’ ట్యాగులు పొందిన ప్రసిద్ధ మిర్చి రకాల విశేషాలివి...

టమాటా కాదు చపాటా

నిగనిగలాడే ఎరుపు రంగు, ఆకట్టుకునే రూపం.. కాస్త దూరం నుంచి చూస్తే టమాటా కాబోలు అనుకుంటాం. చపాటా మిర్చికి ఎంతో ప్రత్యేకత ఉంది. వరంగల్‌ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన చపాటా ఇటీవల జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ను సాధించి వార్తల్లోకెక్కింది. చిక్కని ఎరుపు రంగు వల్ల ‘టమాటా మిర్చి’ అని కూడా పిలుస్తారు. ఈ మిర్చి రకాన్ని బట్టి సింగిల్‌ పత్తి, డబుల్‌ పత్తి, ఓదలు అనే మూడు రకాలుగా విభజించారు. మెక్సికన్‌ క్యాప్సికమ్‌ను పోలి ఉండే ఈ మిరప రంగును చూసి కారంగా, అంతే ఘాటుగా ఉంటుందనుకుంటే పొరపడినట్టే. కారం తక్కువ కాబట్టి రెస్టారెంట్లు, ఊరగాయలు, బేవరేజెస్‌ పరిశ్రమల్లో ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. తూర్పుఆసియా దేశాలలో చపాటా మిర్చికి డిమాండ్‌ ఎక్కువ.


నెంబర్‌వన్‌

సాధారణంగా లేత ఆకుపచ్చ మిర్చిలో కారం తక్కువగా ఉంటుంది. అదే ముదురు రంగు వాటిని నోటితో తాకితే చాలు కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయి. కారం, ఘాటు మిర్చి సొంతం. మిరపకాయల్లో కారాన్ని ‘స్కోవిల్లే హీట్‌ యూనిట్స్‌ (ఎస్‌హెచ్‌యు)’గా కొలుస్తారు. అసోమ్‌లో కనిపించే ‘భూత్‌ జొలోకియా’ మిర్చిలో కారం ఏకంగా పది లక్షల ఎస్‌హెచ్‌ యూనిట్లకు పైగా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిర్చిగా భూత్‌ జొలోకియా... 2007లోనే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకు ఎక్కింది (కాలక్రమంలో మూడో స్థానంలోకి వచ్చింది). వాస్తవానికి ఇది హైబ్రీడ్‌ కూరగాయ. చైనీస్‌ క్యాప్సికమ్‌, అడవి మిర్చిలను కలిపి ఈ వంగడాన్ని సృష్టించారు. అసోమ్‌లోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలంతా ఎండు చేపలు, మాంసాన్ని ఊరబెట్టే వంటకాల్లో ఈ మిర్చిని వాడతారు. దీని అసలు పేరు భూటానీస్‌ జొలోకియా. కానీ భూత్‌ (దయ్యం) పేరే స్థిరపడింది. కొన్ని ప్రాంతాల్లో రాజా మిర్చి, నాగా మిర్చి అనీ అంటారు. ఇది 2008లో జీఐ ట్యాగ్‌ను పొందింది.


చిక్కని రంగు

మిరపకి ఘనకీర్తిని తెచ్చే వాటిలో కారం, ఘాటుతో పాటు రంగు కూడా ఒకటి. మిర్చిని చేర్చడం వల్ల వంటకాలకు చక్కని రంగు, రుచి వస్తుంది. కర్ణాటకలో పండించే ‘బ్యాడగి’ మిర్చి చిక్కని ఎరుపు రంగు కారణంగా దేశమంతా ప్రసిద్ధి చెందింది. అక్కడి హావేరి జిల్లాలోని బ్యాడగీలో ఈ పంటను పండిస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. వాణిజ్యపరంగా కూడా బ్యాడగి మిర్చీ మార్కెట్లో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మిరప నుంచి తీసిన నూనెని నెయిల్‌ పాలిష్‌, లిప్‌స్టిక్‌లలో కూడా వినియోగించడం విశేషం. ఇందులో డబ్బి, కడ్డి అని రెండు రకాలున్నాయి. రంగు, రుచి, వాసన కోసం డబ్బి రకాన్ని, మసాలా తయారీ, కాస్మొటిక్స్‌లో కడ్డి రకాన్ని వినియోగిస్తారు. 2011లోనే ఈ మిరప జీఐ ట్యాగ్‌ను అందుకుంది.

book3.jpg


ఒరుగుల కోసం...

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’గా పేరుతెచ్చుకున్న కేరళకే ప్రత్యేకమైన మిరప ‘ఇదయూర్‌’. అక్కడి మలప్పురం జిల్లాలో ఈ రకం మిరపను ఎక్కువగా పండిస్తున్నారు. కేరళీయులు ఈ పంటను గత 150 ఏళ్లుగా సాగుచేస్తున్నారని స్థానిక రికార్డులు తెలియజేస్తున్నాయి. ఓ మోస్తరు కండతో పొడుగ్గా ఉండే ఇదయూర్‌ మిర్చి ఉప్పొరుగుకు (ఉప్పుతో ఒరుగులు) చాలా ఫేమస్‌. 2021లో జీఐ ట్యాగ్‌ను పొందింది. ఇందులో ఘాటు ఎక్కువ.


మిర్చి మామ

సిక్కిం చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే మిర్చి ‘దాల్లే ఖోర్సాని’. కారం, ఘాటులో భూత్‌ జొలోకియాతో పోటీపడుతుంది. చిక్కని ఎరుపు రంగుతో నిగనిగలాడుతుంది ఈ పండు మిర్చి. నేపాల్‌, భూటాన్‌లలో ఈ మిరపను ‘జాన్‌మారా ఖుర్‌సానీ’ అని పిలుస్తారు. అంటే ప్రాణం తీసే చిల్లి అని అర్థం. స్థానిక సిక్కిం భాషలో ‘మిర్చి మామ’ అంటారు. వివిధ రకాల వంటలతో పాటు పచ్చళ్లు, సాస్‌ల తయారీలో ఈ మిర్చిని వాడుతున్నారు. 2020లో దాల్లే జీఐ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది.

book3.3.jpg


దేవుడి బహుమతి

మణిపూర్‌లోని సిరారఖాంగ్‌ గ్రామంలో మాత్రమే పండే మిర్చి ‘హతేయి’. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో ఈ మిర్చిని పండిస్తారు. అందుకే ‘ఆర్గానిక్‌ కింగ్‌ ఛిల్లీస్‌’ అంటారు. తమ గ్రామంలో ప్రత్యేకంగా పండే ఈ మిరపకాయను ‘దేవుడి బహుమతి’గా కీర్తిస్తూ ఏటా మూడు రోజుల పాటు ‘హతేయి ఫనిత్‌’ పేరున పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. 2021లో హతేయి జీఐ ట్యాగును సాధించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2025 | 08:26 AM