UP Cops Assaulted By Women: ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. అడ్డుకున్న మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే..
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:54 PM
పోలీసులను మహిళలు పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. వారి పట్టు నుంచి విడిపించుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగైతేనేం చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఓ నిందితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు కనిపించాయి. నిందితుడి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులపై అతని కుటుంబసభ్యులు దాడి చేశారు. గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి కదల నివ్వలేదు. పోలీసుల చొక్కాలు చినిగిపోతున్నా వదల్లేదు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హపుర్‌కు చెందిన అసిఫ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో తుపాకులను వాడుతూ వీడియోలు పెట్టాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లాయి. ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ కింద అతడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానిక పోలీసులను ఆదేశించారు. స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రి అసిఫ్ ఇంటికి వెళ్లారు. పోలీసులు ఇంట్లోకి రావడాన్ని అసిఫ్ కుటుంబసభ్యులు ఒప్పుకోకపోగా.. వారిని అడ్డుకున్నారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. కుటుంబసభ్యుల్ని తోసుకుంటూ అసిఫ్ ఉన్న గది దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే అసిఫ్ కుటుంబసభ్యులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
మహిళలు పోలీసులను పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. వారి పట్టు నుంచి విడిపించుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగైతేనేం చివరికి అసిఫ్‌ను అరెస్ట్ చేశారు. తమపై దాడికి దిగిన ఆరుగురు కుటుంబసభ్యులపైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పోలీసులను ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఊరికే వదలకూడదు, కఠినంగా శిక్షించాలి’ అని కొందరూ.. ‘ఉత్తర ప్రదేశ్‌లో ఇలానే ఉంటుంది’ అని మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పాక్ ప్రధానికి ఊహించని షాక్.. పీఓకేలో తిరగబడ్డ ప్రజలు..
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్