ఇవి కూడా గ్రంథాలయాలే..
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:27 AM
తెల్లవారుతుండగానే ఓ గుర్రం పుస్తకాలు మోసుకుంటూ ఊళ్లోకి వచ్చేస్తుంది... కాలిబాట కూడా సరిగా లేని గ్రామాల్లోకి గాడిదలు పుస్తకాల బరువులతో వచ్చేస్తాయి... ఎడారి ప్రాంతాల్లో పిల్లల కోసం పుస్తకాల ఒంటె బండి (క్యామెల్ కార్ట్) సిద్ధంగా ఉంటుంది... ఇలాంటి విశేషమైన విచిత్ర గ్రంథాలయాలు కూడా ఉన్నాయంటే... కూసింత ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని మొబైల్ లైబ్రరీల విశేషాలే ఓ కథనం..
ఇప్పుడంతా స్మార్ట్‌యుగం. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదంటే ల్యాపీ. ఇంట్లో స్మార్ట్‌టీవీ. సెలవు దొరికితే చాలు వాటితోనే టైంపాస్. కానీ ఒకప్పుడు కాస్త సమయం చిక్కితే గ్రంథాలయంలో కూర్చుని గంటలు గంటలు పుస్తకాలు చదివేవాళ్లు. ఆ అలవాటు పిల్లలకు, పెద్దలకు ఎంతగానో ఉపయోగపడింది. సృజనాత్మకతను పెంచుకునేందుకు పుస్తక పఠనాన్ని మించింది లేదు. అయితే ఇప్పుడు లైబ్రరీలో అడుగుపెట్టే వారే కరువయ్యారు. లైబ్రరీలు లేని గ్రామాల్లో పిల్లలు పుస్తకాలకు దూరమవుతున్నారు. గ్రంథాలయాలు పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడతాయి.
గూగుల్, యూట్యూబ్‌లలో అన్ని విషయాలు అందుబాటులో ఉన్నా అవి పుస్తకాలను చేతుల్లోకి తీసుకురాలేవు. ఒక పుస్తకం చదివినప్పుడు కలిగే అనుభూతి మరే రకంగానూ లభించదు. రోజూ పుస్తకం చదివితే బోలెడు ప్రపంచజ్ఞానం లభిస్తుంది. అందుకే ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో గ్రంథాలయాలు లేవు. మరి పుస్తకాలు వారికి చేరువయ్యేదెలా? అంటే ‘ఇదిగో మేమున్నాం’ అంటూ కొంతమంది కదిలే లైబ్రరీలతో పుస్తక యజ్ఞం చేస్తున్నారు. ఊరూర తిరుగుతూ పిల్లల్లో పుస్తకపఠనంపై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఒంటెలను మొబైల్ లైబ్రరీలుగా ఉపయోగిస్తుంటే, మరికొందరు గుర్రం, గాడిదలను సైతం కదిలే గ్రంథాలయాలుగా తీర్చిదిద్దారు.
ఒంటె బండి వచ్చిందంటే...

రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించిన ‘ఒంటె బండి’ ఊరిలోకి ప్రవేశించగానే పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఆ బండి చుట్టూ చేరిపోతారు. అదేమీ మిఠాయి బండి కాదు. ఐస్‌క్రీమ్ బండి అంతకన్నా కాదు. అదొక కదిలే గ్రంథాలయం. పిల్లల చదువులపై కొవిడ్ తీవ్రమైన ప్రభావం చూపించింది. మారుమూల గ్రామాల పిల్లలు చదువుకు పూర్తిగా దూరమయ్యారు. అటువంటి వాళ్లను తిరిగి చదువుకునేలా చేసేందుకు, పిల్లలను ఎడ్యుకేట్ చేసేందుకు మొబైల్ లైబ్రరీలను నిర్వహిస్తున్నారు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా అధికారులు. ఇందుకోసం ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ‘క్యామెల్ కార్ట్’ లైబ్రరీలను ఏర్పాటు చేశారు. ‘‘జోధ్‌పూర్ జిల్లాలోని చాలా గ్రామాలను చేరుకోవడానికి సరైన రవాణా సదుపాయం లేదు.
కొన్ని గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. అలాంటి గ్రామాల్లో నివసించే పిల్లలకు చదువును చేరువ చేయాలనే ఉద్దేశంతో ఒంటెలపై మొబైల్ లైబ్రరీలను ఏర్పాటు చేశాం’’ అని అంటారు జోధ్‌పూర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్‌చంద్ శంక్లా. క్యామెల్ కార్ట్ లైబ్రరీలో పిల్లలను ఆకర్షించే బొమ్మల పుస్తకాలే ఎక్కువగా అందుబాటులో ఉంచారు. పిల్లలు ఆసక్తిగా నేర్చుకునేందుకు ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. కొవిడ్ సమయంలో పిల్లలకు చదువును చేరువ చేసేందుకు ‘భారత్ ఇంట్లో చదువుతోంది’ అనే థీమ్‌తో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ‘‘నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. స్కూల్‌లో లైబ్రరీ ఉండేది. కానీ కొవిడ్ వల్ల స్కూల్స్ మూతపడ్డాయి.
లైబ్రరీ అందుబాటులో లేకపోవడం వల్ల పుస్తకాలకు దూరమయ్యాం. అయితే మొబైల్ లైబ్రరీ మా ఆనందాన్ని తిరిగి తెచ్చింది’’ అని జోఽధ్‌పూర్ గ్రామీణ పాఠశాలలో చదువుతున్న అనిత అనే విద్యార్థిని అంటోంది. ఈ ‘కామెల్ కార్’్ట లైబ్రరీ జోధ్‌పూర్ చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాల్లో సేవలు అందిస్తోంది. ఈ మొబైల్ లైబ్రరీతో ఒంటెను నడిపే వ్యక్తి, స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక టీచర్ ఉంటారు. పిల్లల వయస్సు, వారి ఆసక్తిని బట్టి తగిన పుస్తకాలు అందిస్తారు. మొబైల్ లైబ్రరీ రావడం మొదలయ్యాకే తల్లిదండ్రులు సైతం పిల్లల దగ్గర ఒక గంట పాటు కూర్చుని చదివించడం, రాయించడం చేస్తున్నారని అధికారులు అంటున్నారు.
టూవీలర్‌పై పిల్లల చెంతకు...

ఉద్యోగులు ఆదివారం వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేసేందుకు రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు. కానీ శ్రీలంకకు చెందిన మహిండా దసనాయక మాత్రం అలా కాదు. తన టూ వీలర్ వెనకాల ఒక బాక్స్‌ని అమర్చుకుని అందులో రకరకాల పుస్తకాలు పెట్టుకుని బయలుదేరతారు. మారుమూల గ్రామాల్లో తిరుగుతూ పిల్లలకు కావలసిన పుస్తకాలు అందిస్తారు. ఆదివారం వచ్చినా, ఒకరోజు సెలవు దొరికినా పుస్తకాలు పట్టుకుని బైక్ స్టార్ట్ చేసి రయ్‌మంటూ దూసుకెళ్లిపోతుంటారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మహిండా 2017లో ‘బుక్ అండ్ మి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోని పిల్లలకు పుస్తకాలు అందించడం.
ఇందుకోసం తన బైక్‌ని లైబ్రరీగా మార్చారు మహిండా. ఈ మొబైల్ లైబ్రరీతో శ్రీలంకలోని కెగల్లే చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల్లో పిల్లలకు పుస్తకాలు అందిస్తున్నారు. గ్రంథాలయం లేని గ్రామాలకు మాత్రమే వెళుతుంటారు. ఈ గ్రామాలన్నీ తేయాకు తోటలు సాగు చేసే ప్రాంతాల్లో ఉన్నవే. మహిండా బైక్ కోసం పుస్తకాల పట్ల ఆసక్తి పెంచుకున్న పిల్లలు అదేపనిగా ఎదురుచూస్తుంటారు. ‘‘పిల్లలు క్రమక్రమంగా పుస్తక పఠనానికి అలవాటు పడుతున్నారు. ప్రతీసారి కొత్త పుస్తకాలతో వస్తానని పిల్లలందరూ నాకోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు’’ అని అంటారు మహిండా. బయోగ్రఫీలు, డిటెక్టివ్ స్టోరీస్, కామిక్స్ వంటి పిల్లలు అమితంగా ఇష్టపడే పుస్తకాలను తీసుకెళతారాయన.
ప్రస్తుతం మహిండా దగ్గర 3 వేల పుస్తకాలున్నాయి. ప్రతి నెలా జీతం రాగానే కొంత మొత్తంతో పుస్తకాలు కొంటుంటారు. ఆయన పుస్తకసేవను చూసిన కొందరు విరాళాలు ఇస్తుంటారు. ‘‘నేను వెళ్లే కొన్ని గ్రామాల్లోని పిల్లలు ఇప్పటి వరకు కథల పుస్తకాలు చూసి ఉండరు. పుస్తకాలు చదవడం వల్ల సమాజాన్ని చూసే విధానం మారుతుంది. వారి ఊహలు విస్తృతం అవుతాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని కష్టమైనా కొనసాగిస్తున్నా’’ అని అంటారు మహిండా. పిల్లలకు పుస్తకాలు అందించడమే కాకుండా చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంటారాయన. ‘సొంత ఇల్లు కట్టుకోవాలి. కారు కొనుక్కోవాలి వంటి ఆశలు లేవని, మారుమూల గ్రామాల పిల్లలు చదువుకునేలా చేయడంలోనే తనకు సంతోషం ఉంద’ని అంటున్న మహిండా ఆదర్శం కచ్చితంగా గొప్పదే.
ఘోడా లైబ్రరీ

ఎటు చూసినా కొండలు... లోయలు. కాస్త వర్షానికే విరిగిపడే కొండచరియలు. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యమే ఉండదు. గుర్రాలపై ప్రయాణం చేయాలి. లేదంటే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడల్లా పాఠశాలలు మూతపడతాయి. హిమాలయాల చెంతన ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో కనిపించే సాధారణ దృశ్యం ఇది. మరి పిల్లల చదువు ఏమైపోవాలి? ఆ ఆందోళన నుంచి పుట్టిందే ‘ఘోడా లైబ్రరీ’. వర్షాలతో పాఠశాల మూతపడిందంటే చాలు... ఘోడా లైబ్రరీ ఊళ్లోకి వచ్చేస్తుంది. గుర్రాలపై రకరకాల పుస్తకాలను అమర్చి పిల్ల చెంతకు పంపిస్తుంటారు. ఈ మొబైల్ లైబ్రరీని ‘సంకల్ప్ యూత్ ఫౌండేషన్’తో కలిసి శుభమ్ బదానీ ప్రారంభించారు. నైనిటాల్ చుట్టు పక్కల ఉన్న మారుమూల గ్రామాల్లోని పిల్లలకు పుస్తకాలను అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు కాకుండా పిల్లలు ఆసక్తిగా చదివే కథల పుస్తకాలు ఈ ఘోడా లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. అందుకే పిల్లలు ఘోడా లైబ్రరీ ఎప్పుడు వస్తుందా? అని ఆతృతతో ఎదురుచూస్తుంటారు.
బుక్స్ ఆన్ వీల్స్
కోస్గి మండలంలోని మారుమూల గ్రామం. సమయం ఉదయం 7 గంటలు. రయ్యిమంటూ ఒక వ్యాన్ వచ్చి చింత చెట్టు కింద ఆగింది. కాసేపటికే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆ వ్యాన్ చుట్టూ మూగారు. వ్యాన్‌లో నుంచి టేబుల్స్, డెస్క్‌లు, కుర్చీలు తీసి చెట్టు కింద సర్దుకున్నారు. ఎవరికి నచ్చిన పుస్తకం వాళ్లు తీసి చదవడంలో నిమగ్నమై పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇలాంటి దృశ్యమే కనిపిస్తూ ఉంటుంది. ఈ సంచార గ్రంథాలయాన్ని అనంతపూర్‌కు చెందిన ఎన్‌జీఓ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు ప్రారంభించింది. ఈ సంస్థ గత 50 ఏళ్లుగా గ్రామాల్లో అక్షరాస్యత రేటును పెంచడం, మూఢనమ్మకాలు పారదోలడం, బాల్యవివాహాలను నిరోధించడం లక్ష్యంగా పనిచేస్తోంది.
బాగా వెనకబడిన కోస్గి, మంత్రాలయం, కౌతాలం మండలాల్లోని పదహారు గ్రామాల్లో ఈ సంచార గ్రంథాలయం సేవలు అందిస్తోంది. ‘‘ఈ గ్రామాల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. స్కూల్ డ్రాపవుట్స్ చాలా ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తకపఠనం పట్ల ఆసక్తిని పెంచితే మార్పు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అని మొబైల్ లైబ్రరీకి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న క్రిష్ణవేణి అంటారు. మొదటి రెండేళ్లు పిల్లలు, పెద్దలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలు చురుగ్గా పాల్గొంటున్నారు. కాలేజ్ విద్యార్థులు పోటీ పరీక్షల పుస్తకాలు చదువుతున్నారు. సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ పుస్తకాలతో పాటు మ్యాగజైన్లు, రామాయణం, భగవద్గీత, భాగవతం వంటి ఆధ్యాత్మిక పుస్తకాలు ఈ లైబ్రరీలో ఉన్నాయి. సంచార గ్రంథాలయం కలలను సాకారం చేసే బండిగా గుర్తింపు పొందింది.
ఏడు దశాబ్దాలుగా...

చదువుకోవడానికి లైబ్రరీకి రాకపోతే... లైబ్రరీయే మీ దగ్గరకు వస్తుందని అంటున్నారు అధికారులు. దేశ రాజధానిలో నివసించే ప్రజలకు పుస్తకాలను చేరువ చేయడం కోసం ‘ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ’ మొబైల్ లైబ్రరీ సేవలను అందిస్తోంది. 1953లో ప్రారంభమైన మొబైల్ లైబ్రరీ సేవలు ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది మొబైల్ వ్యాన్లు, సుమారు 70 ప్రాంతాల్లో లైబ్రరీ సేవలు అందిస్తున్నాయి. ఈ వ్యాన్లలో రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. సంప్రదాయ లైబ్రరీలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ మొబైల్ లైబ్రరీ వ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ప్రతి రూట్‌లో సగటున 20 నుంచి 30 మంది మొబైల్ లైబ్రరీ సేవలను ఉపయోగించుకుంటున్నారు. పుస్తకాలను 14 రోజుల పాటు ఇంటికి తీసుకెళ్లి చదువుకునేందుకు అనుమతి కూడా ఇస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కువగా ఈ లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకెళుతుంటారు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు, మనవడు ఈ లైబ్రరీలో మెంబర్స్‌గా ఉన్నారంటే విశేషమే కదా.
‘ట్రామ్’ నిండా పుస్తకాలే...

దేశంలోని మొట్టమొదటి ‘ట్రామ్ లైబ్రరీ’ కోల్‌కతా నగరంలో ఏర్పాటయ్యింది. కాలేజ్ స్ట్రీట్‌లో ఉన్న లైబ్రరీ విద్యార్థులను ఆకర్షించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసింది ‘పశ్చిమబెంగాల్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పోరేషన్’. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే లైబ్రరీ నిర్వహణ జరుగుతోంది. ట్రామ్ లైబ్రరీలో పుస్తకాలు, మ్యాగజైన్లు, పోటీ పరీక్షల మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. ఉచితంగా లభించే వైఫైతో ఈ బుక్స్‌ని కూడా యాక్సెస్ చేసే వీలుంది. విద్యార్థులు సమయం వృథా కాకుండా వినియోగించుకోవచ్చు. 1902 నుంచి కోల్‌కతాలో ఎలక్ట్రిక్ ట్రామ్ కార్లు పనిచేస్తున్నాయి. ఆసియాలో నడుస్తున్న అతి పురాతన ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థగా దీనికి గుర్తింపు ఉంది. ట్రామ్ లైబ్రరీ రోజూ 70 కి.మీ ప్రయాణం చేస్తుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లైబ్రరీ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసుకునే వీలుంది.
మొత్తానికి అక్షరసేవకు నడుం బిగుస్తున్న ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తారు. పుస్తకాన్ని ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంతో పాటు, పుస్తక పఠనంపై ఆసక్తి కల్పించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఎంతైనా ప్రశంసనీయం.
- సండే డెస్క్
9 ఒంటెలు... 400 పుస్తకాలు...

కెన్యాలోని ఈశాన్య ప్రాంతాల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచడం కోసం ‘కెన్యా నేషనల్ లైబ్రరీ సర్వీస్’ ఈ సేవలను ప్రారంభించింది. ఈ మొబైల్ లైబ్రరీలో 9 ఒంటెలు 400కు పైగా పుస్తకాలను మోస్తూ గ్రామాలు తిరుగు తుంటాయి. పిల్లలకు ఉపయోగపడేలా పాఠ్య పుస్తకాల సిలబస్‌తో ఉండే పుస్తకాలు, స్టోరీబుక్స్, గ్రామర్ పుస్తకాలు, సెకండరీ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు ఈ మొబైల్ లైబ్రరీలో ఉంటాయి. క్యామెల్ మొబైల్ లైబ్రరీలో 3500 రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు.
ఖరీదైన కారే కానీ...
విలాసవంతమైన కారు గ్రంథాలయంగా మారడం ఎక్కడైనా చూశారా? అర్జెంటీనాలోని బ్రూనస్ ఎయిర్స్‌కు వెళితే ఈ దృశ్యం కనిపిస్తుంది. 70వ దశకంలో అర్జెంటీనాలో సైనిక నియంతృత్వ పాలన కొనసాగుతున్న సమయంలో ఫోర్డ్ ఫాల్కన్ కారు ఎక్కువగా కనిపించేది. ఆర్మీతో పాటు సీక్రెట్ పోలీసులు, యాంటీ కమ్యూనిస్టు డెత్ స్క్వాడ్ ఈ కారును వాడేవారు. అర్జెంటీనాకు చెందిన ఆర్టిస్టు రౌల్ లెమోసాఫ్ 1979 నాటి కారును సంపాదించి దాన్ని ట్యాంకు ఆకారంలోకి మార్చి మొబైల్ లైబ్రరీగా మార్చాడు. 900 పుస్తకాలతో బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరిగే ఈ మొబైల్ లైబ్రరీకి ‘వెపన్స్ ఆఫ్ మాస్ ఇన్‌స్ట్రక్షన్’ అని పేరు పెట్టాడు. ఇందులోని పుస్తకాలన్నీ దాతలు ఇచ్చినవే.
డాంకీ లైబ్రరీ
పిల్లలకు కథల పుస్తకాలు చదవాలని ఉంటుంది. కానీ అందుబాటులో ఉండవు. మారుమూల గ్రామాలు కావడంతో లైబ్రరీల ఊసే ఉండదు. కొలంబియాలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కొంతైనా మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లూయిస్ సొరియానో. మారుమూల గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. కొండ కోనల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే రెండు గాడిదలను ఎంచుకున్నాడు. వాటికి ఆల్ఫా, బీటా అని పేర్లు పెట్టాడు. వాటిపై పుస్తకాలు చక్కగా అమర్చి, మొబైల్ లైబ్రరీలుగా తీర్చిదిద్ది గ్రామాల బాట పట్టాడు. ఈ లైబ్రరీలో కథల పుస్తకాలు, హిస్టరీ బుక్స్, బ్రెజిలియన్ రచయిత పాలో కోయెలో రాసిన పుస్తకాలు, ఎన్‌సైక్లోపీడియాలు ఉన్నాయి. గ్రామాల్లో తిరుగుతూ పిల్లలకు కావలసిన పుస్తకాలు ఇచ్చి వెళతాడు. మరోసారి వచ్చినప్పుడు పిల్లలు ఆ పుస్తకాలు తిరిగి ఇచ్చేసి, కొత్తవి తీసుకుంటారు. కొన్ని పుస్తకాలు అద్దెకు కూడా ఇస్తుంటాడు. సొరియానో లైబ్రరీలో 4 వేల పుస్తకాలు ఉన్నాయి. ప్రతినెలా సొరియానో లైబ్రరీ నుంచి 300 మంది పుస్తకాలు అద్దెకు తీసుకుంటున్నారు.
నీటిలో తేలియాడుతూ...
లైబ్రరీకి వెళ్లాలంటే సైకిల్‌పైనో, బైక్ పైనో వెళతాం. లేదంటే నడిచి వెళతాం. కానీ ఈ లైబ్రరీకి వెళ్లాలంటే చిన్న పడవ వేసుకుని వెళ్లాలి. పుస్తకాలు సైతం పడవలో కూర్చునే చదువుకోవాలి. ఎందుకంటే అది ‘ఫ్లోటింగ్ లైబ్రరీ’. మిన్నెపొలిస్‌లోని సెడార్ సరస్సులో కనిపిస్తుందీ దృశ్యం. ఈ తేలియాడే గ్రంథాలయాన్ని ఆర్టిస్టు, రైటర్, ఎడ్యుకేటర్ అయిన సారా పీటర్ నిర్వహిస్తున్నారు. ఒక చెక్క తెప్పకు రెండు వైపులా రాక్స్ ఏర్పాటు చేసి పుస్తకాలు అమర్చారు. అభిరుచి, సృజనాత్మకత ఉన్న సారా పీటర్ రూపొందించిన ఈ లైబ్రరీని స్థానికులు సందర్శిస్తుంటారు. చిన్న చిన్న పడవలు, కయాక్‌లు, తేలియాడే బోర్డు సహాయంతో ఫ్లోటింగ్ లైబ్రరీకి వెళుతుంటారు. అక్కడే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి
Read Latest Telangana News and National News