Man Pulls Out Own Tooth: భరించలేనంత పన్ను నొప్పి.. దొరకని డెంటిస్ట్ అపాయింట్‌మెంట్.. రోగి షాకింగ్ నిర్ణయం
ABN , Publish Date - Apr 07 , 2025 | 08:13 PM
అర్ధరాత్రి పన్ను నొప్పి మొదలు కావడంతో ఓ వ్యక్తి భరించలేకపోయాడు. డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకక సతమతమయ్యాడు. చివరకు తన పన్ను తానే తొలగించుకున్నాడు. బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: అంతకంతకూ పెరుగుతున్న పంటి నొప్పి. ప్రభుత్వ డాక్టర్లకు ఫోన్ చేస్తే అపాయింట్‌మెంట్ లేదని తేల్చి చెప్పారు. నొప్పి అతడిని కుదురుగా ఉండనీయడం లేదు. చివరకు అతడు ఎవ్వరూ కలలో కూడా ఊహించని పని చేశాడు. బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తున్న ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
కాస్పర్స్ గ్రెనెన్‌బర్గ్స్ అనే 44 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి బ్రిటన్‌లోని నార్‌ఫోక్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. పన్ను పుచ్చిపోవడంతో ఇటీవల ఓ రోజు రాత్రి అతడికి తీవ్ర నొప్పి మొదలైంది. ఎందరు ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేదు. దీంతో, అతడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోని పైప్ రెంచ్‌తో తన పన్నును తానే తొలించుకున్నాడు. మొదట బాగా విస్కీ తాగి, ఆపై రెండు ఇబుబ్రూఫెన్, ఇతర పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుని బలవంతంగా తన పన్ను తానే లాగేసుకున్నాడు.
బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు చూసి అతడి భార్యాపిల్లలు షాకైపోయారు. తన పన్ను తానే తీసుకుంటానని అప్పటికి చాలా సేపటి నుంచే అతడు చెబుతున్నాడు. కానీ వారు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు రక్తమోడుతున్న అతడిని చూసి వారు నిర్ఘాంపోయాడు. క్రమంగా పన్ను నొప్పి తగ్గడంతో కాస్పర్స్‌కు సంతోషం ఆకాశాన్నంటింది.
‘‘మా ఏరియాలో అన్ని క్లినిక్‌లకు ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ కోరాను. కానీ ఎక్కడా దొరకలేదు. ప్రైవేటు డాక్టర్లు కూడా అపాయింట్‌మెంట్‌లు ఇవ్వలేదు. నొప్పి భరించలేకపోయాను. తలలో ఏదో విస్ఫోటనం జరుగుతున్నట్టు అనిపించింది. ప్రతి శ్వాస నరకప్రాయంగా మారింది. ఇందులో ఇలా చేయాల్సి వచ్చింది’’ అని అతడు చెప్పుకొచ్చాడు.
ఈ ఉదంతం బ్రిటన్‌లో కలకలానికి దారి తీసింది. నార్‌ఫోక్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో దంతవైద్య సౌకర్యాల లేమిపై జనాలు తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ దంతవైద్య సౌకర్యాలు లేక ఎన్నో ఏళ్లుగా తాము ఇబ్బందులు పడుతున్నామని కాస్పర్స్ చెప్పుకొచ్చాడు. ఒకసారి తన భార్యకు పంటినొప్పి వస్తే చికిత్స కోసం పక్క దేశానికి వెళ్లి రావాల్సి వచ్చిందని అన్నాడు. కానీ 24 గంటల వ్యవధిలోనే ఆమె సమస్య పరిష్కారమైందని అన్నాడు. ‘‘ఇక్కడ మేము ప్రభుత్వ ఇన్సూరెన్స్ కూడా పే చేస్తున్నాము. కానీ మాకు అవసరం వచ్చినప్పుడు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో ఉండరు’’ అని కాస్పర్స్ వాపోయాడు. అయితే, ఇలాంటి ప్రమాదకర చర్యలు అస్సలు వద్దని అక్కడి వైద్యులు ప్రజలను హెచ్చరించారు. భారీ సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు