While Fleeing Stray Dog Attack: పెను విషాదం.. వీధి కుక్కలనుంచి తప్పించుకోబోయి..
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:50 PM
వీధి కుక్కల కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ వ్యక్తి కుక్కల నుంచి తప్పించుకోబోయి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా, గుజరాత్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పరిగెత్తుతూ రోడ్డుపై పడ్డ అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సూరత్‌కు చెందిన 38 ఏళ్ల ఇబ్రహీం అలియాస్ ఎజాజ్ అహ్మద్ అన్సారీ అక్టోబర్ 24వ తేదీన మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు.
భండారీవాడ్, సైయేద్‌పుర ఏరియాలోకి రాగానే ఆరు నుంచి ఏడు కుక్కలు అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలోనే అహ్మద్ వాటినుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాడు. అవి అతడ్ని వెంబడించాయి. అహ్మద్ పరుగులు తీస్తూ ఓ చోట ఠక్కున కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అహ్మద్ కిందపడ్డంతో కుక్కలు అతడ్ని ఏమీ చెయ్యకుండానే అక్కడినుంచి పారిపోయాయి.
ఇక, తీవ్రంగా గాయపడ్డ అహ్మద్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ హ్యామరేజ్ అయిందని గుర్తించారు. గత కొద్దిరోజుల నుంచి కోమాలో ఉన్న అతడికి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ అహ్మద్ చనిపోయాడు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీల దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు జంతు ప్రేమికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అహ్మద్ కుటుంబానికి ఎవరు సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజల్ని మోసం చేయడం.. జగన్‌కు లెక్కేకాదు..
జూబ్లీహిల్స్‌లో హీటెక్కిన ప్రచారం.. గల్లీలు, బస్తీలపైనే దృష్టి..