ఊరు ఊరంతా ఆర్టిస్టులే....
ABN , Publish Date - Feb 23 , 2025 | 10:48 AM
ఈ రోజుల్లో ఊరికి ఒక ఆర్టిస్టు ఉన్నారంటే పెద్ద విశేషం.. అలాంటిది ఊరు ఊరంతా చేయితిరిగిన పెయింటర్లుంటే అదెంత అద్భుతమో కదా!. ఆ రంగురంగుల పల్లె .. ఒడిశాలోని పూరీ జిల్లాకు సమీపంలో ఉన్న రఘురాజ్‌పూర్.

ఈ రోజుల్లో ఊరికి ఒక ఆర్టిస్టు ఉన్నారంటే పెద్ద విశేషం.. అలాంటిది ఊరు ఊరంతా చేయితిరిగిన పెయింటర్లుంటే అదెంత అద్భుతమో కదా!. ఆ రంగురంగుల పల్లె .. ఒడిశాలోని పూరీ జిల్లాకు సమీపంలో ఉన్న రఘురాజ్‌పూర్.
‘‘మీరు ఏం చేస్తుంటారు?’’
‘‘పెయింటింగ్.. ’’
‘‘మీ పక్కింట్లోళ్లు..?’’
‘‘వాళ్లు కూడా ఇదే వృత్తి’’
‘‘ఊర్లో ఎక్కడికెళ్లినా ఆర్టిస్టులు ఉన్నట్లున్నారే’’
‘‘ఒకరిద్దరు కాదు.. ఆ వీధి ఈ వీధి కాదు.. ఊరు ఊరంతా ఇదే కత..’’
... కుటుంబ సర్వేకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉద్యోగి... స్థానికునితో సంభాషించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఊర్లోకి ఎవరొచ్చినా.. ఇదే వింత అనుభవం. విదేశీయులైతే ఇంకా ఆశ్చర్యపోతారు. ప్రతి ఊరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది... కానీ రఘురాజ్‌పూర్ మాత్రం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. ఊర్లోని ముప్పావువంతు కుటుంబాలు ఆర్ట్ మీద ఆధారపడి జీవించడం.. ఆ ప్రత్యేకత!.
పూరీ నుంచి వెళితే పది కి.మీ., భువనేశ్వర్ నుంచి వెళితే 50 కి.మీ. దూరంలో ఉంటుంది రఘురాజ్‌పూర్. జనాభారీత్యా పెద్ద ఊరేమీ కాదు. చిన్న ఊరే!. కానీ దేశ విదేశాల్లో పేరు గడించింది. తాతలు ముత్తాతల కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న ‘పటచిత్ర’ ఆర్ట్‌తో ఈ ఘనత సాధించింది. వస్త్రంపైన రకరకాల రంగులతో అద్భుతమైన పెయింటింగ్స్‌ను వేస్తారు కళాకారులు. ఈ ప్రాంతంలో పూరీ జగన్నాథ ఆలయం ఉంది కాబట్టి.. స్వామి వారి ప్రభావం చిత్రలేఖనంపై పడింది. జగన్నాథ, వైష్ణవ, కృష్ణభగవానుల కేంద్రంగా ఇతివృత్తాలను ఎంచుకుని కాన్వాస్‌లపై పెద్ద పెద్ద చిత్రాలను గీస్తుంటారు.
ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాస, జానపద కథలు బొమ్మల్లో ప్రతిఫలిస్తుంటాయి. ముఖ్యంగా హిందూ ఆధ్యాత్మిక భావజాలమే ఎక్కువ. పురాణాలు, ఇతిహాసాలు, భారతీయ ధర్మశాస్త్రాల ప్రభావం ఆర్టిస్టులపై అధికం. ‘‘మా ఊర్లో మొట్టమొదట ‘పటచిత్ర’ ప్రక్రియను ఎవరు ప్రవేశపెట్టారో తెలీదు. మాకు మా తండ్రులు, తాతలు నేర్పించారు. వారికి వాళ్ల పూర్వీకుల నుంచి సంప్రదాయంగా అలవడింది. మేము తిరిగి మా పిల్లలకు నేర్పిస్తున్నాం. నేటితరం ఏ వృత్తిలోనైనా స్థిరపడొచ్చు.. కానీ వారసత్వంగా వచ్చిన ఈ కళను మాత్రం వారికి ఆస్తిగా అందిస్తున్నాం..’’ అన్నారు రఘురాజ్‌పూర్‌లోని ఆర్టిస్టు సేనాపతి.
కాలంతోపాటు చిత్రలేఖన ధోరణి కూడా మారుతూ వచ్చింది. ఊర్లోని పెద్దలు ఒకప్పుడు పూరీ జగన్నాథస్వామి నుంచి విష్ణు దశావతారాల వరకు ఆధ్యాత్మిక చింతనతోనే చిత్రాలను గీసేవారు. ఇప్పుడు తీరు మారింది. రకరకాల అంశాలు ఇతివృత్తాలు అవుతున్నాయి. పూలకుండీలు, జగ్గులు, కెటిల్స్, కొబ్బరిచిప్పలు, గడియారాలపై పటచిత్ర బొమ్మల్ని వేస్తున్నారు కళాకారులు. దీంతో అమ్మకాలు కూడా పెరిగాయి. ఉపాధి లభిస్తోంది. కొన్నేళ్ల నుంచి రఘురాజ్‌పూర్ ఆర్ట్‌కు ప్రసిద్ధి చెందడంతో ప్రధాని నరేంద్రమోదీ దృష్టిలో పడింది. ఆయన ఆ ఊరి నుంచి ఒక చిత్రలేఖనాన్ని తెప్పించుకుని ఫ్రాన్స్ మాజీ ప్రధానికి బహూకరించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాలకు గిరాకీ పెరిగింది. ఇళ్లు, ఆలయాలు, ఆఫీసులు, కార్యాలయాల్లో రఘురాజ్‌పూర్ బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఊరు ఊరంతా ఆర్ట్‌నే నమ్ముకుని జీవిస్తోందిప్పుడు!